ఏపీలో పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కాగా…. ఇవాళ బయాలజీ పేపర్ పూర్తి అయింది. మరో రెండు పరీక్షలు మిగిలి ఉండగా… అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. సోషల్ పరీక్ష తేదీని మార్పు చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 31 లేదా ఏప్రిల్ 1వ తేదీన ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ ఎగ్జామ్ మార్చి 1వ తేదీన ఉంటుందని పాఠశాల విద్య సంచాలకులు విజయ్ రామరాజు వెల్లడించారు.
మార్చి 31వ తేదీన ఈద్ అల్-ఫితర్ (రంజాన్) సందర్భంగా సెలవు దినంగా ప్రకటించారు. కాబట్టి సోషల్ స్టడీస్ పరీక్షను 01-04-2025 (మంగళవారం)న నిర్వహిస్తామని తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాలని ఆదేశించారు.
ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా శుక్రవారం(ఇవాళ) జీవ శాస్త్ర (బయాలజికల్ సైన్స్) పరీక్ష ప్రశాంతంగా జరిగాయని విజయ్ రామరాజు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 6,36,241 మంది విద్యార్థులకు గానూ 6,27,673 మంది విద్యార్థులు హాజరు కాగా, 8345 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. 3,450 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా 1376 కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీ చేశారని తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఒక విద్యార్థి చూసి రాస్తుండగా పట్టుబడ్డాడని…. ఆ విద్యార్థిని డిబార్ చేసి సంబంధించిన ఇన్విజిలేటరును సస్పెండ్ చేశామన్నారు. మిగిలిన అన్ని జిల్లాల్లో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగినట్లు చెప్పారు.
పదో తరగతి పరీక్ష రోజు పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ణలు అమలు చేస్తున్నారు.ఈ ఏడాది పదో తరగతి పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3, 450 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటిలో 163 సెన్సిటివ్ పరీక్షా కేంద్రాలుగా గుర్తించారు. అక్కడ ప్రత్యేకమైన సీసీటీవీ కెమెరా సర్వెలెన్స్ ఏర్పాట్లు చేశారు.పరీకా కేంద్రాల పరిధిలో జిరాక్స్ , నెట్ సెంటర్లను మూసివేయిస్తున్నారు. పదో తరగతి పరీక్షల కోసం రాష్ట్ర స్థాయిలో 08662974540 నంబరుతో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశారు.