ఏపీ డీఎస్సీ పరీక్షలకు సర్వం సిద్ధం...! నిమిషం రూల్ అమలు, ఈ విషయాలను తప్పక తెలుసుకోండి-ap mega dsc 2025 exams begin from tomorrow key instructions for candidates ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ డీఎస్సీ పరీక్షలకు సర్వం సిద్ధం...! నిమిషం రూల్ అమలు, ఈ విషయాలను తప్పక తెలుసుకోండి

ఏపీ డీఎస్సీ పరీక్షలకు సర్వం సిద్ధం...! నిమిషం రూల్ అమలు, ఈ విషయాలను తప్పక తెలుసుకోండి

ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. రేపట్నుంచే ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జులై 6వ తేదీతో ఈ పరీక్షలన్నీ ముగుస్తాయి. ప్రతి రోజూ రెండు సెషన్ల వారీగా నిర్వహించనున్నారు. పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అభ్యర్థులకు అధికారులు కీలక సూచనలు చేశారు.

ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు 2025

ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాట్లను సిద్ధం చేసింది. రేపట్నుంచే(జూన్ 6) ఈ పరీక్షలు ప్రారంభమై… జూలై 6వ తేదీతో ముగుస్తాయి. నెల రోజులపాటు జరిగే ఈ పరీక్షలను…. ప్రతి రోజూ రెండు సెషన్లవారీగా పూర్తి చేస్తారు. మరోవైపు ఇప్పటికే అభ్యర్థుల హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటిలో ఏమైనా తప్పులు ఉంటే… పరీక్షా కేంద్రాల వద్ద సరిచేసుకోవచ్చని తాజాగా విద్యాశాఖ అధికారులు తెలిపారు.

డీఎస్సీ పరీక్షలకు సర్వం సిద్ధం - ముఖ్య వివరాలు

  • మొత్తం 154 కేంద్రాల్లో డీఎస్సీ పరీక్షలను నిర్వహిస్తారు. ఆన్ లైన్ విధానంలో ఉంటాయి. జూన్ 6 నుంచి జూలై 6 వరకు జరుగుతాయి.
  • ఏపీ డీఎస్సీ పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని విద్యాశాఖ స్పష్టం చేసింది. కాబట్టి అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది.
  • హాల్‌టికెట్లలో ఏమైన తప్పులు ఉంటే సరిచేసుకునే అవకాశాన్ని విద్యాశాఖ కల్పించింది. సంబంధించిన గుర్తింపు కార్డులను పరీక్ష కేంద్రాల వద్ద సమర్పిస్తే వాటిని సరి చేస్తారని తాజాగా తెలిపింది.
  • తల్లిదండ్రుల పేర్లు, డేట్ ఆఫ్ బర్త్, కులంతో పాటు ఇతర వివరాలు తప్పుగా నమోదైతే దీనికి సంబంధించిన ఆధారాలను చూపిస్తే నామినల్‌ రోల్స్‌లో సరి చేస్తారని వివరించింది.
  • హాల్‌టికెట్‌లో ఫొటో లేకపోతే అభ్యర్థులు కేంద్రానికి రెండు ఫొటోలు తీసుకువెళ్లాలి.
  • ఆధార్, ఓటరు ఐడీ, పాన్‌ కార్డు వంటి ధ్రువీకరణపత్రాలను చూపించాలి.
  • ఏపీ డీఎస్సీ పరీక్షల కోసం ఏపీలోనే కాకుండా…. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవకతవకలు చోటు చేసుకుండా కఠిన చర్యలు చేపట్టింది.
  • డీఎస్సీ పరీక్షలను రోజూ రెండు సెషన్ల వారీగా నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి 12, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు మరో సెషన్ జరుగుతుంది.
  • ప్రిన్సిపల్, పీజీటీ, పీడీ పోస్టులకు పరీక్ష మూడు గంటలపాటు ఉంటుంది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు. మరోవైపు టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్‌ అభ్యర్థులకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నైపుణ్య పరీక్ష ఉంటుంది. ఇందుకు గంటన్నర సమయం కేటాయించారు.
  • హాల్ టికెట్లలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. అభ్యర్థులు హెల్ప్ డెస్క్‌కు కాల్ చేయవచ్చు. (6281704160, 8121947387, 8125046997, 9398810958, 7995649286, 7995789286, 9963069286, 7013837359) నంబర్లకు ఫోన్ చేసి.. అభ్యంతరాలను నివృత్తి చేసుకోవచ్చు.
  • dscgrievances@apschooledu.in ఐడీకి మెయిల్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు అని డీఎస్సీ కన్వీనర్ ఎం.వెంకట కృష్ణారెడ్డి వివరించారు.
  • ఏపీ మెగా డీఎస్సీలో భాగంగా…. మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈసారి ఈ మెగా డీఎస్సీకి 3,35,401 మంది అభ్యర్థులు అప్లయ్ చేసుకోగా… అన్ని పోస్టులకు కలిపి 5,77,417 అప్లికేషన్లు అందాయి. పలువురు అభ్యర్థులు వారి అర్హతలకు అనుగుణంగా… ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు.
  • డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలను పరీక్షలు పూర్తయిన రెండు రోజుల్లో విడుదల చేస్తారు. ప్రాథమిక కీల విడుదల తర్వాత 7 రోజులపాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు.
  • అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన 7 రోజుల తర్వాత ఫైనల్ కీని ప్రకటిస్తారు. తుది కీ విడుదల చేసిన 7 రోజుల తర్వాత మెరిట్ జాబితా విడుదలవుతాయి.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.