Xiaomi SU7 Electric Car : షియోమీ ఎలక్ట్రిక్ కారు కొత్త రికార్డ్.. కేవలం 230 రోజుల్లోనే..
Xiaomi SU7 Electric Car : షియోమీ ఎలక్ట్రిక్ కారు కొత్త రికార్డ్ సృష్టించింది. తక్కువ కాలంలో ఎక్కువ అమ్మకాలు చేసింది. దీంతో ఈ కారుకు జనాల్లో ఉన్న క్రేజ్ ఏంటో అర్థమవుతోంది.
షియోమీ ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రముఖ చైనీస్ బ్రాండ్. షియోమీ బ్రాండ్ తక్కువ ధరలకు స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించడం ద్వారా భారతదేశంలో కూడా ఫేమస్. కొన్ని నెలల క్రితం కంపెనీ స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేయడమే కాకుండా.. భారీ సామర్థ్యంతో ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి కూడా ప్రవేశించింది. ఇప్పుడు షియోమీ మొదటి కారు షియోమీ ఎస్‌యూ7 ఎలక్ట్రిక్ కారు కొత్త మైలురాయిని సాధించింది.
గ్లోబల్ మార్కెట్‌లో షియోమీ విక్రయించే ఏకైక ఎలక్ట్రిక్ వాహనం ఎస్‌యూ7. ఇది ఎలక్ట్రిక్ సెడాన్. గతేడాది విడుదల చేసిన ఈ కారు 230 రోజుల్లో లక్ష యూనిట్ల మార్కును దాటింది. అంతేకాదు ప్రారంభించిన తర్వాత కేవలం 27 నిమిషాల్లో 50,000 ఆర్డర్‌లను పొందడం ద్వారా మంచి విజయాన్ని సాధించింది.
షియోమీ 2024 ప్రారంభంలో 60,000 ఎలక్ట్రిక్ సెడాన్ యూనిట్లను ఉత్పత్తి చేయాలని ప్లాన్ చేసింది. కానీ ఎస్‌యూ7 ఈవీకి డిమాండ్ కారణంగా ఉత్పత్తిని పెంచారు. క్యాలెండర్ ఇయర్ చివరి నాటికి ఉత్పత్తి 1,20,000 యూనిట్లను దాటుతుందని అంచనా. ఈ నెలాఖరు నాటికి లక్ష యూనిట్ల డెలివరీ మార్కును దాటే అవకాశం ఉంది.
షియోమీ ఎస్‌యూ7 ఎలక్ట్రిక్ సెడాన్ ధర 2,15,900 యువాన్ల నుండి ప్రారంభమవుతుంది. భారతీయ రూపాయల్లోకి మార్చినప్పుడు దీని ధర సుమారు రూ. 25.34 లక్షలు. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ తొమ్మిది కలర్ ఆప్షన్స్, మూడు వేరియంట్లలో విక్రయానికి అందుబాటులో ఉంది.
ఈ కొత్త ఎలక్ట్రిక్ సెడాన్ స్పోర్టినెస్, మంచి డిజైన్, కూపే లాంటి రూఫ్ లైన్‌తో మరింత ఆకర్శణియంగా ఉంటుంది. ఈ మోడల్ పెద్ద 56 అంగుళాల హెడ్-అప్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు 3కె టచ్‌స్క్రీన్‌తో కూడిన పెద్ద 16.1-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌తో వస్తుంది. పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 2 షియెమి పాడ్ 6ఎస్ ప్రో టాబ్లెట్‌లతో ఉంటుంది.
షియోమీ ఎస్‌యూ7 మ్యాక్స్ ఎలక్ట్రిక్ మోడల్ డ్యూయల్ మోటార్ సెటప్‌ను కలిగి ఉంటుంది. గరిష్టంగా 664బీహెచ్‌పీ శక్తిని, 838ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు 2.78 సెకన్లలో 0-100 కేఎంపీహెచ్ స్పీడ్ అందుకుంటుంది.
ఇది హెడ్ అప్ డిస్‌ప్లే, బ్యాక్ సీటు ప్రయాణికుల కోసం రెండు టచ్‌స్క్రీన్‌లను కూడా కలిగి ఉంది. 'HyperOS' ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. వైర్‌లెస్ ఛార్జింగ్‌తో కూడిన ఫోన్ హోల్డర్‌తో కూడా వస్తుంది. సేఫ్టీ కోసం దీనిలో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.