తెలంగాణ టెట్-2025 పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవలనే అన్ని పరీక్షలు పూర్తి కాగా… తాజాగా ప్రాథమిక కీలను విడుదల చేసింది. వీటిపై అభ్యంతరాలను స్వీకరించనుంది. పరీక్ష రాసిన అభ్యర్థులు విద్యాశాఖ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాథమిక కీలతో పాటు రెస్పాన్స్ షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ ఏడాది జనవరి 2 నుంచి టెట్ పరీక్షలు జరిగాయి. జనవరి 20వ తేదీతో అన్ని పరీక్షలు పూర్తయ్యాయి. మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 2,05,278 మంది పరీక్షకు హాజరయ్యారు.
ప్రిలిమినరీ కీల పై ఎలాంటి అభ్యంతరాలు ఉంటే విద్యాశాఖకు పంపవచ్చు. జనవరి 27వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆన్సర్ కీపై అభ్యంతరాలను తెలియజేయవచ్చని విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. నిర్ణీత ఫార్మాట్ లో ఈ వివరాలను పంపాల్సి ఉంటుంది.
ప్రాథమిక కీలపై అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత విద్యాశాఖ పరిశీలిస్తోంది. అయితే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 5వ తేదీన తుది ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. అందుకు అనుగుణంగానే… విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఫైనల్ కీలను ప్రకటించటంతో పాటు ఫిబ్రవరి 5న టెట్ ఫలితాలను ప్రకటించనుంది.
మరోవైపు ఈ ఏడాదిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ లో కూడా ఇదే విషయాన్ని పేర్కొంది. ఈ కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ లో 5 నుంచి 6వేల మధ్య టీచింగ్ ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం