ఏపీలోని మోడల్ స్కూళ్లలో ఆరో తరగతి ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. తాజాగా హాల్ టికెట్లు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏపీ మోడల్ స్కూల్ అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… ఏప్రిల్ 20వ తేదీన ఎగ్జామ్ జరగాల్సి ఉంది. కానీ ఆ తేదీన ఈస్టర్ పర్వదినం ఉండటంతో తేదీని మార్చారు. దీంతో ఏప్రిల్ 21వ తేదీన ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు. ఈ ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా… 2025-26 విద్యా సంవత్సరానికిగాను 6వ తరగతిలో అడ్మిషన్లు కల్పిస్తారు.
ఏప్రిల్ 21న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వారివారి మండల పరిధిలోని ఆదర్శ పాఠశాలల్లోనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది.
ఏపీ మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ పరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి. 5వ తరగతి స్థాయిలోనే ప్రశ్నలు అడుగుతారు. ఓసీ, బీసీ విద్యార్థులకు 35 మార్కులను అర్హతగా నిర్ణయించగా… ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 30గా ఉంది. ఈ లోపు మార్కులు సాధించకపోతే క్వాలిఫై కానట్లు పరిగణిస్తారు. స్కోర్ తో పాటు రిజర్వేషన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.
రాష్ట్రంలో మొత్తం 164 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఆరో తరగతి, ఇంటర్ ప్రవేశాల కోసం ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు ఇంకా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు మే 22వ తేదీ వరకు ఉంటుంది.