తెలంగాణలోని పోలీసు పిల్లలకు, ఇతర యూనిఫాం సర్వీస్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం కోసం.. ప్రభుత్వం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ఏర్పాటు చేసింది. పాఠ్యాంశాలతో పాటు సాంకేతిక నైపుణ్యాలు, క్రీడలు, సామాజిక స్పృహ, ఉన్నత విలువలను పెంపొందించడం దీని లక్ష్యం. తాజాగా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. 2025-26 విద్యా సంవత్సరానికి 1 నుంచి 5వ తరగతిలో చేరేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ స్కూల్‌లో 50 శాతం పోలీస్ కుటుంబాల పిల్లలకు, మిగిలిన సీట్లను ఇతరులకు కేటాయించనున్నారు. పూర్తి వివరాలకు 90591 96161 నంబర్‌లో సంప్రదించాలని అధికారులు సూచించారు.
అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత.. కుడివైపు పైభాగంలో అడ్మిషన్స్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే.. పేజీ కింద చివర్లో అప్లై అని ఉంటుంది. దాని పక్కన కొన్ని వివరాలు అడుగుతారు. విద్యార్థి పేరు, పేరెంట్స్ పేరు, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఇలా చేసిన తర్వాత స్కూల్ నిర్వాహకులు టచ్‌లోకి వస్తారు.
తెలంగాణ ప్రభుత్వం ఈ పాఠశాలలను ఏర్పాటు చేస్తుంది. హైదరాబాద్‌లోని రాజ్‌బహదూర్ వెంకటరామిరెడ్డి పోలీస్ అకాడమీలో 2024 పోలీస్ డ్యూటీ మీట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. 2025 విద్యా సంవత్సరం నుండి 1 నుండి 5 తరగతులతో ఈ పాఠశాల ప్రారంభమవుతుంది.
ప్రతి సంవత్సరం ఒక్కో తరగతిని పెంచుకుంటూ.. డిగ్రీ వరకు నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. పోలీసులు, ఎక్సైజ్, ఫైర్, ఎస్‌పీఎఫ్ ఉద్యోగుల పిల్లలు ఇక్కడ విద్యనభ్యసించనున్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉన్న విద్యను అందరి అందుబాటులోకి తేవడం ద్వారానే.. నేటి సమాజానికి ఆదర్శంగా నిలిచి సేవలందించే పౌరులను తయారు చేయగలం అని రేవంత్ సంకల్పించారు. ఈ లక్ష్యానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది.