Yamaha Tenere 700 : ఈ బైక్‌కు డబుల్ పెట్రోల్ ట్యాంకులు.. యూత్‌కి మాత్రం తెగ నచ్చేస్తుంది!-yamaha tenere 700 bike has double fuel tanks showcased at bharat mobility global expo 2025 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Yamaha Tenere 700 : ఈ బైక్‌కు డబుల్ పెట్రోల్ ట్యాంకులు.. యూత్‌కి మాత్రం తెగ నచ్చేస్తుంది!

Yamaha Tenere 700 : ఈ బైక్‌కు డబుల్ పెట్రోల్ ట్యాంకులు.. యూత్‌కి మాత్రం తెగ నచ్చేస్తుంది!

Anand Sai HT Telugu

Yamaha Tenere 700 : యమహా 2025 ఆటో ఎక్స్‌పోలో Tenere 700 పేరుతో కొత్త బైక్‌ను పరిచయం చేసింది. ఈ బైక్‌లో డబుల్ పెట్రోల్ ట్యాంక్ ఉంది. ఇప్పటి వరకు ఇలాంటిది మరే బైక్‌లోనూ కనిపించలేదు.

యమహా Tenere 700 బైక్

యమహా సరికొత్త బైక్‌ను పరిచయం చేసింది. ఈ బైక్‌కు డబుల్ పెట్రోల్ ట్యాంక్ అందించారు. ఏ బైక్ సెగ్మెంట్‌లోనైనా డబుల్ పెట్రోల్ ట్యాంక్‌ను విడుదల చేయడం ఇదే తొలిసారి. ఈ బైక్ పేరు యమహా Tenere 700. దీని డిజైన్ కూడా చాలా బాగుంది. ఈ బైక్‌లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.

Tenere 700 యమహా 689సీసీ సీపీ2 సమాంతర ట్విన్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది ఎంజీ-07, ఎక్స్ఎస్‌ఆర్700 వంటి మోడళ్ల నుంచి చాలా ఫీచర్లను తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇది 72 హెచ్‌పీ పవర్, 68 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. రైడర్లకు అనుగుణంగా ఇందులో అనేక ఫీచర్లు ఉన్నాయి. హార్డ్, సాఫ్ట్ లగేజీ, అప్‌గ్రేడ్ చేసిన స్కిడ్ ప్లేట్లు, క్రాష్ బార్‌లు, ర్యాలీ సీట్లు ఉన్నాయి. ఇందులో ఒక్కొక్కటి 23 లీటర్ల రెండు ఇంధన ట్యాంకులు ఉన్నాయి. ఇది ఇంధన సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 185 కి.మీ. లీటర్‌కు 20 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

Tenere 700 ఆఫ్-రోడ్ రైడింగ్ కోసం రూపొందించారు. ఇది 43 ఎంఎం సర్దుబాటు చేయగల KYB ఫ్రంట్ ఫోర్క్‌లను కలిగి ఉంది. ఇది 240 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, 21 అంగుళాల ముందు, 18 అంగుళాల వెనుక చక్రాలతో ఉంటుంది. కష్టమైన రోడ్లపై కూడా సాఫీగా వెళ్లడానికి సాయపడుతుంది. బైక్ 62.8 అంగుళాల వీల్‌బేస్ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

కొత్త Tenere 700 బైక్ స్విచ్ చేయగల ఏబీఎస్(యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్), డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది. ఆఫ్-రోడ్ రైడింగ్ సమయంలో వెనుక చక్రాల ఏబీఎస్ స్విచ్ ఆఫ్ చేయడం సౌకర్యంగా ఉంటుంది. ఇదొక గొప్ప అడ్వెంచర్ బైక్. ప్రస్తుతమైతే ఆటోఎక్స్‌పోలో ప్రదర్శనకు వచ్చింది. భారతదేశంలో లాంచ్ చేయడం గురించి ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది.