అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌.. 2.5 లక్షల మంది బాలికలకు ఏడాదికి రూ.30 వేలు-azim premji foundation scholarship yearly 30000 to 2 5 lakh girl students across 18 states ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌.. 2.5 లక్షల మంది బాలికలకు ఏడాదికి రూ.30 వేలు

అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌.. 2.5 లక్షల మంది బాలికలకు ఏడాదికి రూ.30 వేలు

Anand Sai HT Telugu

బాలికల ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం రూ.30,000 అందించనుంది. ఈ కార్యక్రమం 18 రాష్ట్రాల్లో అమలు చేయనుంది.

అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌

బాలికల విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినిలకు ప్రతి సంవత్సరం రూ.30,000 అందించనుంది. ఈ స్కాలర్‌షిప్‌ను అజీమ్ ప్రేమ్‌జీ పేరిట ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణతో సహా 18 రాష్ట్రాల్లో అమలు చేయాలని నిర్ణయించారు. 2.5 లక్షల మంది బాలికలకు స్కాలర్‌షిప్‌లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

డిగ్రీ, డిప్లోమా

విద్యార్థులు తమ టెన్త్, ఇంటర్మీడియట్ విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో, మున్సిపల్ పాఠశాలలతో పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ లేదా ఏదైనా డిప్లొమా కోర్సును అభ్యసించడానికి ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలో చేరి ఉండాలి.

కోర్సు పూర్తి చేసే వరకు

అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనురాగ్ బెహర్ మాట్లాడుతూ 'ఒక విద్యార్థి తన డిగ్రీ లేదా డిప్లొమా కోర్సు పూర్తి చేసే వరకు ఆమెకు ప్రతి సంవత్సరం రూ. 30,000 ఇస్తాం.' అని అన్నారు. ఉదాహరణకు 4 సంవత్సరాల బీఎస్సీ నర్సింగ్ ప్రోగ్రామ్‌ను అభ్యసించే అమ్మాయికి రూ. 1,20,000 స్కాలర్‌షిప్ లభిస్తుంది. ఈ డబ్బు ప్రతి సంవత్సరం రెండు విడతలుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.

ఈ రాష్ట్రాల్లో

'ఈ స్కాలర్‌షిప్ కార్యక్రమం కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒడిశా, రాజస్థాన్, సిక్కిం, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లతో సహా మొత్తం 18 రాష్ట్రాల్లో అమలు అవుతుంది. 2025-26 విద్యా సంవత్సరంలో 2.5 లక్షల మంది బాలికలకు 'అజీమ్ ప్రేమ్‌జీ' స్కాలర్‌షిప్‌లు ఉంటాయి.

సెప్టెంబర్ నుంచి దరఖాస్తులు

ఇది విద్యార్థికి మెరిట్ ఆధారిత స్కాలర్‌షిప్ కాదు. దరఖాస్తుదారు తన పాఠశాల విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి చేసి ఉండాలి. కుటుంబ పరిస్థితి ఆధారంగా స్కాలర్‌షిప్‌లు ఇస్తారు. అజీమ్ ప్రేమ్‌జీ స్కాలర్‌షిప్‌ను 2024-25 విద్యా సంవత్సరంలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్‌లోని కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాతిపదికన ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టులో 25,000 మందికి పైగా బాలికలకు స్కాలర్‌షిప్ లభించింది. 2025-26 సైకిల్ కోసం దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 2025లో ప్రారంభమవుతుంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.