CBSE schools: ‘‘అన్ని సీబీఎస్ఈ స్కూళ్లు కచ్చితంగా వెబ్ సైట్ కలిగి ఉండాలి.. అందులో టీచర్ల వివరాలుండాలి’’
CBSE schools: ప్రత్యేక వెబ్ సైట్ లను కలిగి ఉండడం గురించి అన్ని సీబీఎస్ఈ స్కూళ్లకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) చివరి హెచ్చరికను జారీ చేసింది. అన్ని సీబీఎస్ఈ పాఠశాలలు కచ్చితంగా వెబ్ సైట్ లను కలిగి ఉండాలని, అందులో ఆ స్కూల్ లోని అందరు టీచర్ల వివరాలు ఉండాలని స్పష్టం చేసింది.
CBSE schools alert: ప్రత్యేకంగా వెబ్ సైట్ లను కలిగి ఉండడం గురించి అన్ని సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తుది అవకాశాన్ని ఇస్తోంది. ఆయా స్కూళ్లు తమకు ప్రత్యేకంగా వెబ్ సైట్ లను అభివృద్ధి చేసుకోవాలని, అందులో విద్యార్హతలు, నిర్దేశిత సమాచారం, సంబంధిత సర్టిఫికెట్లు సహా ఉపాధ్యాయుల అన్ని వివరాలను నమోదు చేయాలని సీబీఎస్ఈ స్పష్టం చేసింది.
మూడేళ్ల క్రితమే..
సీబీఎస్ఈ మొదట 2021 మార్చి 5 న దీనికి సంబంధించి సర్క్యులర్ ను విడుదల చేసింది. ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలని మే 21, 2021 న రిమైండర్ ను పంపింది. పదేపదే ఆదేశాలు జారీ చేసినప్పటికీ, అనేక అనుబంధ పాఠశాలలకు ఇప్పటికీ ప్రత్యేక వెబ్ సైట్లు లేవని సీబీఎస్ఈ తెలిపింది. కొన్ని పాఠశాలలకు వెబ్సైట్లు ఉన్నాయి, కానీ ఆ వెబ్ సైట్స్ లో టీచర్ల (teachers) వివరాలు కానీ, ఇతర తప్పనిసరి సమాచారం కానీ లేదని వివరించింది. ఆ వెబ్ సైట్ లను రెగ్యులర్ గా అప్ డేట్ చేయడం లేదని గుర్తించామని వెల్లడించింది.
అప్ డేట్స్ లేవు..
"కొన్ని సందర్భాల్లో, పాఠశాలలు కావలసిన సమాచారం / పత్రాలను అప్ లోడ్ చేసినప్పటికీ, ఈ పత్రాలకు సంబంధించిన లింక్స్ క్రియారహితంగా ఉన్నాయి. కొన్ని పాఠశాలలు నిర్దేశిత సమాచారం / పత్రాలను అప్లోడ్ చేసినప్పటికీ, దాని ఐకాన్ / లింక్ దాని మెయిన్ హోమ్ పేజీలో ప్రముఖంగా ప్రదర్శించి లేదు" అని సీబీఎస్ఈ ఇటీవలి సర్క్యులర్ లో తెలిపింది.
తుది అవకాశం
ఈ ఆదేశాలను ఇంకా పాటించని పాఠశాలలకు ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి సీబీఎస్ఈ ఇప్పుడు తుది అవకాశం ఇస్తోంది. సర్క్యులర్లను పరిశీలించి నిర్దేశిత సమాచారం, డాక్యుమెంట్లను 30 రోజుల్లోగా అప్ లోడ్ చేయాలని ఆదేశించింది. అలా చేయడంలో విఫలమైతే బోర్డు అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు నిబంధనల ప్రకారం జరిమానాలు విధిస్తుంది. ఇచ్చిన ఆదేశాలను పాటించిన పాఠశాలలు తమ వెబ్ సైట్ ను తిరిగి సందర్శించి, అప్ లోడ్ చేసిన సమాచారం, పత్రాలు సీబీఎస్ఈ (cbse) ఆదేశాలకు అనుగుణంగా ఉన్నాయో, లేదో సరిచూసుకోవాలని సూచించింది. ఏదైనా వ్యత్యాసం ఉంటే, వెంటనే అప్డేట్ చేసుకోవాలని కోరింది.