మార్చి 2025లో నిర్వహించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 23న విడుదల చేసిన విషయం తెలిసిందే. అనంతరం రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ దరఖాస్తులను ఆహ్వానించారు. పాఠశాలల లాగిన్‌లో గత నెల 24 నుంచి.. మే 1వ తేదీ వరకు వరకు అందుబాటులో ఉంచారు. దీనికి సంబంధించి 66 వేల 421 జవాబు పత్రాలు రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేశారు.
66 వేల 421 జవాబు పత్రాలలో.. మొత్తం 47 వేల 484 జవాబు పత్రాల ఫలితాలు శుక్రవారం విడుదల చేసినట్లు.. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డా.కె.వి.శ్రీనివాసులు రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మిగిలిన ఫలితాలు కూడా త్వరలో విడుదల చేస్తామని వివరించారు. ఈ రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ ఫలితాలు పాఠశాలల లాగిన్‌లో అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు. సంబంధిత ప్రధానోపాధ్యాయులు వాటిని డౌన్‌లోడ్ చేసి, విద్యార్థులకు సాఫ్ట్‌కాపీ, హార్డ్‌కాపీ అందజేయవచ్చని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో 2025వ సంవత్సరానికి పదో తరగతి పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ సంవత్సరం మొత్తం 6,14,459 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలకు హాజరైన వారిలో 4,98,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం ఉత్తీర్ణత 81.14 శాతంగా నమోదైంది.
బాలికలు 84.09 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 78.31 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు బాలురు కంటే మెరుగైన ఫలితాలు సాధించారు. పార్వతీపురం మన్యం జిల్లా అత్యధికంగా 93.90 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా 1,680 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణతను నమోదు చేశాయి.
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలను మే 19 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన హాల్ టిక్కెట్లు 14వ తేదీన విడుదల చేశారు. bse.ap.gov.in వెబ్ సైట్ నుంచి విద్యార్థులు వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని అధికారులు వివరించారు. సప్లిమెంటరీ ఫలితాలను కూడా పరీక్షలు ముగిసిన కొన్ని రోజుల్లోనే విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు.