గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ) సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి దూర విద్య ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. 2025 - 26 విద్యా సంవత్సరానికి సెమిస్టర్ విధానంలో వివిధ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
దరఖాస్తుల స్వీకరణ గడువు ఈనెల 31వ తేదీతో ముగియనుందని చేసినట్లు దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ వంకాయలపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ), డెబ్ (డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో) అనుమతితో యూజీ, పీజీ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
పీజీ ఆర్ట్స్ లో 11 కోర్సులు, యూజీ ఆర్ట్స్ విభాగంలో 9 కోర్సులు, పీజీ కామర్స్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ 3 కోర్సులు, యూజీ కామర్స్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ 3 కోర్సులు, లైబ్రరీ ప్రోగ్రామ్స్ 2 కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. పీజీ సైన్స్ విభాగంలో ఎమ్మెస్సీ బొటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఎమ్మెస్సీ సైకాలజీ, ఎంసీఏ తదితర 11 సైన్స్ కోర్సుల లో ప్రవేశం పొందే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని వెంకటేశ్వర్లు చెప్పారు.
కోర్సుల కాల వ్యవధి, విద్యా అర్హతలు, ఫీజులు తదితర వివరాలను www.anucde.info వెబ్ సైట్ నుంచి లేదంటే ఫోన్ నంబర్స్ 98484 77441, 0863-2346323 సంప్రదించవచ్చుని డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు తెలిపారు
మరోవైపు 2025 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది. దీని ద్వారా రెండేళ్ల కాలపరిమితితో ఉండే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ), మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందుకు సంబంధించిన వివరాలను దూర విద్య కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ వంకాయలపాటి వెంకటేశ్వర్లు వెల్లడించారు.
ఈనెల 23వ తేదీ (ఆదివారం) రాష్ట్ర వ్యాప్తంగా 7 పరీక్ష కేంద్రాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుంది. ఎంట్రెన్స్ ఎగ్జామ్ కు దరఖాస్తులు చేయని అభ్యర్థులు నేరుగా టెన్త్ క్లాస్, డిగ్రీ ప్రొవిజినల్, మార్కుల జాబితా అభ్యర్థి ఫోటో తోపాటు సాధారణ ఫీజు రూ. 500 చెల్లించి హాజరుకావొచ్చు. సంబంధిత ప్రవేశ పరీక్ష ఫలితాలును ఈనెల 25వ తేదీన సాయంత్రం విడుదల చేస్తారు.
మొత్తం 7 పరీక్ష కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష జరుగుతుంది. ఇందులో సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆచార్య నాగార్జున యూనివర్శిటీ (గుంటూరు), ఆదిత్య డిగ్రీ కాలేజ్ (కాకినాడ), ఎంఎస్ఆర్ఎస్ సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ (విశాఖపట్నం), గీతం డిగ్రీ కాలేజ్ (ఒంగోలు), గేట్ డిగ్రీ కాలేజ్ (తిరుపతి), శ్రీ విజయ దుర్గ డిగ్రీ కాలేజ్ (కర్నూలు), శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ (అనంతపురం) కేంద్రాలు ఉన్నాయి. ఏపీ ఐసెట్ 2024లో అర్హత సాధించిన అభ్యర్థులు నేరుగా ఈ కోర్సుల్లో అడ్మిషన్లను పొందవచ్చు. ప్రత్యేకంగా ప్రవేశపరీక్షకు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీస విద్యార్హతలు కలిగి ఉండాలి. రెండేళ్ల వ్యవధి ఎంబీఏ జనరల్ కోర్సులకు ఏదైనా సబ్జెక్టులో డిగ్రీ కలిగి ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు డిగ్రీలో 45 శాతం, మిగిలిన వారికి 50 శాతం ఉత్తీర్ణత శాతం కలిగి ఉండాలి.
ఎంబీఏ జనరల్‌లో ఫైనాన్స్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ట్రావెల్ టూరిజం మేనేజ్మెంట్, బిజినెస్ ఎనాలిటిక్స్, ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ మొత్తం 8 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. అందులో రెండిటిని మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంసీఏ కోర్సులకు పది తర్వాత ఇంటర్, డిగ్రీ లేదా ఇంజనీరింగ్, డిప్లొమా తర్వాత డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎంసీఏ కోర్సులకు డిగ్రీలో తప్పనిసరిగా మ్యాథ్స్ చదివి ఉండాలి. దూర విద్యలో మ్యాథ్స్ డిగ్రీ చదివిన వారిని కూడా అర్హులుగా గుర్తిస్తారు. డిగ్రీలో మ్యాథ్స్ చదవని విద్యార్థులు ఇంటర్‌లోనైనా మ్యాథ్స్ సబ్జెక్టును చదివి ఉండాలి అని వెల్లడించారు.
ఉమ్మడి ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు వర్సిటీ దూరవిద్య అధికార వెబ్‌సైట్ www.anucde.info నుంచి హాల్ టికెట్లను, ర్యాంక్ కార్డులు పొందవచ్చు. మరిన్ని వివరాలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్య కేంద్రం www.anucde.info అధికారిక వెబ్ సైట్ లో చూడొచ్చు. లేదా 98484 77441, 0863-2346323 నెంబర్లను సంప్రదించవచ్చుని డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు తెలిపారు.