Electric Vehicle : వీల్ చైర్ దిగకుండానే ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని నడపవచ్చు
Electric Vehicle : వికలాంగుల కోసం ప్రత్యేకమైన సౌకర్యాలు, ఫీచర్లతో కూడిన ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఉన్నాయి. యాలీ మెుబిలిటీ అనే కంపెనీ వారికోసం ప్రత్యేకంగా ఈవీని తయారు చేసింది. వీల్ చైర్‌లో ఉన్నవారు కూడా అలానే వాహనం నడపవచ్చు.
తమిళనాడులోని ఐఐటీ మద్రాస్‌కు చెందిన యాలీ మొబిలిటీ అనే కంపెనీ వికలాంగుల కోసం ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేసింది. అనేక ఫీచర్లతో తయారు చేసిన ఈ మూడు చక్రాల ఎలక్ట్రిక్ వాహనం గురించి సమాచారం చూద్దాం.. వికలాంగులు వీల్‌చైర్ నుండి బయటకు రాకుండానే ఈ ట్రైసైకిల్‌ను నడపగలగడం దీని అత్యుత్తమ ఫీచర్లలో ఒకటి. యాలీ మొబిలిటీ కంపెనీ ఈ వాహనాన్ని అభివృద్ధి చేసింది. వికలాంగులు తమ ప్రయాణం కోసం ఇతరులపై ఆధారపడకుండా ఉండేందుకు ఇది సాయపడుతుంది. కార్ల మాదిరిగానే ఈ త్రీవీలర్‌కు కూడా యాలీ మొబిలిటీ ప్రత్యేక రిమోట్‌ను అందించింది.
దీంతో పాటు వాహనం వెనుక భాగం కూడా కొద్దిగా తక్కువగా ఉండడంతో వికలాంగులు వీల్ చైర్ తోసుకుని వాహనంలోకి ఎక్కుందుకు అవకాశం ఉంటుంది. వాహనంలోకి వీల్‌చైర్‌ను సెట్ చేయడానికి ఎటువంటి సహాయం అవసరం లేదు. ఒకసారి లోపలికి వెళ్తే సెట్ అయిపోతుంది. ఈ వాహనంలో ప్రత్యేక హ్యాండిల్ బార్, లైట్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి. దీన్ని స్కూటర్ లాగా నడపవచ్చు.
దీనితో పాటు ఈ వాహనాన్ని సురక్షితంగా ఆపడానికి డిస్క్ బ్రేక్ కూడా అందించారు. అంతే కాదు ప్రత్యేకమైన హ్యాండ్ బ్రేక్ సిస్టమ్ కూడా ఉంది. వికలాంగులు ఈ వాహనంలో సురక్షితంగా ప్రయాణించవచ్చని తయారీదారులు చెబుతున్నారు. దీనిని ద్విచక్ర వాహనం లేదా ఆటో నడపడం అంత సులభంగా ఉంటుంది.
మన చుట్టుపక్కల చూస్తే ఎందరో వికలాంగులు మూడు చక్రాల వాహనాలు నడుపుతూ కనిపిస్తారు. వాటిలో చాలా వరకు మోడిఫైడ్ ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. యాలీ మొబిలిటీ ద్వారా తయారు చేసిన వాహనంలో వ్యక్తిని వీల్‌చైర్‌లోనే కూర్చోబెట్టి నడపవచ్చు. ఇది వికలాంగులకు ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ ఎలక్ట్రిక్ వాహనం బ్యాటరీ, రేంజ్ ఇతర వివరాలు బయటకు రావాల్సి ఉంది. ఈ వాహనం ఫుల్ ఛార్జింగ్ తో 130 కి.మీ కంటే ఎక్కువ ప్రయాణించగలదని చాలామంది అనుకుంటున్నారు. దీని గరిష్ట వేగం గంటకు 60 కిలో మీటర్ల కంటే తక్కువ.