బీసీ సంక్షేమశాఖ నుంచి గుడ్ న్యూస్ - త్వరలోనే ఉచిత ‘సివిల్స్’ కోచింగ్...!-free coaching for civil services to start soon through bc study circle in andhrapradesh ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  బీసీ సంక్షేమశాఖ నుంచి గుడ్ న్యూస్ - త్వరలోనే ఉచిత ‘సివిల్స్’ కోచింగ్...!

బీసీ సంక్షేమశాఖ నుంచి గుడ్ న్యూస్ - త్వరలోనే ఉచిత ‘సివిల్స్’ కోచింగ్...!

రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ఉచిత సివిల్ సర్వీసెస్ కోచింగ్ ప్రారంభిస్తామని ఆ శాఖ మంత్రి సవిత తెలిపారు. వంద మంది బీసీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అందిస్తామని వివరించారు.

వంద మంది బీసీ అభ్యర్థులకు ఉచిత సివిల్స్ కోచింగ్

రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిల్ ద్వారా త్వరలో సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో వివిధ పోటీ పరీక్షలకు బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత శిక్షణ అందజేయనున్నట్లు తెలిపారు.

శుక్రవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నాలుగో బ్లాక్ లో మంత్రి సవితను ఏపీ బీసీ స్టడీ సర్కిల్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు కలిశారు. బీసీ సంక్షేమ శాఖకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు వచ్చినందుకు గానూ మంత్రిని వారు సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ… ఉచిత సివిల్స్ కోచింగ్ పై ప్రకటన చేశారు.

రాబోయే రోజుల్లో వివిధ పోటీ పరీక్షలకు బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందజేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. దీనిలో భాగంగా త్వరలో సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం ఉచిత కోచింగ్ ప్రారంభిస్తామన్నారు.

త్వరలోనే కొత్త బ్యాచ్….

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత తొలి విడతగా 83 మందికి సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందజేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. మరో బ్యాచ్ కు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ బ్యాచ్ లో వంద మంది వరకూ ఉంటారని తెలిపారు. అమరావతిలో 5 ఎకరాల్లో బీసీ స్టడీ సర్కిల్ భవన నిర్మాణం చేపట్టనున్నామన్నారు.

ప్రభుత్వం ఏటా డీఎస్సీ నిర్వహించాలని నిర్ణయించిందని, బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా బీసీ అభ్యర్థులకు డీఎస్సీ ఉచిత కోచింగ్ కూడా అందజేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సవిత వివరించారు. ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో 270 మంది బీసీ అభ్యర్థులు టీచర్లగా ఎంపిక కావడానికి కృషి బీసీ స్టడీ సర్కిల్ సిబ్బందిని మంత్రి సవిత అభినందించారు.

ఈ సందర్భంగా పలు సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రి సవితకు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు వినతి పత్రం అందజేశారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం