సైబర్ నేరాలు భారీగా పెరుగుతున్నాయి. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ల ద్వారా కొద్ది రోజుల్లోనే భారీ లాభాలు తెప్పిస్తామనే ఫేక్ మార్కెట్ ఎక్స్ పర్ట్స్ బారిన పడి చాలా మంది లక్షల్లో నష్టపోతున్నారు. ఆన్ లైన్ లో పకడ్బందీగా నకిిలీ యాప్ లను సృష్టించి ఇన్వెస్టర్లను మోసం చేస్తున్నారు. ముఖ్యంగా వాట్సాప్ లో ఇలాంటి స్కామ్ లు ఇటీవల భారీగా పెరిగాయి. అలాంటి ఒక స్కామ్ గురించి జెరోధా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నితిన్ కామత్ ఇన్వెస్టర్లను హెచ్చరిస్తున్నారు. అన్ని ఇన్వెస్ట్మెంట్ కుంభకోణాల్లో అత్యధికంగా బాధితులైనది 'వాట్సాప్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్' లోనే అని ఒక ఎక్స్ పోస్ట్ లో కామత్ పేర్కొన్నారు.
వాట్సాప్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్ ఎలా పనిచేస్తుందో మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ ద్వారా నితిన్ కామత్ దశలవారీగా వివరించారు. తమ ఆన్ లైన్ ట్రేడింగ్ ప్లాట్ ఫామ్ కైట్ తరహాలోనే యాప్ ను తయారు చేసి స్కామర్లు మోసం చేస్తారని వివరించారు. తద్వారా డి-స్ట్రీట్ ఇన్వెస్టర్లు ట్రేడింగ్ లో ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించి, జాగ్రత్త పడవచ్చు. ఆన్లైన్లో ఇలాంటి పెట్టుబడి మోసాల బారిన పడకుండా తమను తాము రక్షించుకోవచ్చు.
వాట్సప్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్ ఇన్వెస్టర్లను ఎలా మోసం చేస్తుందో స్టెప్ బై స్టెప్ ద్వారా కామత్ వివరించారు. అవి
దశ 1: మిమ్మల్ని "జెరోధా ఎలైట్ ట్రేడర్స్" లేదా "ప్రీమియం ఇన్వెస్టర్స్ క్లబ్" వంటి పేర్లతో ఒక వాట్సాప్ గ్రూప్ కు యాడ్ చేస్తారు. లోగో, రంగులు, సెబీ లైసెన్స్ నంబర్లు కూడా చట్టబద్ధంగా కనిపిస్తాయి. అడ్మిన్లుగా నేను (నితిన్ కామత్), నిఖిల్ కామత్, వేణు లేదా మా ఉద్యోగులలో కొంతమంది కనిపిస్తారు.
స్టెప్ 2: కొన్ని గంటల్లోనే, ఆ గ్రూప్ లో మీకు 100-200% ఇంట్రాడే రిటర్న్స్ పొందిన వారి వివరాలు కనిపిస్తాయి. వారు నిజంగానే తమకు లాభాలు వచ్చాయని చెబుతారు. అలాంటి మెసేజ్ లు, స్క్రీన్ షాట్స్ తో మీ ఇన్ బాక్స్ నిండిపోతుంది. అయితే, అవన్నీ నకిలీవే అన్న విషయం గుర్తించాలి.
స్టెప్ 3: మీరు ఆసక్తి చూపుతున్నట్లు వారికిి తెలియగానే, వారు మీకు "ప్రీమియం సిగ్నల్స్" ను పంపుతారు. కైట్ మాదిరిగా కనిపించే నకిలీ యాప్ కు లింక్ చేస్తారు. మీరు డబ్బు డిపాజిట్ చేసిన తర్వాత, డ్యాష్ బోర్డు లో మీకు మీరు ఊహించనంత లాభాలను చూపిస్తారు. ఇది కూడా నకిలీనే అని గమనించాలి.
దశ 4: మీరు మీ డబ్బులను పూర్తిగా, లేదా పాక్షికంగా ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించినప్పుడు ప్రాసెసింగ్ ఫీజు, పన్నులు, ఇతర ధృవీకరణ ఛార్జీలు చెల్లించాలని మీకు చెబుతారు. అలా సాధ్యమైనన్ని సార్లు మీ వద్ద నుంచి డబ్బులు లాగుతారు. ఆ తరువాత మోసగాళ్లు మీ డబ్బులు తీసుకుని మాయమైపోతారు. అప్పుడు గానీ, మోసపోయినట్లు మీరు గుర్తించరు.
జెరోధా తరఫున మేం కానీ, మరెవరు కానీ స్టాక్ చిట్కాలు, పెట్టుబడి సలహాలు లేదా వాట్సాప్ / టెలిగ్రామ్ ట్రేడింగ్-సిగ్నల్ గ్రూపులను నిర్వహించదని కామత్ స్పష్టం చేశారు. అన్ని అధికారిక కమ్యూనికేషన్లు మా ధృవీకరించిన మార్గాల ద్వారా మాత్రమే వస్తాయని వివరించారు. ‘‘ఎవరైనా జెరోధా తరఫున అలాంటి చిట్కాలతో మిమ్మల్ని వాట్సాప్ లేదా ఏ ఇతర ఆన్ లైన్ మీడియం ద్వారా మిమ్మల్ని సంప్రదించినా, అవి మోసపూరితమని గ్రహించాలి’’ అని కామత్ వివరించారు.
గత కొన్నేళ్లుగా భారత్ లో ఇన్వెస్ట్ మెంట్ కుంభకోణాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ముంబైలో వీటి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. 2024 లో ముంబైలో ఇలాంటి నేరాలకు సంబంధించి 5,087 కేసుల నమోదు కాగా, 2023 లో 4,169 కేసులు నమోదయ్యాయి. ఒక స్కామర్ నిజమైన పెట్టుబడి గురించి అబద్ధం చెప్పవచ్చు లేదా తప్పుడు సమాచారం ఇవ్వవచ్చు. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు ఇన్వెస్టర్లు ఎల్లప్పుడూ సర్టిఫైడ్ అడ్వైజర్స్ లేదా సెబీ రిజిస్టర్డ్ నిపుణుల నుండి స్వతంత్ర న్యాయ సలహా లేదా ఆర్థిక సలహాలను పొందాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
సూచన: ఈ విశ్లేషణలోని అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు లేదా బ్రోకింగ్ కంపెనీలవి, హెచ్ టీ తెలుగు వి కాదు. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని మేము పెట్టుబడిదారులకు గట్టిగా సలహా ఇస్తున్నాము.
సంబంధిత కథనం