Zomato new feature: కొత్త ఫీచర్ ‘ఫ్రెండ్స్ రికమెండేషన్’ ను ప్రారంభించిన జొమాటో; ఈ ఫీచర్ ను ఇలా యూజ్ చేయండి..
Zomato new feature: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ జొమాటో డిసెంబర్ 10 మంగళవారం కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ‘ఫ్రెండ్స్ రికమెండేషన్’ ఫీచర్ ఎలా పని చేస్తుందో ఇక్కడ చూద్దాం..
Zomato new feature: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ జొమాటో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు వినియోగదారుల అనుభవాన్ని పర్సనలైజ్ చేయడానికి ‘ఫ్రెండ్స్ రికమెండేషన్’ అనే కొత్త ఫీచర్ ను ప్రారంభించినట్లు మంగళవారం ప్రకటించింది.
జొమాటో యాప్ కొత్త వర్షన్ లో..
తాజా ఫీచర్ ను గత వారం యాప్ కు విడుదల చేశామని, జొమాటో యాప్ కొత్త వెర్షన్ లో ఇది అందుబాటులో ఉందని కంపెనీ వెల్లడించింది. ఈ ఫీచర్ వినియోగదారులు వారి స్నేహితులు వ్యక్త పరిచిన లేదా వారి స్నేహితులు రేటింగ్ ఇచ్చిన రెస్టారెంట్లు, వంటకాలను కనుగొనడంలో సహాయపడుతుంది. అంటే, మీ ఫ్రెండ్ రికమెండ్ చేసిన, లేదా మంచి రేటింగ్ ఇచ్చిన రెస్టారెంట్లు లేదా డిష్ లను ఇకపై జొమాటో యాప్ లో చూడవచ్చు. ‘‘కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు వారి స్నేహితులు చేసిన సిఫార్సుల ఆధారంగా రెస్టారెంట్లు లేదా డిష్ లను ఎంపిక చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. మా ప్లాట్ ఫామ్ లో వారు సరైన ఫుడ్ ను ఎంపిక చేసుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది" అని జొమాటో ఫుడ్ డెలివరీ విభాగం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) రాకేష్ రంజన్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు.
ప్రైవసీ ఫాక్టర్..
అయితే, ఈ ఫీచర్ వల్ల వినియోగదారుల ప్రైవసీని ఉల్లంఘించినట్లు అవుతుందన్న వాదనపై కంపెనీ స్పందించింది. తన రికమెండేషన్లు, లేదా రేటింగ్స్ ను జొమాటో యాప్ తన ఫ్రెండ్స్ కు షేర్ చేయాలా? వద్దా? అనేది వినియోగదారుడే నిర్ణయిస్తాడని, దానిపై అతడికే పూర్తి నియంత్రణ ఉంటుందని తెలిపింది. కాగా, మంగళవారం మార్కెట్ సెషన్ ముగిసే సమయానికి జొమాటో లిమిటెడ్ షేరు ధర (share price) 0.22 శాతం పెరిగి రూ.295.90 వద్ద ముగిసింది.
కొత్త ఫీచర్ ను యూజర్లు ఎలా వాడొచ్చు?
జొమాటో వినియోగదారులు తమ యాప్ లోని “manage recommendations” విభాగం ద్వారా తమ రికమెండేషన్లను నియంత్రించవచ్చు. ఆ విభాగం నుంచి వారు రికమెండేషన్లను పంపవచ్చు, ఎడిట్ చేయవచ్చు లేదా ఆఫ్ చేయవచ్చు. ఈ రికమెండేషన్లలో ఆ వినియోగదారుడి ఆర్డర్ హిస్టరీ లేదా ఆర్డర్ ఫ్రీక్వెన్సీ లు కనిపించవు అని కంపెనీ ధృవీకరించింది. కస్టమర్ పంచుకున్న సిఫార్సులను వారి కాంటాక్ట్ యాక్సెస్ ను పంచుకున్న స్నేహితులు మాత్రమే చూడగలరు. వారు సిఫార్సులను చూడాలనుకునే కాంటాక్ట్ గా కస్టమర్ ను ఎంచుకుంటారు" అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే, యూజర్లు ఈ కొత్త ఫీచర్ నుంచి వైదొలిగే అవకాశం కూడా ఉంటుంది. కస్టమర్లు తమ స్నేహితుల నుంచి సిఫార్సులు చూడకూడదనుకుంటే ఈ ఫీచర్ను ఉపయోగించకుండా ఉండవచ్చని జొమాటో (zomato) తెలిపింది.