ఏపీ మెగా డీఎస్సీలో ఉద్యోగం సాధించాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి? 9 ముఖ్యమైన అంశాలు-9 important points to know to get a job in ap mega dsc ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ మెగా డీఎస్సీలో ఉద్యోగం సాధించాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి? 9 ముఖ్యమైన అంశాలు

ఏపీ మెగా డీఎస్సీలో ఉద్యోగం సాధించాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి? 9 ముఖ్యమైన అంశాలు

రాష్ట్రంలో ఉపాధ్యాయ కొలువుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. చాలామంది టీచర్ జాబ్ సాధించాలని పట్టుదలగా ఉన్నారు. కానీ.. సరైన ప్రిపరేషన్ పద్ధతులు తెలియక టెన్షన్ పడుతున్నారు. అలాంటి వారికి నిపుణులు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఎలా ప్రిపేర్ అయితే ఉద్యోగం సాధించవచ్చో తెలియజేస్తున్నారు.

ఏపీ డీఎస్సీ ప్రిపరేషన్ (unsplash)

ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫిషన్ ఎట్టకేలకు విడుదలైంది. దీంతో అభ్యర్థులు పుస్తకాలతో కుస్తీని మరింత పెంచారు. అయితే.. ప్రణాళికబద్ధంగా చదివితే ఉద్యోగం సాధించడం సులువని నిపుణులు చెబుతున్నారు. డీఎస్సీలో విజయం సాధించడానికి సమగ్రమైన ప్రిపరేషన్ అవసరం అని స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి 9 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

1.పరీక్షా విధానం, సిలబస్..

ముందుగా ఏపీ డీఎస్సీ పరీక్షా విధానం, సిలబస్‌ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. మీరు దరఖాస్తు చేస్తున్న పోస్టును బట్టి పరీక్షా విధానం మారుతుంది. స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ విధానాలు వేర్వేరుగా ఉంటాయి. సిలబస్‌ను అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రతి అంశానికి ఎంత వెయిటేజ్ ఉందో తెలుసుకొని మీ ప్రిపరేషన్‌ను ప్లాన్ చేసుకోవాలి.

2.సమగ్రమైన అధ్యయన ప్రణాళిక..

సిలబస్‌ను అనుసరించి ఒక అధ్యయన ప్రణాళికను రూపొందించుకోవాలి. ప్రతిరోజూ చదవడానికి నిర్దిష్ట సమయాన్ని కేటాయించాలి. ప్రతి సబ్జెక్టుకు తగినంత సమయం ఇవ్వాలి. కష్టంగా అనిపించే సబ్జెక్టులపై ఎక్కువ దృష్టి పెట్టాలి. క్రమం తప్పకుండా రివిజన్ చేయడానికి సమయం కేటాయించాలి.

3.సరైన అధ్యయన సామగ్రి..

ప్రామాణికమైన పాఠ్యపుస్తకాలు, మెటీరియల్‌ను ఎంచుకోవాలి. ఎస్సీఈఆర్టీ, ఎన్‌సీఈఆర్టీ పుస్తకాలు చాలా ముఖ్యమైనవి. మునుపటి ప్రశ్న పత్రాలను సేకరించి వాటిని సాధన చేయాలి. మాక్ టెస్ట్‌లు రాయడం ద్వారా ప్రిపరేషన్‌ను అంచనా వేసుకోవచ్చు.

4.ముఖ్యమైన అంశాలు..

జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన సమకాలీన అంశాలపై దృష్టి పెట్టాలి. విద్యా చరిత్ర, ఉపాధ్యాయ సాధికారత, విద్యా సంబంధిత చట్టాలు, విధానాలు ముఖ్యమైనవి. బాలల అభివృద్ధి, అభ్యసన సిద్ధాంతాలు, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలు కీలకం. మీరు ఎంచుకున్న సబ్జెక్టుపై మంచి పట్టు సాధించాలి. బోధనా పద్ధతులు కూడా ముఖ్యమైనవి. మీ టెట్ స్కోర్‌కు కూడా వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి టెట్‌ను కూడా సీరియస్‌గా తీసుకోవాలి.

5.సమయ నిర్వహణ..

పరీక్ష కాలంలో సమయాన్ని ఎలా నిర్వహించాలో ప్రాక్టీస్ చేయాలి. మాక్ టెస్ట్‌లు రాసేటప్పుడు టైమ్ లిమిట్‌ను పెట్టుకోవాలి. దీని ద్వారా భయం తగ్గుతుంది.

6.ఆరోగ్యకరమైన జీవనశైలి..

సరైన నిద్ర అవసరం. నిద్ర లేకుండా చదివితే ఉపయోగం ఉండదు. మంచి ఆహారం తీసుకోవాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయాలి.

7.నిరంతర ప్రేరణ..

మీ లక్ష్యాన్ని గుర్తుంచుకోవాలి. నిరంతరం ప్రయత్నించాలి. పాజిటివ్‌గా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో ప్రిపేర్ అవ్వాలి.

8.ముఖ్యమైన సూచనలు..

అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా సందర్శిస్తూ ఉండాలి. నోటిఫికేషన్లు, ముఖ్యమైన తేదీలను గమనించాలి. మీ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి మీ ఉపాధ్యాయులు లేదా సీనియర్లతో చర్చించాలి. గ్రూప్ స్టడీస్ ఉపయోగకరంగా ఉంటాయి.

9.కచ్చితంగా సాధిస్తారు..

క్రమశిక్షణతో, సరైన ప్రణాళికతో ప్రిపేర్ అయితే ఏపీ మెగా డీఎస్సీలో ఉద్యోగం సాధించడం కచ్చితంగా సాధ్యమవుతుంది. మీకు 'హిందుస్తాన్ టైమ్స్ తెలుగు' తరఫున ఆల్ ది బెస్ట్!

సంబంధిత కథనం