ఏపీలో ఇంజినీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవే శాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్-2025 పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది ఈఏపీ సెట్‌కు 3,62,429 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఈఏపీ సెట్ 2025కు ఇంజినీరింగ్ విభాగంలో 2,80,597 మంది అభ్యర్థులు, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 81,832 మంది దరఖాస్తు చేసుకున్నారు.మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు, 21 నుంచి 27వ తేదీ వరకు ఇంజినీరింగ్ విభాగాల్లో ప్రవేశ పరీక్ష లు నిర్వహిస్తారు.
ఈఏపీ సెట్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఓ సెషన్, మధ్యాహ్నం 2 నుంచి 5వరకు మరో సెషన్‌లో పరీక్షలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో 145 కేంద్రాల్లో, తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్ ఒక్కోటి చొప్పున ఆన్ లైన్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
విద్యా ర్థులకు ఏపీ ఈఏపీసెట్ పరీక్ష కేటాయించిన తేదీలో ఇతర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ఉంటే ఆధారాలతో హెల్ప్ లైన్ సెంటర్ను సంప్రదిస్తే వారికి పరీక్ష తేదీ మారుస్తారు. ఉర్దూ మీడియం ఎంచుకున్న అభ్యర్థులు మాత్రం కర్నూలు రీజినల్ సెంటర్ లో మాత్రమే పరీక్ష రాయా ల్సి ఉంటుంది. దివ్యాంగులకు సహాయకులను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది.
దర ఖాస్తులో ఏమైనా తప్పులు నమోదు చేస్తే పరీక్ష రాసిన తర్వాత హెల్ప్ లైన్ సెంటర్ ద్వారా మార్చుకోవచ్చు. పరీక్ష కేంద్రంలోకి గంటన్నర ముందుగా మాత్రమే అనుమతిస్తారు. అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు నిర్దేశించిన గుర్తింపు కార్డు, నలుపు, నీలం రంగు బాల్ పాయింట్ పెన్నును మాత్రమే పరీక్ష కేంద్రంలోకి తీసుకువెళ్లాలని సూచించారు.
బయోమెట్రిక్ నమోదు చేయడానికి ఇబ్బంది లేకుండా చేతులపై మెహందీ వంటివి పెట్టుకోకూడదు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతించరు. విద్యార్థులకు ఏమైనా సం దేహాలు ఉంటే 0884-2350599, 0884-2342499 హెల్ప్‌లైన్ సంబర్లలో సంప్రదించాల్సి ఉంటుంది.
విభజన చట్టం ప్రకారం ఉమ్మడి ప్రవేశాలకు పదేళ్లు గడువు ముగియడంతో 2025-29 విద్యా సంవత్సరం నుంచి అన్ రిజర్వుడు కోటాలో తెలంగాణ విద్యార్థులకు కేటాయించే 15 శాతం సీట్లను కూడా ఏపీ విద్యార్ధులకు కేటాయిస్తున్నారు.
ఏపీలో గత ఏడాది 1.81లక్షల ఇంజినీరింగ్ సీట్లకు ఏఐసీటీఈ అనుమతి ఇచ్చింది. ఇందులో ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో 1,71,079 సీట్లు, ఆర్జీయూకేటీ, డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీల్లో 10,653 ఉన్నాయి. 2024-25 లో ఒక్క కంప్యూటర్ సైన్స్ కోర్సులోనే 99,494 సీట్లు ఉన్నాయి. కన్వీనర్ కోటాలో మొత్తం 1.36 లక్షల సీట్లు ఉన్నాయి.
సంబంధిత కథనం