షియోమీ తన ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ, చైనాలో సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేసింది. దాని పేరు Xiaomi YU7. ప్రారంభ ఎక్స్‌షోరూం ధర 253,000 యువాన్లు (సుమారు రూ. 30.26 లక్షలు). తమ మొదటి ఈవీ, ఎస్‌యూ7 సెడాన్ విజయవంతం అయిన తర్వాత, ఆటోమోటివ్ రంగంలో షియోమీ చేపట్టిన రెండో ప్రయత్నం ఈ వైయూ7. ఇది అత్యాధునిక సాంకేతికత, అద్భుతమైన పర్ఫార్మెన్స్, కస్టమైజేషన్ ఆప్షన్స్‌తో వస్తుంది. హైలైట్ విషయం ఏంటంటే.. బుకింగ్స్ ఓపెన చేసి వెంటనే ఈ ఎలక్ట్రిక్ కారుకు విపరీతమైన డిమాండ్ కనిపించింది.
మార్కెట్ నుంచి బలమైన డిమాండ్‌ను చూపిస్తూ, లాంచ్ అయిన మొదటి 18 గంటల్లోనే వైయూ7కి 240,000కు పైగా ప్రీ-ఆర్డర్‌లు వచ్చాయని షియోమీ ధృవీకరించింది. ఇది చైనా ఈవీ విభాగంలో షియోమీ బ్రాండ్ పెరుగుతున్న ఉనికిని బలపరుస్తుంది. వైయూ7 ధర పరంగా కూడా ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్రాంతంలో టెస్లా మోడల్ వై కంటే దాదాపు 4 శాతం తక్కువ ధరకు లభిస్తుంది!
షియోమీ వైయూ7 ని మూడు వేరియంట్లలో అందిస్తోంది: స్టాండర్డ్ (ఆర్డబ్ల్యూడీ), ప్రో (ఏడబ్ల్యూడీ), మ్యాక్స్ (పర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్‌లతో ఏడబ్ల్యూడీ). టాప్-స్పెక్ మ్యాక్స్ వేరియంట్‌కు షియోమీ హైపర్‌ఇంజిన్ V6s ప్లస్ శక్తిని అందిస్తుంది. ఇది సిలికాన్ కార్బైడ్ ఆధారిత పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉంది. 690 బీహెచ్‌పీ పవర్‌ని, 253 కి.మీ/గం గరిష్ట వేగాన్ని అందిస్తుంది.
బేస్ స్టాండర్డ్ వెర్షన్ 315 బీహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 835 కి.మీ వరకు ఆకట్టుకునే రేంజ్‌ను అందిస్తుంది. ప్రో వేరియంట్ 489 బీహెచ్‌పీ పవర్‌ని జనరేట్ చేస్తుంది. 770 కి.మీ వరకు రేంజ్‌ను అందిస్తుంది. మ్యాక్స్ వేరియంట్‌లో కేవలం 2.98 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ/గం వేగాన్ని చేరుకుంటుంది. అన్ని వేరియంట్లు అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయి. బ్యాటరీ కేవలం 12 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతానికి ఛార్జ్ అవుతుంది లేదా 15 నిమిషాల్లో 620 కి.మీ రేంజ్ పొందవచ్చు.
తక్కువ ఎత్తులో ఉండే పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా రూపొందించిన వైయూ7.. వైడ్‌బాడీ స్టాన్స్, మస్కులర్ రేర్ బ్యాక్‌ని కలిగి ఉంది. కొనుగోలుదారులు బసాల్ట్ గ్రే, ఎమరాల్డ్ గ్రీన్, డస్క్ పర్పుల్, డాన్ పింక్ సహా తొమ్మిది రకాల ఎక్స్‌టీరియర్ కలర్స్ నుంచి ఎంచుకోవచ్చు.
వీల్ ఆప్షన్లలో 19-ఇంచ్ లాంగ్-రేంజ్ అల్లాయ్స్ నుంచి 21-ఇంచ్ పర్ఫార్మెన్స్ వీల్స్ వరకు ఉన్నాయి. 21-ఇంచ్ ఆప్షన్లలో 750 కి.మీ రేంజ్ కోసం మిచెలిన్ ప్రైమసీ 5 ఎనర్జీ టైర్లతో కూడిన ఫాంటమ్ వీల్స్, 670 కి.మీ రేంజ్ అందించే మిచెలిన్ పైలట్ స్పోర్ట్ టైర్లతో కూడిన రెండు స్పోర్టీ ఫోర్జ్డ్ డిజైన్‌లు (ఫ్లోరల్- పెటల్) ఉన్నాయి. ఫ్లోటింగ్ షియోమీ లోగో సెంటర్ క్యాప్స్, రంగుల ఫోర్-పిస్టన్ బ్రెంబో కాలిపర్‌లు (ఎరుపు లేదా పసుపు రంగులలో) ప్రీమియం, కస్టమ్ లుక్‌ను అందిస్తాయి.
వైయూ7 ఎలక్ట్రిక్ ఎస్యూవీ క్యాబిన్ లోపల, పైన్ గ్రే, కోరల్ ఆరెంజ్, ఐరిస్ పర్పుల్ వంటి అనేక డ్యూయల్-టోన్ అప్‌హోలిస్టరీ ఎంపికలు ఉన్నాయి. ముందు సీట్లలో 10-పాయింట్ మసాజ్ ఫంక్షన్, జీరో-గ్రావిటీ రికైన్ ఉండగా, వెనుక సీట్లు 135 డిగ్రీల వరకు రికైన్ అవుతాయి.
ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో అనేక హైటెక్ ఫీచర్లు ఉన్నాయి. వాటిలో 16.1-ఇంచ్ సెంటర్ టచ్‌స్క్రీన్, స్మార్ట్-డిమ్మింగ్ పనోరమిక్ సన్‌రూఫ్, హైపర్‌విజన్ మినీ ఎల్‌ఈడీ పనోరమిక్ డిస్‌ప్లే, మైక్-రహిత కరవోకే సిస్టమ్ ఉన్నాయి. ఇది XiaoAI వాయిస్ అసిస్టెంట్‌కు కూడా మద్దతు ఇస్తుంది, ఎలక్ట్రానిక్ ఉపకరణాల కోసం ఇంటిగ్రేటెడ్ 27వాట్ పవర్ అవుట్‌లెట్‌తో వస్తుంది.
షియోమీ వైయూ7కి ప్రత్యేకమైన ఫీచర్లు.. ఐఆర్వీఎంలో ఇంటిగ్రేటెడ్ 4K జింబల్ కెమెరా, ఏఐ స్పేషియల్ సెన్సార్. వెనుక ప్రయాణికులు షియోమీ ప్యాడ్ 7S ప్రోను కూడా మౌంట్ చేయవచ్చు, అలాగే రూఫ్ రైల్స్ 100వాట్ పవర్ అవుట్‌పుట్, డ్యూయల్ యూఎస్బీ-సీ పోర్ట్‌లు, ప్రొజెక్టర్ కనెక్టివిటీని అందిస్తాయి. 25-స్పీకర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, 4.6-లీటర్ ఆన్‌బోర్డ్ ఫ్రిడ్జ్ విలాసవంతమైన ఫీచర్ల జాబితాను పూర్తి చేస్తాయి.
యాపిల్ వినియోగదారులు కూడా ప్రత్యేక కనెక్టెడ్ కార్ ఫీచర్ల నుంచి ప్రయోజనం పొందుతారు. ఐఫోన్ యాక్షన్ బటన్‌ను లాక్/అన్‌లాక్ ఫంక్షన్‌ల కోసం, కంట్రోల్ సెంటర్ ద్వారా షార్ట్‌కట్ ఇంటిగ్రేషన్ కోసం కాన్ఫిగర్ చేయవచ్చు. షియోమీ ఈవీ యాప్ "అలైవ్ స్టేటస్" ఇంటర్‌ఫేస్ ద్వారా రియల్ టైమ్ అప్‌డేట్‌లను అందిస్తుంది.
సంబంధిత కథనం