తెలంగాణ రాష్ట్రంలో డీఈడీ కోర్సుకు మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. డీఈఈసెట్‌కు గత ఏడాదే దరఖాస్తుల సంఖ్య పెరగ్గా, ఈసారి పోటీపడే వారి సంఖ్య రెట్టింపునకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రెండేళ్ల డీఈడీ చదివాక టెట్ పాసైతే.. ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్జీటీ కొలువులకు సులభంగా ఎంపిక కావొచ్చన్న అభిప్రాయం ఉంది. దీంతో ఈసారి డీఈఈసెట్‌కు ఎక్కువ మంది దరఖాస్తు చేస్తున్నారు. ఇంకా 15 రోజులు గడువు ఉండగానే గతేడాది కంటే 8 వేల 345 దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి.
సెకండరీ గ్రేడ్ టీచర్ కొలువులకు డీఈడీతో పాటు బీఈడీ అభ్యర్థులు కూడా పోటీ పడొచ్చని.. 2018లో జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి డీఈఈసెట్‌కు డిమాండ్ తగ్గింది. దీంతో తెలంగాణలో ప్రైవేట్ డీఈడీ కళాశాలల సంఖ్య 219 నుంచి 79కి తగ్గిపోయింది. సీట్ల సంఖ్య 11 వేల 250 నుంచి 4వేల 100కి పడిపోయింది.
ఈ నేపథ్యంలో.. ఎస్‌జీటీ పోస్టులకు కేవలం డీఈడీ అభ్యర్థులే అర్హులని 2023లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో 2024లో మళ్లీ దరఖాస్తుల సంఖ్య పెరిగింది. ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో అప్లికేషన్లు వస్తున్నాయి. ఈ నెల ఒకటో తేదీ నాటికే 26 వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసేందుకు మే 15 వరకు గడువు ఉంది. ఈ ఏడాది 30 వేల వరకు అభ్యర్థులు పోటీపడొచ్చని విద్యాశాఖ అధికారులు అంచా వేస్తున్నారు.
ఎప్పుడు డీఎస్సీ నోటిఫికేన్ ఇచ్చినా.. ఎస్‌జీటీ పోస్టులు ఎక్కువగా ఉంటున్నాయి. వీటిని ప్రత్యక్ష నియామకాల ద్వారానే భర్తీ చేస్తారు. అదే స్కూల్ అసిస్టెంట్ పోస్టులైతే.. 30 శాతమే ప్రత్యక్ష నియామకాలు. మిగిలిన 70 శాతం పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. 2024లో 11 వేల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా.. అందులో సుమారు 7 వేల ఎస్జీటీ కొలువులే ఉన్నాయి. వాటికి కేవలం 60 వేల మంది మాత్రమే పోటీపడ్డారు. అందులోనూ 15 జిల్లాల్లో పోటీ అతిస్వల్పంగా ఉంది.
త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. అదీ కాకుండా.. అసెంబ్లీ ఎన్నికలలోపు మరో నోటిఫికేషన్ వెలువడుతుందని అభ్యర్థులు ఆశిస్తున్నారు. అందుకే ఇప్పటికే బీఈడీ చేసిన వారూ దరఖాస్తు చేస్తున్నారు. ఉపాధ్యాయులుగా ఉన్నవారు తమ భార్య లేదా కుటుంబ సభ్యులను డీఈడీ చేయాలని ప్రోత్సహిస్తున్నారు. అందుకే ఈసారి దరఖాస్తుల సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉంది.
సంబంధిత కథనం