తెలంగాణ బాటలోనే ఏపీ.. ఉన్నత విద్యలో నాన్‌ లోకల్‌ కోటా రిజర్వేషన్లు రద్దు.. అందుబాటులోకి రానున్న మరిన్ని సీట్లు-ap follows telangana way in non local quota reservations in higher education ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  తెలంగాణ బాటలోనే ఏపీ.. ఉన్నత విద్యలో నాన్‌ లోకల్‌ కోటా రిజర్వేషన్లు రద్దు.. అందుబాటులోకి రానున్న మరిన్ని సీట్లు

తెలంగాణ బాటలోనే ఏపీ.. ఉన్నత విద్యలో నాన్‌ లోకల్‌ కోటా రిజర్వేషన్లు రద్దు.. అందుబాటులోకి రానున్న మరిన్ని సీట్లు

Sarath Chandra.B HT Telugu

నాన్‌లోకల్‌ కోటా రిజర్వేషన్లపై తెలంగాణ బాటలో ఏపీ పయనిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో 15శాతం నాన్‌ లోకల్‌ కోటాను తెలంగాణ స్థానికత కలిగిన వారికి పరిమితం చేయగా తాజాగా ఏపీలో కూడా అదే విధానాన్ని అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానికేతర కోటాకు కొత్త నిర్వచనాలపై స్పష్టత ఇచ్చింది.

ఏపీలో నాన్‌ లోకల్‌ కోటా రిజర్వేషన్లపై కొత్త నిబంధనలు (HT)

ఏపీలో 15శాతం నాన్‌ లోకల్‌ కోటా రిజర్వేషన్లను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయంతో ప్రొఫెషనల్‌ కోర్సులు, డిగ్రీ, ఇంజనీరింగ్‌ వంటి ఉన్నత విద్య కోర్సుల్లో ప్రస్తుతం అమలవుతున్న 15% నాన్ లోకల్, జనరల్ కోటా సీట్లను ఇకపై పూర్తిగా ఏపీ వారికే కేటాయిస్తారు.

2025-26 విద్యా సంవత్సరంలో నాన్‌ లోకల్‌ కోటా 15% సీట్లు ఆంధ్రప్రదేశ్‌ స్థానికత కలిగిన విద్యార్థులకే దక్కుతాయి. నాన్‌ లోకల్ సీట్లలో తెలంగాణకు చెందిన వారికి కూడా అవకాశం ఉండేది. ప్రభుత్వ ఉత్తర్వులతో తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల వారికి ఈ అవకాశం ఉండదు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఉన్నత విద్యలో ప్రొఫెషనల్‌ కోర్సుల్లో అడ్మిషన్లు, ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిబంధనల్లో స్థానిక, స్థానికేతర నిర్వచనాలను స్పష్టం చేస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ జీవో-20, 21, 22లను జారీ చేశారు.

తెలంగాణలో స్థానికతపై ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్థానికులకే వర్తింప చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో కన్వీనర్ కోటా సీట్లు 10%లో 85% సీట్లను స్థానికులకు కేటాయిస్తారు.

రెండు రీజియన్ల పరిధిలో ప్రవేశాలు..

ఏపీలో స్థానికత రెండు రీజి యన్లుగా అమలు చేస్తారు. ఆంధ్ర యూనివర్శిటీ, శ్రీవేంకటేశ్వర వర్శిటీ రీజియన్లుగా స్థానికతను నిర్ణయి స్తారు. విభజన తర్వాత 10 ఏళ్లుగా ఏపీలో ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర, ఉస్మానియా రీజియన్లుగా సీట్ల భర్తీ చేసేవారు. తాజాగా ఉస్మానియా రీజియన్‌ ఏపీలో తొలగించారు. ఇకపై ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర రీజియన్ల వారీగా సీట్లను భర్తీ చేస్తారు.

ఆంధ్ర రీజియన్‌లో ఈ జిల్లాలు..

ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు ఏయూ పరిధిలో ఉంటాయి. ఈ జిల్లాల్లో చదివే విద్యార్థులను ఏయూ రీజియన్ స్థానికులుగా పరిగణిస్తారు.

శ్రీ వేంకటేశ్వర పరిధిలో జిల్లాలు...

ఉమ్మడి అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలు ఎస్వీయూ పరిధిలో ఉంటాయి. ఈ జిల్లాల వారిని ఎస్వీ లోకల్‌గా పరిగణిస్తారు.

స్థానికేతర కోటాకు అర్హతలు

  • స్థానికేతర, జనరల్ కోటా 15% సీట్ల కేటాయింపునకు కొన్ని నిబంధనలు విధించారు. ఆంధ్ర వర్సిటీ రీజియన్ అభ్యర్థులు.. శ్రీవేంకటే శ్వర రీజియన్‌లో 15% సీట్లకు పోటీ పడొచ్చు. శ్రీవేంకటేశ్వర రీజియన్ విద్యార్థులు.. ఆంధ్రా ప్రాంతంలో 15% స్థానికేతర సీట్లకు అర్హులవుతారు.
  • ఉద్యోగ ఉపాధి కారణాల రీత్యా తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నా.. ఇద్దరిలో ఎవరైనా ఒకరు గతంలో పదేళ్ల పాటు ఏపీలో నివసించిన వారై ఉంటే వారి పిల్లలు ఈ కోటాలో పోటీ పడొచ్చు.
  • అభ్యర్థి ఏపీలో కనీసం 10 ఏళ్లు నివసించి ఉండాలి. రాష్ట్రం బయట చదువుకున్న కాలాన్ని మినహాయించిన తర్వాత పదేళ్లు ఏపీలో నివాసం ఉండాలి.
  • అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులకు గతంలో మాదిరిగానే రీజియన్ల వారీగా ఆరు నుంచి ఇంటర్మీడి యట్ చదువును ప్రామాణికంగా తీసుకుంటారు. బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ తదితర కోర్సులకు మొదట తొమ్మిదో తరగతి నుంచి ఇంట ర్మీడియట్ వరకు వరసగా నాలుగేళ్ల చదువును పరిగణలోకి తీసుకుంటారు.
  • 9 నుంచి ఇంటర్మీడియట్ వరకు వరసగా నాలుగేళ్లు ఆయా రీజియన్లలో చదవకపోయినా.. ఏడేళ్లలో నాలుగేళ్లు చదివి ఉండాలి. ఏడేళ్ల కాలంలో ఎక్కువ కాలం చదివిన ప్రాంతాన్ని వారి స్థానికతకు ప్రామాణికంగా తీసుకుంటారు.
  • స్థానిక ప్రాంతంలో ఏ విద్యా సంస్థల్లోనూ నాలుగేళ్లు చదవకపోయినా.. అభ్యర్థి హాజరయ్యే అర్హత పరీక్షకు ముందు నాలుగేళ్లు ఏ ప్రాంతంలో నివాసం ఉంటే దాన్ని స్థానికతగా పరిగణిస్తారు.
  • రెండు లేదా అంత కంటే ఎక్కువ ప్రాంతాల్లో చదివిన కాలం సమానంగా ఉంటే చివరిగా చదివిన ప్రాంతాన్ని స్థానికతగా తీసుకుంటారు.
  • రాష్ట్రంలో ఏడేళ్లు ఏ విద్యాసంస్థల్లో చదవకపోయినా.. అర్హత పరీక్ష రాయక ముందు నుంచి ఏడేళ్ల పాటు ఏపీలో నివసించి ఉంటే స్థానిక అభ్యర్ధులుగా లెక్కిస్తారు. ఏపీలో ఉన్న ఏడేళ్లలో ఎక్కడ ఎక్కువ కాలం నివసించి ఉంటారో అక్కడ స్థానికులుగా పరిగణనలోకి వస్తారు.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాల యాలు, ఇతర అనుబంధ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యో గుల పిల్లలు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా నాన్‌ లోకల్‌ సీట్లకు పోటీ పడొచ్చు.
  • రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల జీవిత భాగస్వాములు కూడా నాన్‌లోకల్‌ కోటాకు అర్హులు అవుతారు. ఇతర రాష్ట్రాల వారు ఇక్కడ పనిచేస్తుంటే వారి భాగస్వామి భార్య లేదా భర్త స్థానికేతర కోటాకు దరఖాస్తు చేసుకోవచ్చు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం