ఏపీలో 9 రకాలుగా ప్రభుత్వ పాఠశాలల విభజన.. మెగా డిఎస్సీలో 3వేల పోస్టులు తగ్గుతాయని ఆందోళన..-division of government schools in ap into 9 types teachers concern that posts in mega dsc will decrease ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీలో 9 రకాలుగా ప్రభుత్వ పాఠశాలల విభజన.. మెగా డిఎస్సీలో 3వేల పోస్టులు తగ్గుతాయని ఆందోళన..

ఏపీలో 9 రకాలుగా ప్రభుత్వ పాఠశాలల విభజన.. మెగా డిఎస్సీలో 3వేల పోస్టులు తగ్గుతాయని ఆందోళన..

Sarath Chandra.B HT Telugu

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల హేతుబద్దీకరణ కసరత్తు కొలిక్కి వచ్చింది. అన్ని ప్రభుత్వ పాఠశాలలను 9 రకాలుగా వర్గీకరిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల విభజనతో పాటు ఉపాధ్యాయులను సైతం సర్దుబాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం 19, 20, 21 జీవోలను విడుదల చేసింది.

ఏపీలో 9 రకాలుగా పాఠశాలల విభజన

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల హేతుబద్దీకరణ కసరత్తు కొలిక్కి వచ్చింది. గత ప్రభుత్వంలో పాఠశాలల హేతబద్దీకరణ పేరుతో జీవో 117కు ప్రత్యామ్నయంగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలల ఏర్పాటుకు అవసరమైన జీవోలు విడుదలయ్యాయి. తాజా నిర్ణయంతో మెగా డిఎస్సీలో భర్తీ చేసే ఉపాధ్యాయ పోస్టులు కూడా తగ్గుతాయని ప్రచారం జరుగుతోంది.

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల విభజన పూర్తయింది. మొత్తం 9 రకాల పాఠశాలల వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తూ ప్రభు త్వం మంగళవారం 19, 20, 21 జీవోలను జారీ చేసింది. ఏపీలో పాఠశాల వర్గీకరణ, బోధనా సిబ్బంది వ్యవస్థీకరణ, పోస్టుల పంపిణీ, విధి విధానాలను ఖరారు చేస్తూ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది.

పాఠశాలల విభజన 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. అన్ని ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, గిరిజన సంక్షేమ శాఖల పాఠశాలలకు వర్తింప చేస్తారు.

ఏపీలో తొమ్మిది రకాల పాఠశాలలు

1. శాటిలైట్ ఫౌండేషనల్ స్కూల్ (ప్రీ ప్రైమరీ 1, 2)

2. ఫౌండేషనల్ స్కూల్ (పీపీ 1. పీపీ 2, క్లాస్ 1, 2)

3. బేసిక్ ప్రైమరీ స్కూల్ (ప్రీ ప్రైమరీ 1, పీపీ2, 1నుంచి 5 తరగతులు)

4. మోడల్ ప్రైమరీ స్కూల్ (పేపీ 1, పీపీ2, క్లాస్ 1 నుంచి 5వరకు)

5. అప్పర్ ప్రైమరీ స్కూల్ (పీపీ 1,2 1 నుంచి 8వ తరగతి వరకు)

6. హైస్కూల్ (6-10 తరగతులు)

7. హైస్కూల్ (1-10 తరగతులు)

8. హైస్కూల్ ప్లస్ (6 నుంచి12 తరగతులు)

9. హైస్కూల్ ప్లస్ (1-12 తరగతులు)

విద్యార్థులను బట్టి సిబ్బంది కేటాయింపు

  • ఫౌండేషనల్ స్కూళ్లల్లో విద్యార్థులు మొదటి 30 మందికి ఒక సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ), 31 నుంచి 60 మంది విద్యార్థుల వరకు రెండో సెకం డరీ గ్రేడ్ టీచర్‌ను నియమిస్తారు.
  • బేసిక్ ప్రాథమిక పాఠశాలల్లో మొదటి 20 మంది విద్యార్థులకు ఒక ఎస్జీటీని, 21 నుంచి 60 మంది వరకు రెండో ఎస్జీటీని నియమిస్తారు.
  • మోడల్ ప్రైమరీ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య 59 మంది వరకు ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ లేదా స్కూల్ అసిస్టెంట్ తో పాటు 3 ఎస్జీటీ పోస్టులు, విద్యార్థుల సంఖ్య 60 దాటితే హెచ్ఎం /స్కూల్‌ అసిస్టెంట్‌ తో పాటు 4 ఎస్జీటీ పోస్టులు ఉంటాయి.
  • అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో 1- 5వ తరగతి వరకు బేసిక్ ప్రైమరీ స్కూల్, మోడల్ ప్రైమరీ స్కూల్‌కు వర్తించే విధి విధానాలే ఉంటాయి.
  • 6 నుంచి 8వ తరగతి వరకు 10 మంది విద్యార్థులకు ఒక స్కూల్ అసిస్టెంట్, 11 నుంచి 30 మం ది వరకు ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లు, 31 నుంచి 140 మంది వరకు నలుగురు స్కూల్ అసిస్టెం ట్లు, 141 నుంచి 175 వరకు ఐదుగురు స్కూల్ ఆసిస్టెంట్లు ఉంటారు.
  • స్కూల్ అసిస్టెంట్లను ప్రాధాన్యత క్రమంలో హిందీ/ ఇంగ్లిష్/మ్యాథ్స్ / బయాలజీ/ సోషల్/ ఫిజిక్స్‌ / తెలుగు ఉపాధ్యా యులను కేటాయిస్తారు.

ఉన్నత పాఠశాలల్లో ఇలా..

  • ప్రైమరీ సెక్షన్ అయిన 1 నుంచి 5 తరగతుల్లో విద్యార్థులు 60 మంది కంటే ఎక్కువ ఉంటే మోడల్ ప్రైమరీ స్టాఫ్ ప్యాట్రన్ ప్రకారం సిబ్బందిని నియమిస్తారు.
  • విద్యార్థులు 60 మంది కంటే తక్కువగా ఉంటే 10 మంది వరకు రెండు ఎస్జీటీ పోస్టులు, 11 నుంచి 30 మంది వరకు మూడు ఎస్జీటీలు, 31 మంది విద్యార్థులుంటే ఒక ఎంపీఎస్ హెచ్ ఎం/స్కూల్ అసిస్టెంట్, ముగ్గురు సెకండరీ గ్రేడ్ టీచర్లు ఉంటారు.
  • విద్యార్థుల సంఖ్య ఆధారంగా 5 నుంచి 25 సెక్షన్ల వరకు స్కూళ్లు ఉంటాయి. వీటిలో 8 నుంచి 31 మంది వరకు స్కూల్ అసిస్టెంట్లను మంజూరు చేస్తారు.75 మందికి మించి విద్యార్థులున్న హైస్కూళ్లకు మాత్రమే హెచ్ఎం, పీఈటీలను కేటాయిస్తారు.

మున్సిపల్ స్కూళ్లకు జెడ్పీ పోస్టులు

జిల్లా పరిషత్ మేనేజ్మెంట్లోని 2,215 మిగులు స్కూల్ అసిస్టెంట్లు, గ్రేడ్-2 హెచ్ఎం పోస్టు లను మున్సిపాలిటీలకు బదలాయించారు. ఇందులో హెచ్ఎం పోస్టులు కార్పొరేషన్లకు 57, మున్సిపాలిటీలకు 38 కేటాయిం చారు.

ఇతర కోటా కింద గ్రేడ్-2 హెడ్ మాస్టర్లుగా 104 మంది, 2016 స్కూల్ అసిస్టెంట్లను కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సర్దు బాటులో భాగంగా ఇతర మేనేజ్ మెంట్లకు మార్పు చేశారు. జడ్పీ ఉపాధ్యాయులను మునిసిపల్ స్కూళ్లకు బదిలీ చేయడంపై ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

డీఎస్సీలో తగ్గనున్న పోస్టులు..

మెగా డీఎస్సీ- 2025 నోటిఫికేషన్ల‌లో 16,347 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వం బోధనా సిబ్బంది పునర్వి భజన చేపట్టిన తర్వాత పోస్టుల సంఖ్యను తగ్గించింది. అన్ని జిల్లాల్లో కలిపి 13,192 పోస్టులు గుర్తించినట్టు ప్రకటించింది. సర్దుబాటు తర్వాత 3,155 పోస్టులు రద్దైనట్టు ప్రచారం జరుగుతోంది.

విద్యార్థులకు రవాణా చార్జీలు చెల్లింపు

పాఠశాలలను విలీనం చేయడంతో 1-5 తరగతుల విద్యార్థులు కి.మీ దాటి, యూపీ విద్యార్థులు (6 నుం చి 8 తరగతులు) 3 కిలోమీటర్లు దాటి ప్రభుత్వ పాఠాశాలలకు వెళితే రవాణా ఖర్చుల కింద నెలకు రూ.600 చొప్పున చెల్లిం చనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం