TG SSC Exams 2025 : ఈసారి పదో తరగతి ప్రశ్నపత్రాలపై క్యూఆర్ కోడ్..! 9 ముఖ్యమైన అంశాలు
TG SSC Exams 2025 : పరీక్షలు ఏవైనా.. ప్రశ్నపత్రాల లీక్ పెద్ద సమస్యగా మారింది. పేపర్ లీక్ ఇష్యూపై గతంలో దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. తాజాగా.. పదో తరగతి ప్రశ్నపత్రాలపై క్యూఆర్ కోడ్ ముద్రిస్తున్నట్టు తెలిసింది.

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మార్చి 21 నుంచి ప్రారంభం కానున్నాయి. దాదాపు 5 లక్షల 25 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. పేపర్ లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. క్వశ్చన్ పేపర్లపై క్యూఆర్ కోడ్‌ను ముద్రిస్తోంది. దీనికి సంబంధించిన 9 కీలకమైన అంశాలు ఇలా ఉన్నాయి.
9 ముఖ్యమైన అంశాలు..
1.పదో తరగతి ప్రశ్నపత్రాలు లీకైతే.. వెంటనే ఏ పరీక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చాయో తెలుసుకొనేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
2.పదో తరగతి ప్రశ్నపత్రాలపై ఈసారి క్యూఆర్ కోడ్ తోపాటు.. ప్రతి పేపర్‌పై సీరియల్ నంబరు ముద్రించనుంది. అయితే.. దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ.. విద్యాశాఖ అధికారులు మాత్రం ఈ విషయాన్ని చెబుతున్నారు.
3.పరీక్ష పేపర్లు లీకైతే.. వెంటనే గుర్తించడం తోపాటు.. అసలు లీక్ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం ముఖ్యమని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సూచిస్తున్నారు.
4.ఈసారి గ్రేడింగ్‌కు బదులు.. మార్కుల విధానం అమలు కాబోతోంది. ఈ నేపథ్యంలో తమ విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించేందుకు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పోటీపడే అవకాశం ఉంది.
5.ఈ నేపేథ్యంలో.. సమస్యాత్మక పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి.. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించాలన్న సూచనలు వస్తున్నాయి.
6.పరీక్షా కేంద్రాల ప్రహరీలు దూకి కాపీలు అందించకుండా.. కిటికీల పక్కన కూర్చొని పరీక్షలు రాస్తున్న వారి క్వశ్చన్ పేపర్లను ఫోన్లతో ఫొటో తీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
7.మన పక్కనున్న మహారాష్ట్రలో.. పది, ఇంటర్ బోర్డులు సమస్యాత్మక పరీక్ష కేంద్రాల వద్ద డ్రోన్ల ద్వారా పర్యవేక్షించాయి. ఈ విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలనే డిమాండ్లు ఉన్నాయి.
8.విద్యార్థులకు హాల్ టికెట్లు జారీ కాగానే.. వారిచ్చిన మొబైల్ నంబర్లకు మెసేజ్ అందేలా ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది. లింక్‌ను క్లిక్ చేస్తే హాల్‌టికెట్ కనిపిస్తుంది. విద్యార్థులకు పరీక్ష కేంద్రం వివరాలు తెలుస్తాయి.
9.ఇలాంటి ఏర్పాటు పదో తరగతిలో కూడా చేయాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. దీంతో ఈజీగా పరీక్షా కేంద్రం వివరాలను తెలుసుకోవచ్చు.