రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ శనివారంతో ముగిసింది. కౌన్సెలింగ్ అనంతరం 4 ట్రిపుల్ ఐటీల్లో కలిపి 598 సీట్లు మిగిలాయి. దీంతో ఈ సీట్ల భర్తీకి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
రాష్ట్రంలోని ఒక్కో ట్రిపుల్ ఐటీలో 1,010 సీట్లు ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ తర్వాత… నూజివీడులో 139, ఇడుపులపాయలో 132, శ్రీకాకుళంలో 144, ఒంగోలులో అత్యధికంగా 183 సీట్లు మిగిలాయి. ఈ సీట్లను భర్తీ చేసేందుకు ఈ నెల 14 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కాగా ఫస్ట్ ఫేజ్ లో సీట్లు పొందిన వారికి ఈ నెల 14 నుంచే తరగతులను ప్రారంభించనున్నారు.
పదవ తరగతిలో మార్కుల ఆధారంగా 6 ఏళ్ల బీటెక్ కోర్సులో నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. ఈసారి ట్రిపుల్ ఐటీల్లో 94.78 శాతం సీట్లను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు సాధించినట్లు అధికారులు వెల్లడించారు.
మొదటి రెండేళ్లు ప్రీ యూనివర్సిటీ కోర్సుగా (యూపీసీ) పరిగణిస్తారు. మిగతా నాలుగేళ్లు బీటెక్ చదువుతారు. ఈసారి ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు మొత్తం 50,541 దరఖాస్తులు రాగా.. వాటిల్లో నుంచి నాలుగు క్యాంపస్‌లకు కలిపి మెరిట్ జాబితాలను విడుదల చేశారు.ఆ తర్వాత ధ్రువపత్రాల పరిశీలన తర్వాత… సీట్లను ఖరారు చేశారు.
సీట్లు పొందిన వారిలో అత్యధికంగా 69.01 శాతం మంది బాలికలు ఉండగా.. బాలురు 30.99 శాతం మంది ఉన్నారు. నూజివీడు క్యాంపస్‌కు సంబంధించి నూజివీడులో ధ్రువపత్రాల పరిశీలన జూన్ 30, జులై 1న నిర్వహించారు. శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్‌లకు సంబంధించి నూజివీడులో జులై 2 నుంచి 5 వరకు పూర్తి చేశారు. ఇడుపులపాయకు (ఆర్కేవ్యాలీ) సంబంధించి ఆర్కేవ్యాలీలో జూన్ 30 నుంచి జులై 1 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరిగింది. దీంతో ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసింది. మిగిలిపోయిన సీట్ల కోసం జూలై 14వ తేదీ నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
కౌన్సెలింగ్ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కాకుండా 15 రోజులు ఆలస్యం కావడం వల్ల చాలా మంది పాలిటెక్నిక్, ఇంటర్ కాలేజీల్లో చేరిపోయి ఉంటారని తెలుస్తోంది. దీంతో 500కుపైగా సీట్లు మిగిలినట్లు అంచనా వేస్తున్నారు. సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ద్వారా మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నారు.