అమెరికాలో విదేశీయుల ఉద్యోగాల కోసం అత్యంత కీలకమైన హెచ్1బీ వీసాలకు అర్హత సాధించడం మరింత కష్టతరం కాబోతోంది! అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యంత్రాంగం దీనికి సంబంధించి కొత్త నిబంధనలను ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త ప్రతిపాదనల్లో హెచ్1బీ వీసాను ఉద్యోగ యజమానులు ఎలా ఉపయోగించాలి? అలాగే ఎవరు ఈ వీసాకు అర్హులు? అనే దానిపై మరిన్ని ఇమ్మిగ్రేషన్ ఆంక్షలు ఉంటాయని భావిస్తున్నారు.
ఇటీవలే హెచ్1బీ వీసా హోల్డర్ల కోసం 100,000 డాలర్ల ఫీజును శ్వేతసౌధం ప్రకటించడానికి కొద్దిగా ముందు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) తన రెగ్యులేటరీ ఎజెండాను విడుదల చేసింది. అందులో హెచ్1బీ కేటగిరీని మార్చేందుకు ఉద్దేశించిన ఒక నియమావళి ఉంది.
"రీఫార్మింగ్ ది హెచ్1బీ నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా క్లాసిఫికేషన్ ప్రోగ్రామ్" అనే పేరుతో రానున్న ఈ నిబంధనల సారాంశం ప్రకారం.. "వీసా పరిమితి నుంచి మినహాయింపు పొందడానికి ఉన్న అర్హతలను సవరించడం, నిబంధనలను ఉల్లంఘించిన యజమానులపై మరింత కఠినంగా వ్యవహరించడం, థర్డ్-పార్టీ ప్లేస్‌మెంట్‌లపై పర్యవేక్షణను పెంచడం వంటి అంశాలపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ప్రతిపాదన చేయనుంది. ఈ మార్పులన్నీ హెచ్1బీ నాన్-ఇమ్మిగ్రెంట్ ప్రోగ్రామ్ విశ్వసనీయతను మెరుగుపరచడానికి, అలాగే యూఎస్ కార్మికుల వేతనాలు, పని పరిస్థితులను మెరుగ్గా రక్షించడానికి ఉద్దేశించినవి," అని అందులో పేర్కొన్నారు.
ఈ కొత్త నిబంధనలను డిసెంబర్ 2025లో ప్రచురించే అవకాశం ఉందని ఆ ప్రకటనలో తెలిపారు!
కొత్త హెచ్1బీ నియమావళిలో పలు అంశాలు ఉండే అవకాశం ఉంది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. నైపుణ్యం కలిగిన విదేశీయులు హెచ్1బీ హోదా పొందడం మరింత కష్టతరం చేసే అంశాలు ఇందులో ఉండొచ్చు. అంతేకాకుండా, హెచ్1బీ వీసా హోల్డర్లు కస్టమర్ల సైట్లలో పనిచేయకుండా నిరోధించే అంశాలు కూడా ఇందులో భాగం కావొచ్చు. ట్రంప్ పరిపాలన 2020లో తీసుకురావడానికి ప్రయత్నించి విఫలమైన నిబంధనల్లో ఇవి కూడా ఉన్నాయి.
ట్రంప్ మొదటి పదవీకాలంలో, హెచ్1బీ కేటగిరీకి సంబంధించి తుది నిబంధనల మార్పును ప్రచురించడంలో ప్రభుత్వం విఫలమైంది. అది ఆలస్యంగా ప్రచురితం అవ్వడంతో, అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ యాక్ట్‌ను ఉల్లంఘించిందనే కారణంతో 2020 అక్టోబర్ 8న ఒక న్యాయమూర్తి దానిని అడ్డుకున్నారు. ఈసారి ముందుగానే ప్రారంభిస్తున్నందున, ట్రంప్ ప్రభుత్వ అధికారులు అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని ఆశిస్తున్నారు.
ట్రంప్ మొదటి పదవీకాలంలో, ఒక ఉద్యోగిని కస్టమర్ స్థలంలో పనిచేయడానికి పంపడం కంపెనీలకు అసాధ్యంగా మార్చేందుకు అధికారులు ప్రయత్నించారు. 2018 కాంట్రాక్ట్స్ అండ్ ఇటినరీస్ మెమో కొత్త హెచ్1బీ ఆంక్షలను విధించింది. దీని ప్రకారం.. హెచ్-1బీ సిబ్బందిని కస్టమర్ సైట్‌లలో పనిచేయడానికి కంపెనీలు పంపాలనుకుంటే, యూఎస్‌సీఐఎస్ ఆమోదం కాలపరిమితిని తగ్గించేది. కొన్నిసార్లు ఒక రోజుకు మాత్రమే పరిమితం చేసేది!
హెచ్1బీ తాత్కాలిక వీసాలు సాధారణంగా నైపుణ్యం కలిగిన విదేశీయులు యూఎస్‌లో ఎక్కువ కాలం పనిచేయడానికి, చివరికి గ్రీన్ కార్డ్ ద్వారా శాశ్వత నివాసం పొందడానికి ఉన్న ఏకైక మార్గం!
హెచ్1బీ వార్షిక పరిమితి 65,000 మాత్రమే.
అమెరికా విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదివిన వారికి అదనంగా 20,000 వీసాల మినహాయింపు (Exemption) ఉంది.
పరిశోధనల ప్రకారం, హెచ్-1బీ వీసా హోల్డర్లకు స్థానిక కార్మికులతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు. అయినప్పటికీ, ట్రంప్ మొదటి పదవీకాలంలో, యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అమలు చేసిన విధానాల వల్ల చారిత్రాత్మకంగా అత్యధిక హెచ్1బీ తిరస్కరణ రేట్లు నమోదయ్యాయి. తర్వాత చట్టపరమైన వివాదాలు రావడంతో, చట్టపరమైన పరిష్కారం తర్వాత ఆ ఏజెన్సీ ఆ విధానాలను ఉపసంహరించుకుంది.
సంబంధిత కథనం