TG Group1: తెలంగాణ గ్రూప్1 ఇంటర్వ్యూలకు లైన్ క్లియర్, జీవో29పై దాఖలైన పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు
TG Group1: తెలంగాణలో గ్రూప్ 1పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 29పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. గ్రూప్ 1లో రిజర్వేషన్ల అంశం తేలే వరకు ఇంటర్వ్యూలు నిలిపివేయాలని కోరుతూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు.
TG Group1: తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల ఫలితాల విడుదలపై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. దీంతో ఇంటర్వ్యూలకు లైన్ క్లియర్ అయ్యింది. రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చే వరకు ఇంటర్వ్యూలను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
జీవో 29ను రద్దు చేయాలని గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు ముందు నుంచి అభ్యర్థులు ఆందోళన చేశారు. ఈ వివాదం సుప్రీం కోర్టును కూడా చేరింది. పరీక్షల్ని వాయిదా వేయడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. దీంతో పరీక్షలు యథావిధిగా కొనసాగాయి. జీవో 55 ప్రకారమే అభ్యర్థుల ఎంపిక ఉండాలని, జీవో 29తో రిజర్వేషన్ల ఉల్లంఘన జరుగుతోందని... ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్…. పాత గ్రూప్ 1 నోటిఫికేషన్ కు మరికొన్ని పోస్టులను జత చేసింది. మొత్తం 563 పోస్టులకు 2024 ఫిబ్రవరి 19న ప్రకటన జారీ చేసింది. 4,03,645 మంది అప్లికేషన్లు చేసుకోగా… జూన్ 9న ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగింది. మెయిన్స్ పరీక్షలకు 31,382 మంది అభ్యర్థులు ఎంపిక కాగా… వీరిలో 21,093 మంది మెయిన్స్ పేపర్లు రాశారు. వీరి ధ్రువపత్రాలను పరిశీలించి… తుది ఫలితాలను ప్రకటించనున్నారు. 2025 మార్చి-ఏప్రిల్‌లోగా ఉద్యోగ నియామకాలు భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
మరోవైపు గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలపై టీజీపీఎస్సీ ఫోకస్ పెట్టింది. ఇటీవల మెయిన్స్ పరీక్షలు పూర్తి కాగా… జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ప్రారంభించింది. మెయిన్స్ పరీక్షల మూల్యాంకనం పూర్తి కాగానే… మెరిట్ జాబితాను సిద్ధం చేయనుంది. ఒక్క పోస్టుకు ఇద్దరిని ఎంపిక చేసి వారి ధ్రువపత్రాలను పరిశీలించనుంది.
ఇదంతా కూడా పూర్తి చేసేందుకు రెండు నుంచి మూడు నెలల సమయం పట్టనుంది. తుది ఫలితాలను ఫిబ్రవరి మాసంలో ప్రకటించాలని టీజీపీఎస్సీ యోచిస్తోంది. ఇందుకు ఫిబ్రవరి 20వ తేదీలోపే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ సమయం దాటినా ఆ తర్వాతి నెలలోనైనా ఫలితాలు రావొచ్చు.