AP Civils Coaching : గిరిజ‌న నిరుద్యోగ యువ‌త‌కు గుడ్‌న్యూస్‌.. సివిల్స్ ప‌రీక్షలకు ఉచిత కోచింగ్‌.. ముఖ్య వివ‌రాలివే-free coaching for civil services exams for tribal unemployed youth in ap ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ap Civils Coaching : గిరిజ‌న నిరుద్యోగ యువ‌త‌కు గుడ్‌న్యూస్‌.. సివిల్స్ ప‌రీక్షలకు ఉచిత కోచింగ్‌.. ముఖ్య వివ‌రాలివే

AP Civils Coaching : గిరిజ‌న నిరుద్యోగ యువ‌త‌కు గుడ్‌న్యూస్‌.. సివిల్స్ ప‌రీక్షలకు ఉచిత కోచింగ్‌.. ముఖ్య వివ‌రాలివే

HT Telugu Desk HT Telugu

AP Civils Coaching : గిరిజ‌న నిరుద్యోగ యువ‌త‌కు ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సివిల్స్ ప‌రీక్ష‌కు సంబంధించి ఉచిత కోచింగ్ ఇవ్వనుంది. ఉచిత కోచింగ్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు మార్చి 13వ తేదీని ఆఖ‌రి గ‌డువుగా నిర్ణ‌యించింది. ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని ప్ర‌భుత్వం కోరుతుంది.

సివిల్స్ ప‌రీక్షలకు ఉచిత కోచింగ్‌

సివిల్ స‌ర్వీస్ ప‌రీక్ష‌లకు సంబంధించి ఏపీ గిరిజ‌న సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో.. ఉచితంగా శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అభిషేక్ గౌడ తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశాల మేర‌కు.. విశాఖ‌ప‌ట్నం జిల్లా వేప‌గుంట యూత్ ట్రైనింగ్ సెంట‌ర్‌లో శిక్ష‌ణ అందిస్తామ‌ని వెల్లడించారు. డిగ్రీ ఉత్తీర్ణులైన ఆస‌క్తి గ‌ల యువ‌త ఈనెల 13 తేదీ లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోరారు. పాడేరు, సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, కోటరామచంద్రపురం (కేఆర్ పురం), చింతూరు, నెల్లూరు, శ్రీశైలం లోని ఐటీడీఏ కార్యాల‌యాల్లో ద‌ర‌ఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయ‌ని తెలిపారు.

స్క్రీనింగ్ టెస్టు..

దీనికి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంద‌ని, మార్చి 14, 15 తేదీల్లో హాల్ టికెట్లను జారీ చేస్తామ‌ని అభిషేక్ వెల్లడించారు. 16న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. మొద‌టి స్క్రీనింగ్ టెస్ట్‌లో అర్హ‌త సాధించిన అభ్య‌ర్థుల‌కు ఈనెల 20 నుంచి 22 వ‌ర‌కు రెండో స్క్రీనింగ్ టెస్ట్ కోసం హాల్ టికెట్ల‌ను జారీ చేస్తామ‌న్నారు. ఐటీడీఏల ప‌రిధిలో డిగ్రీ ఉత్తీర్ణులైన గిరిజ‌న యువ‌త ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు. అనుభ‌వజ్ఞులైన ఫ్యాక‌ల్టీతో శిక్ష‌ణ ఉంటుంద‌ని, శిక్ష‌ణ స‌మ‌యంలో వ‌స‌తి, భోజ‌న స‌దుపాయం క‌ల్పిస్తామ‌ని వివరించారు.

విశాఖలో..

పాడేరు, పార్వ‌తీపురం, సీతంపేట‌, రంప‌చోడ‌వ‌రం ఐటీడీఏల ప‌రిధిలోని అభ్య‌ర్థులంద‌రికీ విశాఖ‌ప‌ట్నంలో సివిల్స్ ఉచిత‌ కోచింగ్ ఉంటుంది. మిగిలిన ఐటీడీఏల‌కు కూడా ఆయా ప్రాంతాకు స‌మీపంలో ఉచిత కోచింగ్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేస్తారు. విద్యార్థులు ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకుని ఉచిత కోచింగ్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని.. రాష్ట్ర ఎస్టీ సంక్షేమ శాఖ కోరుతోంది. పూర్తి వివ‌రాలు ఆయా ఐటీడీఏల‌ను సంప్ర‌దించాల‌ని సూచించింది.

ఉచిత శిక్ష‌ణ‌.. ఉపాధి..

విశాఖ‌ప‌ట్నం పోర్టు అథారిటీ (వీపీఏ), సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ మారిటైం షిప్ బిల్డింగ్ (సీఈఎంఎస్‌) ఆధ్వ‌ర్యంలో.. నిరుద్యోగ యువ‌తకి ఉచిత శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు. అలాగే శిక్ష‌ణ పూర్తి చేసుకున్న త‌రువాత ఉపాధి క‌ల్పించ‌నున్నారు. కొరియర్ సూపర్ వైజర్, వేర్ హౌస్ ఎగ్జిక్యూటివ్‌, సీఎన్‌సీ ఆప‌రేట‌ర్‌, డిజైన్ ఇంజినీర్ త‌దిత‌ర‌ కోర్సుల్లో రెండు నుంచి మూడు నెల‌ల పాటు ఉచిత వ‌స‌తితో పాటు శిక్ష‌ణ ఇస్తారు. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న నిరుద్యోగ యువ‌తి నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను కోరుతున్నామ‌ని సీఈఎంఎస్‌ సంస్థ చీఫ్ ఆప‌రేటింగ్‌ ఆఫీస‌ర్ గోపీకృష్ణ‌ తెలిపారు.

దరఖాస్తు చేసుకోవాలి..

ఈ ఉచిత శిక్ష‌ణ‌కు 27 ఏళ్ల లోపు వ‌య‌స్సు గ‌ల ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌, డిగ్రీ, ఐటీఐ ఉత్తీర్ణులైన యువ‌తీ, యువ‌కులు అర్హుల‌ని తెలిపారు. ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు. విద్యార్హ‌త‌, కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు, రేష‌న్ కార్డు, ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీల సెట్‌తో హాజ‌రుకావాల్సి ఉంటుంది. మ‌రిన్ని వివ‌రాల కోసం 7794840934, 8688411100 ఫోన్ నెంబ‌ర్ల‌ను సంప్ర‌దించాల‌ని, లేక‌పోతే విశాఖ‌ప‌ట్నం సింథియా జంక్ష‌ణ్‌లో గ‌ల సీఈఎంఎస్ కేంద్రంలో సంప్ర‌దించాల‌ని కోరారు.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.