తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ల కొరత వేధిస్తోంది. దీంతో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్లను నియమించుకునేందుకు ఆర్టీసీ చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం మార్గదర్శకాలను విడుదల చేసింది. 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు వయసుండి.. పదో తరగతి విద్యార్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వివిధ ఏజెన్సీల ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
ఈ ప్రక్రియలో కండక్టర్లుగా ఎంపికైన వారికి నెలవారీ చెల్లించే కన్సాలిడేటెట్ జీతం మొత్తం రూ.17,969గా నిర్ణయించారు. అయితే.. ఏజెన్సీ మాత్రం రూ.2 లక్షల మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. విధి నిర్వహణలో సంస్థకు నష్టం జరిగితే.. దాన్ని ఈ సెక్యూరిటీ డిపాజిట్ నుంచి రికవరీ చేయనున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. వీరికి వర్క్‌మెన్స్ కాంపన్సేషన్ యాక్ట్ వర్తించదని స్పష్టం చేసింది. పీఎఫ్, ఈఎస్‌ఐ లాంటి చట్టబద్ధమైన వెసులుబాట్లు ఉండవని తేల్చి చెప్పింది.
కండక్టర్లుగా ఎంపికైన వారికి వారం రోజులు శిక్షణ ఉంటుంది. టీజీఎస్ ఆర్టీసీ ట్రైనింగ్ కాలేజీలో 3 రోజులు, ప్రో కండక్టర్‌గా మూడు రోజులు శిక్షణ ఇస్తారు. ఈ సమయంలో వసతి, భోజనం కల్పిస్తారు. మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉచితంగా ఉంటుంది. కండక్టర్లుగా ఎంపికైన వారికి కాంట్రాక్టర్ల ద్వారా లైసెన్స్ ఇస్తారు. వీటిని సంస్థ ఉచితంగా అందజేయనుంది.
విధుల్లో చేరేముందు ఒరిజినల్ టెన్త్ మెమోను కాంట్రాక్టర్ ద్వారా సంస్థకు అందజేయాలి. వీరికి రెగ్యులర్ కండక్టర్ల మాదిరిగానే ఇన్సెంటివ్స్, ఎర్నింగ్స్ క్యాష్ రూపంలో ఇస్తారు. కానీ.. డబుల్ డ్యూటీకి మాత్రం అనుమతి ఇవ్వరు. అలాగే 2 గంటల వరకు ఓవర్ టైన్ డ్యూటీలు వేసే అవకాశం ఉంటుంది. గంట ఓటీ ఉంటే రూ.100, గంట నుంచి 2 గంటలు ఓటీ చేస్తే.. రూ.200 చెల్లిస్తారు.
ఔట్ సోర్సింగ్ కండక్టర్లకు.. కేవలం పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో మాత్రమే డ్యూటీ వేస్తారని.. సంస్థ స్పష్టం చేసింది. విధులు నిర్వర్తించే సమయంలో.. టీఐఎం మిషన్ పాడైతే.. డిపాజిట్ చేసిన రూ.2 లక్షల నుంచి డబ్బులు కట్ చేస్తారు. వర్క్ ప్లేస్ నుంచి నివాసం 35 కిలోమీటర్ల లోపు ఉంటే.. బస్ పాస్ ఇస్తారు. దీని ద్వారా ఉచితంగా ప్రయాణించవచ్చు. కాంట్రాక్టర్ వీరికి ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తారు.
సంబంధిత కథనం