YouTube Ad Revenue : 2024లో యూట్యూబ్ యాడ్ రెవెన్యూ తెలిస్తే నోరెళ్లబెడతారేమో!
YouTube Ad Revenue In 2024 : యూట్యూబ్ ప్రకటనల ద్వారా 2024లో భారీగా సంపాదించింది. ఇప్పటివరకు ఇదే అత్యధికం. లక్షల కోట్లు యాడ్స్ ద్వారా వచ్చాయి.

యూట్యూబ్ ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్. ఇటీవల దాని వార్షిక ఆదాయ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2024లో యూట్యూబ్ 36.2 బిలియన్ డాలర్లు ప్రకటనల ద్వారా సంపాదించింది. ఈ ఆదాయం యాడ్స్ ద్వారా వచ్చినది మాత్రమే. యూట్యూబ్ ప్రీమియం, యూట్యూబ్ టీవీవంటి వాటి నుంచి వచ్చిన ఆదాయం వేరుగా ఉంది. అంటే మిగిలిన ఆదాయం కలిపితే మరింత పెరుగుతుంది.
యూట్యూబ్ రికార్డ్
2024 చివరి త్రైమాసికంలోనే ప్రకటనల ద్వారా యూట్యూబ్ 10.47 బిలియన్ల డాలర్లు ఆర్జించింది. ఏ త్రైమాసికంలోనూ ప్రకటనల సహాయంతో ఇంత ఆదాయం సంపాదించలేదు. అంటే 2024 ఏడాదిలో 36.2 బిలియన్ డాలర్లు సంపాదిస్తే.. కేవలం చివరి త్రైమాసికంలో 10.47 బిలియన్ల డాలర్లను సంపాదించింది. యూట్యూబ్ యాడ్స్ ద్వారా రికార్డు బద్దలు కొట్టింది.
స్కిప్ చేయలేని యాడ్స్
అయితే ఈ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రకటనలకు సంబంధించిన అంశం మారుతుండటం వల్ల వినియోగదారులు కాస్త అసౌకర్యంగా ఫీలవుతున్నారు. గత కొన్ని రోజులుగా కొంతమంది యూట్యూబ్ వినియోగదారులు స్కిప్ చేయలేని ప్రకటనలు చూస్తున్నట్టుగా ఫిర్యాదు చేస్తున్నారు. దీని వలన చాలా మంది యూట్యూబ్ ప్రీమియం కోసం సైన్ అప్ చేయాల్సి వస్తోంది.
యాడ్ బ్లాకర్లు
గతంలో యూట్యూబ్ యాడ్ బ్లాకర్లపై కఠినమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఒక యూజర్ యాడ్ బ్లాకర్ ఉపయోగిస్తుంటే ఆ యాడ్-బ్లాకర్‌ను తీసివేయమని లేదా యూట్యూబ్ ప్రీమియం కొనుగోలు చేయమని అడుగుతూ పాప్ అప్ హెచ్చరికను అందుకున్నారు. యూట్యూబ్ యాడ్ బ్లాకర్ సాయంతో వీడియోలు ప్లే చేస్తే ఆటోమేటిక్‌గా స్కిప్ అవుతాయి. అంటే వీడియోను ప్లే చేయగానే ఎండ్ అయిపోయినట్టుగా చూపిస్తుందన్నమాట. ఇలాంటి అనుభవం ఎదుర్కొన్నట్టుగా చాలామంది చెప్పారు.
ప్రకటనలే ప్రధాన ఆదాయం
యూట్యూబ్ ప్లాట్‌ఫామ్ ప్రకటనలే ప్రధాన ఆదాయ వనరు అని పేర్కొంది. అందువల్ల యాడ్ బ్లాకర్ల వాడకాన్ని ఆపేయడానికి కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. యాడ్స్ రాకుండా ఉండేందుకు చాలా మంది యాడ్ బ్లాకర్‌ను వాడేవారు. తమ వేదికపై కంటెంట్ అందించే క్రియేటర్లకు ఆదాయం అందించాలంటే యాడ్స్ ముఖ్యమని యూట్యూబ్ చెబుతోంది. మెుదట 30 సెకన్ల యాడ్ స్కిప్ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు కొన్ని యాడ్స్ స్కిప్ చేయడానికి కూడా ఆప్షన్ లేదు.
యూట్యూబ్ ప్రీమియం
ఈ యాడ్స్ గోల ఎందుకు అనుకున్నవారు.. యూట్యూబ్ ప్రీమియం తీసుకుంటున్నారు. ప్రకటనలను నివారించడానికి చాలా మంది వినియోగదారులు ఇప్పుడు ప్రీమియం సభ్యత్వాన్ని తీసుకుంటున్నారు. యూట్యూబ్ తన ప్రకటనల విధానాన్ని సమర్థించుకున్నప్పటికీ, వినియోగదారులు ఈ మార్పును అసౌకర్యంగా ఫీలవుతున్నారు.