10 fastest growing skills: 2030 నాటికి ఈ స్కిల్స్ లేకపోతే చాలా కష్టం; వెనుకబడిపోతారు..
10 fastest growing skills: 2030 నాటికి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్ 10 నైపుణ్యాలను డబ్ల్యూఈఎఫ్ నివేదిక వెల్లడించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), బిగ్ డేటా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఆ తరువాత నెట్వర్క్, సైబర్ సెక్యూరిటీ ఉన్నాయి.
10 fastest growing skills: వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) ‘ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ 2025’ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. 2030 నాటికి 170 మిలియన్ల కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయని, 92 మిలియన్ల ఉద్యోగాలు కాలగర్భంలో కలిసిపోతాయని, ఫలితంగా 2030 నాటికి నికరంగా 78 మిలియన్ల ఉద్యోగాలు పెరుగుతాయని పేర్కొంది.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక
1,000కు పైగా కంపెనీల డేటా ఆధారంగా డబ్ల్యూఈఎఫ్ ఈ నివేదికను రూపొందించింది. నిపుణులైన ఉద్యోగుల కొరత దాదాపు అన్ని కంపెనీల్లో ఉందని డబ్ల్యూఈఎఫ్ గుర్తించింది. ఆ నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలను పొందవచ్చని సూచించింది.
2030 నాటికి వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్ 10 నైపుణ్యాలు
2030 నాటికి వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్ 10 స్కిల్స్ గురించి ఈ నివేదికలో సమగ్రంగా వివరించారు. ఈ నైపుణ్యాలపై అవసరమైన అందరూ అవగాహన కలిగి ఉండాలని సూచించింది. అలాగే, వీటిని సమకూర్చుకునే దిశగా విద్యార్థులు, ఈ స్కిల్స్ ను అందించే దిశగా విద్యా సంస్థలు, సిలబస్ లో ఈ నైపుణ్యాలను చేర్చే దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని డబ్ల్యూఈఎఫ్ నివేదిక సూచించింది. డబ్ల్యూఈఎఫ్ నివేదిక సూచించిన ఆ టాప్ 10 నైపుణ్యాలు లేదా స్కిల్స్ ఇవే..
- కృత్రిమ మేథ (artificial intelligence AI), బిగ్ డేటా
- నెట్ వర్క్స్, సైబర్ సెక్యూరిటీ
- టెక్నలాజికల్ లిటరసీ
- క్రియేటివిటీ
- మానసిక దృఢత్వం, మార్పునకు సిద్ధంగా ఉండడం, చురుకుదనం (resilience, flexibility, and agility)
- ఉత్సుకత లేదా ఆసక్తి, సదా నేర్చుకునే తత్వం (Curiousness and lifelong learning)
- నాయకత్వం, సామాజంపై ప్రభావం చూపడం (leadership and social influence)
- టాలెంట్ మేనేజ్ మెంట్
- విశ్లేషణాత్మక ఆలోచన (analytical thinking)
- పర్యావరణ హిత సారధ్యం (environmental stewardship)
2025లో కోర్ స్కిల్స్
2025లో అవసరమైన టాప్ 10 కోర్ స్కిల్స్ గురించి కూడా ఆ నివేదికలో పేర్కొన్నారు. ఈ విభాగంలో, విశ్లేషణాత్మక ఆలోచన కు టాప్ పొజిషన్ ఇచ్చారు. ఆ తరువాత స్థానాల్లో మానసిక దృఢత్వం, మార్పునకు సిద్ధంగా ఉండడం, చురుకుదనం (resilience, flexibility, and agility) ఉన్నాయి. నాయకత్వం, సామాజిక ప్రభావం, సృజనాత్మక ఆలోచన, ప్రేరణ, స్వీయ-అవగాహన, సాంకేతిక అక్షరాస్యత, సహానుభూతి, ఆసక్తి, కుతూహలం, జీవితకాల అభ్యాసం, టాలెంట్ మేనేజ్మెంట్, సేవా దృక్పథం.. తరువాతి స్థానాల్లో నిలిచాయి.