భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన బ్రాండ్లలో ఒకటైన జెలియో ఈ మొబిలిటీ, దాని ప్రసిద్ధ లెజెండ్ స్కూటర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కొత్త డిజైన్, కొత్త కలర్ ఆప్షన్స్, మెరుగైన లక్షణాలతో కొత్త లెజెండర్ ఫేస్‌లిఫ్ట్‌ను తీసుకువస్తుంది. జూలై 2025లో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న లెజెండర్ ఫేస్‌లిఫ్ట్ పనితీరు, ఇతర వివరాలు చూద్దాం..
పట్టణ ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి ఈ కొత్త స్కూటర్ రూపొందించారు. లెజెండర్ సమర్థవంతమైన 60/72V BLDC మోటారుతో పనిచేస్తుంది. ఒక్కో ఛార్జీకి 1.5 యూనిట్ల విద్యుత్తును మాత్రమే వినియోగిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు పర్యావరణ అనుకూల పరిష్కారాన్ని అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఫేస్‌లిఫ్టెడ్ లెజెండర్ గరిష్టంగా గంటకు 25 కి.మీ వేగంతో, ఛార్జ్‌కు 150 కి.మీ రేంజ్ అందిస్తుందని చెబుతున్నారు.
విశ్వసనీయత, తక్కువ నిర్వహణ ఖర్చులు కలిగిన స్కూటర్ల కోసం చూస్తున్న కస్టమర్లకు ఇది బెటర్ ఆప్షన్. విడుదలైన తర్వాత ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని కంపెనీ పేర్కొంది. దీని డిజైన్ గురించి చూస్తే.. ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విభిన్నంగా చేసేది దాని కొత్త గ్రాఫిక్స్, అప్డేట్ చేసిన బాడీ స్టైలింగ్, స్పోర్టీ బోల్డ్ లుక్.. రైడర్‌లను ఆకర్షించడానికి జాగ్రత్తగా రూపొందించినట్టుగా కంపెనీ తెలిపింది.
ఈ స్కూటర్ గురించి జెలియో ఈ మొబిలిటీ లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ కునాల్ ఆర్య మాట్లాడుతూ.. 'లెజెండర్ చాలా కాలంగా మా పోర్ట్‌ఫోలియోలో ఒక ఇష్టమైన స్కూటర్. దాని సామర్థ్యం, విశ్వసనీయత, రోజువారీ ఆచరణాత్మకతకు ప్రశంసలు అందుకుంది. దాని ఫేస్‌లిఫ్ట్‌తో లెజెండర్ మరోసారి బోల్డ్, ఫ్రెష్, నేటి రైడర్లకు నచ్చే విధంగా ఉంటుంది.' అని చెప్పారు.
ఎలక్ట్రిక్ మొబిలిటీని స్టైలిష్‌గా, సరసమైనదిగా, భవిష్యత్తుకు సిద్ధంగా ఉంచే తమ ప్రయాణంలో ఒక ముందు అడుగు అని.. కునాల్ చెప్పారు. రాబోయే కొత్త స్కూటర్ నగర ప్రయాణాలకు ఉత్తమ ఎంపిక అవుతుందన్నారు. చిన్న ప్రయాణాలకు ఇది ఒక ముఖ్యమైన రవాణా వనరుగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
జెలియో ఈ మొబిలిటీ 2,00,000 కంటే ఎక్కువ మంది కస్టమర్‌లు, 400 కంటే ఎక్కువ అవుట్‌లెట్‌ల బలమైన డీలర్‌షిప్ నెట్‌వర్క్‌తో ఉంది. 2025 చివరి నాటికి 1,000 డీలర్‌షిప్‌లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.