CUET UG 2025 ఫలితాలు ఇంకెప్పుడు? ఎన్టీఏపై లక్షలాది మంది ఆగ్రహం..-cuet ug 2025 result delay sparks nationwide anger nta under fire ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Cuet Ug 2025 ఫలితాలు ఇంకెప్పుడు? ఎన్టీఏపై లక్షలాది మంది ఆగ్రహం..

CUET UG 2025 ఫలితాలు ఇంకెప్పుడు? ఎన్టీఏపై లక్షలాది మంది ఆగ్రహం..

Sharath Chitturi HT Telugu

సీయూఈటీ యూజీ ఫలితాలపై ఎన్టీఏ నుంచి ఇంకా ఎలాంటి అప్డేట్​ లేదు. ఇది లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది.

సీయూఈటీ యూజీ పరీక్షల ఫలితాలు..

సీయూఈటీ యూజీ 2025 ఫలితాల కోసం ఎదురుచూపులు కొనసాగుతున్న వేళ ఎన్టీఏ (నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ)పై లక్షలాది మంది అభ్యర్థుల్లో అసహనం వెల్లువెత్తుతోంది. ఫలితాలు ఇంకా ఎందుకు విడుదల చేయలేదని కొందరు ప్రశ్నిస్తుంటే, ఎన్టీఏ విశ్వసనీయతపై మరికొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్టీఏని ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడుతున్నారు.

250కుపైగా కేంద్ర, రాష్ట్ర, ప్రైవేట్​ యూనివర్సిటీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహిస్తున్న పరీక్ష ఈ సీయూఈటీ యూజీ (కామన్​ యూనివర్సిటీ ఎంట్రెన్స్​ టెస్ట్​ ఫర్​ అండర్​గ్రాడ్యుయేట్స్​). ఈ ఏడాది మే 15 నుంచి 18 మధ్యలో 13.48లక్షల మంది ఈ పరీక్ష రాశారు. కానీ ఇప్పటికీ ఫలితాలు వెలువడలేదు. ఫలితంగా లక్షలాది మంది అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సీయూఈటీ యూజీ ఫలితాలు- ఇంకెప్పుడు?

సీయూఈటీ యూజీ ఫలితాలు ఆలస్యమవ్వడం వల్ల ఎన్టీఏపై అటు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా నిపుణులు సోషల్​ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఏ నుంచి సరైన సమాచారం లేదని, అన్నింటిలోనూ విఫలమైందని ఆరోపిస్తున్నారు.

"ఎన్టీఏని మూసేయండి. లక్షలాది మంది విద్యార్థులను ఎన్టీఏ ఫెయిల్​ చేసింది. జవాబుదారీతనమే లేకుండా పనిచేస్తోంది," అని ఓ వ్యక్తి ట్విట్టర్​లో రాసుకొచ్చారు.

"సీయూఈటీ, నీట్​, యూజీసీ- నెట్​.. అన్ని పరీక్షల నిర్వహణలోనూ ఎన్టీఏ పదేపదే విఫలమవుతోంది. ఆన్సర్​ కీ సరిగ్గా ఉండదు. చివరి నిమిషంలో పరీక్షను వాయిదా వేస్తారు. పరీక్ష జరిగినా టెక్నికల్​ సమస్యలు వస్తుంటాయి. ప్రశ్నాపత్రంలో సిలబస్​ బయట క్వశ్చన్స్​ కనిపిస్తాయి. ఇప్పుడు సీయూఈటీ యూజీ 2025 చుట్టూ వివాదం! చేతకాకపోతే మూసేయండి. పరీక్షలను సరిగ్గా నిర్వహించలేకపోతే ఎన్టీఏని మూసేయండి. పిల్లల భవిష్యత్తుతో ఆడుకోకండి. లక్షలాది విద్యార్థులపై ప్రయోగాలు చేయకండి," అని మరొకరు మండిపడ్డారు.

ఇంత జరుగుతున్నా సీయూఈటీ నుంచి ఇంకా (సోమవారం ఉదయం నాటికి) ఎలాంటి స్పందన లేదు. ఫైనల్​ కీ ఎప్పుడు విడుదల అవుతుంది? సీయూఈటీ యూజీ ఫలితాలు ఎప్పుడు వెలువడతాయి? వంటి వివరాలపై ఇంకా క్లారిటీ లేదు.

ఫలితాలు ఆలస్యం అవ్వడంతో అడ్మిషన్లలో జాప్యం..

సీయూఈటీ యూజీ 2025 ఫలితాలు ఆలస్యమవ్వడంతో అనేక విశ్వవిద్యాలయాల అకాడమిక్​ క్యాలెండర్​ దెబ్బతినట్టు తెలుస్తోంది. అడ్మిషన్లు, హాస్టల్​ అలోకేషన్లు, స్కాలర్​షిప్​ ప్రక్రియ హోల్డ్​లో ఉన్నాయి. తుది స్కోర్లు వెలువడేంత వరకు వర్సిటీలు కౌన్సిలింగ్​ని మొదలుపెట్టలేకపోతున్నాయి.

ఇదే విషయంపై వివిధ యునివర్సిటీలకు చెందిన సిబ్బంది అసహనం వ్యక్తం చేశారు. ఎన్నో ప్రయోజనాలు ఉంటాయంటూ ప్రవేశపెట్టిన ఈ పరీక్షలకు ఇప్పుడు లాజిస్టిక్స్​ సహా అనే సమస్యలు ఎదురువుతున్నాయని, ఇక ఎగ్జామ్స్​ నిర్వహించడంలో లాజిక్​ ఏముందని ప్రశ్నిస్తున్నారు.

గతేడాది సీయూయూజీ ఫలితాలు జులై 30న వెలువడ్డాయి.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం