AP Central Tribal University : కేంద్రీయ గిరిజన వర్శిటీలో పీజీ అడ్మిషన్లు - నోటిఫికేషన్ విడుదల, ముఖ్య వివరాలివే
AP Central Tribal University PG Admissions : ఏపీ గిరిజన సెంట్రల్ యూనివర్శిటీ నుంచి పీజీ అడ్మిషన్ నోటిఫికేషన్ జారీ అయింది. అర్హులైన వారు ఫిబ్రవరి 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సుల వివరాలను యూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్ వీటీ కట్టిమణి వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ గిరిజన సెంట్రల్ యూనివర్శిటీలో పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వివరాలను యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వీటీ కట్టిమణి వెల్లడించారు. ప్రవేశాలకు సంబంధించి ప్రవేశపరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తుందని తెలిపారు.
కోర్సుల వివరాలు…
- స్కూల్ ఆఫ్ సైన్స్ః ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ బొటనీ, ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, ఎమ్మెస్సీ కంప్యూర్ సైన్స్, ఎమ్మెస్సీ జీయాలజీ.
- స్కూల్ ఆఫ్ హ్యుమనిటీస్ అండ్ సోషల్ సైన్స్ః మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, ఎంఏ సోషియాలజీ, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ ట్రైబల్ స్టడీస్, ఎంఏ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్స్, ఎంఏ జాగ్రఫీ, ఎంఏ ఎకనామిక్స్.
- స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ః ఎంబీఏ, బిజినెస్ మేనేజ్‌మెంట్, కామర్స్, టూరిజం అండ్ హాస్పటల్టీ మేనేజ్‌మెంట్ వంటి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
అర్హతలు…
డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు. డిగ్రీ ఫైనర్ ఇయర్ పరీక్షలు రాసేవారు దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్న ఈ పరీక్షల్లో అర్హులైన అభ్యర్థులకు మాత్రమే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో చేరేందుకు అవకాశం ఉంటుంది. తక్కువ ఫీజులతో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్న ఈ ప్రవేశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని వీసీ ప్రొఫెసర్ కట్టిమణి పేర్కొన్నారు. కామన్ యూనివర్శిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూసెట్) ద్వారానే ప్రవేశాలు జరుగుతాయని తెలిపారు.
దరఖాస్తు విధానం ఇలా….
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.100 ఉంటుంది. దరఖాస్తును https://www.nta.ac.in/ , https://exams.nta.ac.in/CUET-PG/ వెబ్‌సైట్‌ల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఫిబ్రవరి 1 తేదీ రాత్రి 11.50 గంటల వరకు దాఖలు చేయొచ్చు. అప్లికేషన్ ఫీజు మాత్రం ఫిబ్రవరి 2 తేదీ రాత్రి 11.50 గంటల వరకు చెల్లించవచ్చు. ఫిబ్రవరి 3 తేదీ రాత్రి 11.50 గంటల వరకు ఎటువంటి తప్పులు ఉంటే సరిచేసుకోవచ్చు. ప్రవేశపరీక్షలు మార్చి 13 నుంచి మార్చి 31 మధ్య జరుగుతాయి.
పరీక్ష కేంద్రాలు…
అనంతపురం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, నంద్యాల, నరసరరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష కేంద్రాలుగా ఉన్నాయి.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం