ప్రస్తుతం కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో చదువుకోవాలంటే.. ఒకటో తరగతి నుంచే రూ. లక్షల ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి. దీంతో పేద పిల్లలకు అక్కడ చదువుకునే అవకాశం లేకుండా పోయింది. దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. నిర్బంద విద్యాహక్కు చట్టం కింద పేదల పిల్లలకు కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కనీసం 25 శాతం సీట్లను కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ చట్టం ప్రకారం ఒకటో తరగతిలో పేద పిల్లలకు ప్రవేశాలు కల్పించనున్నారు. అక్కడి నుంచి 8వ తరగతి వరకు ఉచితంగా బోధించనున్నారు. విద్యాహక్కు చట్టం కింద ప్రవేశాలు పొందిన పిల్లలకు.. ప్రభుత్వమే ఫీజు చెల్లించనుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకునేందుకు అనేక మంది విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ ఈ ఏడాది ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ మే 2వ తేదీ నుంచి ప్రారంభం అయ్యింది. మే 19న ముగియనుంది.
విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల విద్యాశాఖ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మే 19 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అనంతరం మే 20 నుంచి 24 వరకు విద్యార్థుల దరఖాస్తులను ఆయా గ్రామ, వార్డు సచివాలయాల వారీగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారు. మే 29న లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. జూన్ 8వ తేదీలోపు విద్యా ర్థులు ఎంపిక చేసుకున్న పాఠశాలల వారీగా అడ్మిషన్ ఖరారు చేసుకోవాల్సి ఉంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు ఎంపిక చేసిన పాఠశాలల యాజమాన్యాలు.. విద్యాశాఖ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకున్నాయి.
ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్రవేశం పొందిన పేద విద్యార్ధులకు 8వ తరగతి వరకు ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుంది. ఆయా పాఠశాలల్లో ప్రవేశం కల్పిస్తున్న విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజును ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయిస్తుంది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ సిలబస్ పాఠశాలల్లో ప్రవేశాలకు గాను.. 2019 ఏప్రిల్ 2 నుంచి, 2020 మార్చి 31 మధ్య జన్మించి, ఐదేళ్లు వయసు నిండిన పిల్లలు అర్హులు. స్టేట్ సిలబస్ పాఠశాలల్లో 2019 జూన్ 2వ తేదీ నుంచి, 2020 మే 31 మధ్య జన్మించి, ఐదేళ్ల వయసు నిండి ఉండాలనే నిబంధన అమలు చేయనున్నారు.
దరఖాస్తు చేసేందుకు నివాస ధ్రువీకరణ పత్రం, దివ్యాంగులైతే ఆ ధ్రువీకరణ పత్రం, హెచ్ఐవీ బాధితులు సంబంధిత మెడికల్ సర్టిఫికెట్, వార్షిక ఆదాయ, కులధ్రువీకరణ పత్రాలు అవసరం. ఆధార్ అనుసంధానం చేసిన మొబైల్ ఫోన్‌కు ఎంపికైన విద్యార్థుల వివరాలను పంపుతారు.. కుటుంబ వార్షికాదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.1.44 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలుగా నిర్ణయించారు. దరఖాస్తులో పొందు పరిచిన చిరునామా ఆధారంగా పాఠశాలకు సమీపంలో నివసిస్తున్న విద్యార్థులకు ఎంపికలో మొదటి ప్రాధాన్యమిస్తారు.
2025-26 విద్యాసంవత్సరానికి ఒకటో తరగతిలో 25 శాతం సీట్లను విధిగా కేటాయించాల్సి ఉంది. ఇందులో ఐదు శాతం సీట్లను ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న వర్గాలు అంటే.. దివ్యాంగులు, అనాథలు, హెచ్ఐవీ బాధిత పిల్లలకు ఇస్తారు. 10 శాతం సీట్లను ఎస్సీలకు, నాలుగు శాతం ఎస్టీలకు, మిగిలిన ఆరు శాతం సీట్లను బలహీనవర్గాలకు చెందిన బీసీ, మైనార్టీ, ఓసీలకు ఆదాయం ఆధారంగా కేటాయించారు.
సంబంధిత కథనం