TG DSC 2008 Postings : డీఎస్సీ-2008 అభ్యర్థులకు గుడ్ న్యూస్ - వారందరికీ పోస్టింగ్‌లు, ఉత్తర్వులు జారీ-education department issued orders giving postings to dsc 2008 candidates ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Tg Dsc 2008 Postings : డీఎస్సీ-2008 అభ్యర్థులకు గుడ్ న్యూస్ - వారందరికీ పోస్టింగ్‌లు, ఉత్తర్వులు జారీ

TG DSC 2008 Postings : డీఎస్సీ-2008 అభ్యర్థులకు గుడ్ న్యూస్ - వారందరికీ పోస్టింగ్‌లు, ఉత్తర్వులు జారీ

Maheshwaram Mahendra Chary HT Telugu
Published Feb 15, 2025 11:09 AM IST

డీఎస్సీ 2008లో నష్టపోయిన అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 1,382 మంది అభ్యర్థులకు పోస్టింగులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరందర్నీ సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్‌జీటీ)గా నియమించింది. కాంట్రాక్ట్ విధానంలో సేవలను వినియోగించుకోనుంది.

 డీఎస్సీ-2008 అభ్యర్థులకు పోస్టింగులు
డీఎస్సీ-2008 అభ్యర్థులకు పోస్టింగులు

డీఎస్సీ 2008లో నష్టపోయిన అభ్యర్థుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.1382 మంది బీఈడీ అభ్యర్థులకు పోస్టింగులు అందజేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

వీరిని రెగ్యూలర్ గా కాకుండా… కాంట్రాక్ట్ విధానంలో నియమించింది. వీరికి అన్ని కలుపుకుని రూ. 31,040 వేతనం అందించనున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులపై ఆయా అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

2008లో పోస్టింగులు దక్కని వారికి కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో హామీనిచ్చింది. ఈ క్రమంలోనే వీరి విషయంలో ప్రభుత్వం సానుకూలమైన నిర్ణయం తీసుకుని… పోస్టింగులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో 2008 డిఎస్సీ బాధిత అభ్యర్థులున్నారు. ప్రస్తుత నిర్ణయంతో వీరంతా కూడా విధులు నిర్వర్తించనున్నారు.

ఏం జరిగిందంటే….?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2008లో డీఎస్సీ నిర్వహించారు. ఇందులో 30 శాతం ఎస్జీటీ పోస్టులను ప్రత్యేకంగా డీఈడీ పూర్తి చేసినవారికి కేటాయించారు. దీంతో మార్కుల ద్వారా ముందున్నా బీఈడీ అభ్యర్థులు…. డీఈడీ విద్యార్ధులకు 30శాతం కోటా ఇవ్వడంతో నష్టపోయారు. ప్రభుత్వ నిర్ణయంతో తమకు అన్యాయం జరిగిందని, తమకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలంటూ నాటి నుంచి వారు న్యాయ పోరాటం చేస్తున్నారు.

న్యాయస్థానాల్లో కూడా బాధితులకు న్యాయం చేయాలని తీర్పునిచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో 2008లో పోస్టింగ్ దక్కని వారికి న్యాయం చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది.

ఈ క్రమంలోనే కొద్దిరోజుల కిందట వారికి కాంట్రాక్టు విధానంలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్జీటీ) ఉద్యోగాలు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాల ప్రకారం జాబితాలను పరిశీలించి…. నియామకాలను చేపట్టారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టో బరు 5వ తేదీ వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల వెరిఫికేషన్‌ చేపట్టారు. అర్హుల వివరాలను పరిశీలించిన తర్వాత…. శుక్రవారం పోస్టింగ్ లు ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

 

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం