AP PGCET 2025 : ఏపీ పోస్టు గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(APPGCET-2025) నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ ఉన్నత విద్యామండలి పీజీసెట్-2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. పీజీసెట్ ను తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహిస్తుంది. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, వాటి అనుబంధ పీజీ కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే ఎంఏ /ఎంకాం/ ఎంఎస్సీ తదితర పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఏపీ పీజీఈసెట్ అప్లికేషన్లు ఏప్రిల్ 2 నుంచి ప్రారంభంకానున్నాయి. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 9 నుంచి 13 వరకు ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.
రాష్ట్రంలో ఉన్న 17 యూనివర్శిటీ, వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో దాదాపు 156 పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కల్పించేందుకు ఈ సెట్‌ను నిర్వహిస్తారు. దీనికి డిగ్రీలో ఆయా సబ్జెక్టులను ఉత్తీర్ణత పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఏప్రిల్ 2 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవడం ప్రారంభం అవుతుంది. ఆన్‌లైన్ ఎగ్జామ్ జూన్ 9 నుంచి 13 వరకు జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్ణయించిన పరీక్షా కేంద్రాల్లో ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు దాఖలు చేసేందుకు, పీజీసెట్‌కు సంబంధించిన పూర్తి వివరాలకు తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in ను సందర్శించాలి.
ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంసీజే, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, ఎంఈడీ, ఎంపీఈడీ ఎమ్మెస్సీ టెక్నాలజీ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు పీజీ కామన్ ఎంట్రన్స్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. అయితే సెట్‌లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. దీనికి సంబంధించిన పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన నిర్వహణ బాధ్యతలను తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ (ఎస్‌వీయూ) చూస్తోంది. నోటీఫికేషన్ నుంచి పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడి, కౌన్సిలింగ్ వంటి ప్రక్రియలన్నీ ఎస్‌వీయూ నిర్వహిస్తోంది. గతేడాది ఏపీపీజీసెట్ నిర్వహణ బాధ్యతలను ఆంధ్రా యూనివర్శిటీ చూసింది.
దరఖాస్తు దాఖలు చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి వస్తుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు దాదాపు రూ.850, బీసీలకు రూ.750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.650 ఉంటుంది. అప్లికేషన్ ఫీజును కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రవేశ పరీక్ష మూడు కేటగిరీల్లో ఉంటుంది. కేటగిరీ-1లో ఆర్ట్స్, హ్యూమానిటీస్, సోషల్ సైన్స్‌స్ కోర్సులు ఉండగా, కేటగిరీ-2లో కామర్స్ అండ్ ఎడ్యుకేషన్ కోర్సు ఉంటుంది. కేటగిరీ-3లో సైన్స్ సబ్జెక్టులు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి.
మొత్తం సీట్లలో 15 శాతం ఎస్సీలకు, ఆరు శాతం ఎస్టీలకు, 29 శాతం బీసీలకు (బీసీ-ఏ 7 శాతం, బీసీ-బీ 10 శాతం, బీసీ-సీ 1 శాతం, బీసీ-డీ 7 శాతం, బీసీ-ఈ 4 శాతం), ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు 10 శాతం సీట్లు కేటాయిస్తారు. అలాగే ఎక్స్‌సర్వీస్ మాన్- 2 శాతం, ఎన్‌సీసీ- 1 శాతం, స్పోర్ట్స్-0.5 శాతం కేటాయిస్తారు. ఏపీపీజీసెట్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఏప్రిల్ 2 నుంచి వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయని సెట్ కన్వీనర్, ప్రొఫెసర్ పీసీ వెంకటేశ్వర్లు తెలిపారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం