ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 6 నుంచి జూలై 2 వరకు 23 రోజుల పాటు ఈ పరీక్షలను నిర్వహించారు. అన్ని ప్రాంతాల్లో సజావుగా, శాంతియుత వాతావరణంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా పూర్తి అయినట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణా రెడ్డి ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
ఏపీ మెగా డీఎస్సీలో భాగంగా అన్ని పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో 91.72 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. పరీక్షల చివరి రోజైన బుధవారం (02.07.2025) రెండు సెషన్లలో ఎస్జీటీ తెలుగు, మైనర్ మీడియా పోస్టులకు పరీక్షలు జరిగాయి. మొత్తం 19,879 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా… 19,409 మంది (97.06%) పరీక్షకు హాజరయ్యారు.
ఉదయం సెషన్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 99 శాతం మంది, మధ్యాహ్నం విజయనగరం జిల్లాలో 100 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు మెగా డీఎస్సీ కన్వీసర్ తెలిపారు. ఇవాళ్టి నుంచి 8125046997, 7995649286, 7995789286, 9398810958 హెల్ప్‌లైన్ నంబర్లు అభ్యర్థుల సహాయం నిమిత్తం అందుబాటులో ఉంటాయన్నారు.
ఇప్పటికే పలు పరీక్షల ప్రాథమిక కీలు, రెస్పాన్స్ షీట్లను విద్యాశాఖ విడుదల చేసింది.వీటిపై అభ్యంతరాలను కూడా స్వీకరిస్తోంది.త్వరలోనే మిగతా పరీక్షల ప్రాథమిక కీలు, రెస్పాన్స్ షీట్లను విడుదల చేయనుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తి అయిన తర్వాత తుది కీలను ప్రకటించనుంది. తుది కీ విడుదల చేసిన 7 రోజుల్లో డీఎస్సీ మెరిట్ లిస్టులు ప్రకటిస్తారు.
ఏపీ మెగా డీఎస్సీలో భాగంగా…. మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈసారి ఈ మెగా డీఎస్సీలోని అన్ని ఖాళీలకు కలిపి 5,77,417 అప్లికేషన్లు అందాయి. పలువురు అభ్యర్థులు వారి అర్హతలకు అనుగుణంగా… ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అధిక సంఖ్యలోనే అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు.
ఇక డీఎస్సీ ఫలితాల్లో టెట్ స్కోర్ కీలకంగా ఉంటుంది. ఇందులో సాధించే వెయిటేజీని డీఎస్సీ మార్కులకు జత చేస్తారు. ఈ రెండింటి ఆధారంగా ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాలను జిల్లాల వారీగా విడుదల చేస్తారు.