Xiaomi: ఈ నాలుగు మొబైళ్లకు వారెంటీని రెండేళ్ల పాటు పొడిగించనున్న షావోమీ!-xiaomi set to extend warranty of these five phones in india by two years ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Xiaomi: ఈ నాలుగు మొబైళ్లకు వారెంటీని రెండేళ్ల పాటు పొడిగించనున్న షావోమీ!

Xiaomi: ఈ నాలుగు మొబైళ్లకు వారెంటీని రెండేళ్ల పాటు పొడిగించనున్న షావోమీ!

Chatakonda Krishna Prakash HT Telugu
May 30, 2023 08:34 PM IST

Xiaomi: నాలుగు మొబైళ్ల వారెంటీని రెండేళ్ల పాటు పొడగించనుంది షావోమీ. ఈ మోడళ్లలో వివిధ సమస్యలు తలెత్తుతున్నట్టు కస్టమర్ల నుంచి ఫిర్యాదులు పెరగటంతో ఈ నిర్ణయానికి వచ్చింది.

Xiaomi: ఈ నాలుగు మొబైళ్లకు వారంటీని రెండేళ్ల పాటు పొడిగించనున్న షావోమీ! (Photo: Xiaomi)
Xiaomi: ఈ నాలుగు మొబైళ్లకు వారంటీని రెండేళ్ల పాటు పొడిగించనున్న షావోమీ! (Photo: Xiaomi)

Xiaomi: ప్రముఖ స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ షావోమీ ఓ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. నాలుగు మొబైళ్ల వారెంటీని రెండేళ్ల పాటు పొడిగించేందుకు ఈ కంపెనీ రెడీ అయిందన్న సమాచారం బయటికి వచ్చింది. ఈ విషయాన్ని డిస్కార్డ్ ఛానెల్ ద్వారా షావోమీ వెల్లడించింది. త్వరలో అధికారంగా ప్రకటించనుంది. రెడ్‍మీ నోట్ 10 ప్రో, రెడ్‍మీ నోట్ 10 ప్రో మ్యాక్స్, ఎంఐ 11 అల్ట్రా, పోకో ఎక్స్3 ప్రో మొబైళ్ల వారెంటీని రెండేళ్ల పాటు షావోమీ పొడగించనుంది. అంటే వీటికి ప్రస్తుతం సంవత్సరం వారెంటీ ఉండగా.. అది మూడేళ్లు అవుతుంది. ఈ ఫోన్‍లలో మదర్‌బోర్డు ఫెయిల్యూర్, కెమెరాలకు సంబంధించి చాలా ఫిర్యాదులు వస్తుండటంతో షావోమీ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. దీని వల్ల ఈ మొబైళ్లు వాడుతున్న వారికి ఉపశమనంగా ఉండనుంది. వివరాలివే..

గత రెండేళ్ల వ్యవధిలో రెడ్‍మీ నోట్ 10 ప్రో, రెడ్‍మీ నోట్ 10 ప్రో మ్యాక్స్, ఎం 11 అల్ట్రా, పోకో ఎక్స్3 ప్రో ఫోన్‍లను కొనుగోలు చేసిన వారికి ఈ అదనపు రెండు సంవత్సరాల వారెంటీ లభిస్తుంది. ఈ మొబైళ్లలో మదర్‌బోర్డు, కెమెరాలు సహా హార్డ్ వేర్ పరంగా ఏవైనా సమస్యలు ఉంటే షావోమీ ఉచితంగా సర్వీస్ అందిస్తుంది. అయితే, అన్ని రిపేర్లకు ఈ వారెంటీ వర్తిస్తుందా.. నిర్ధిష్టంగా కొన్నింటికే ఉంటుందా అన్నది షావోమీ వెల్లడించాల్సి ఉంది. ఈ వారెంటీ పొడగింపుపై కస్టమర్లు షావోమీ సర్వీస్ సెంటర్‌లో తెలుసుకోవచ్చు.

ఆ ఫోన్‍లలో సమస్య తలెత్తితే దగ్గర్లోని షావోమీ సర్వీస్ సెంటర్‌కు కస్టమర్లు వెళ్లవచ్చు. ఆ ఫోన్ ఇన్‍వాయిస్ (బిల్) తప్పకుండా ఉండాలి. ఇలా అయితే ఎలాంటి చార్జీలు లేకుండా షావోమీ రిపేర్ చేస్తుంది. అవసరమైతే రిప్లేస్ చేస్తుంది. అయితే, లిక్విడ్ డ్యామేజ్, రూటెడ్, ట్యాపరింగ్ చేస్తే ఈ మొబైళ్లకు వారెంటీ వర్తించదు.

రెడ్‍మీ నోట్ 10 ప్రో, రెడ్‍మీ నోట్ 10 ప్రో మ్యాక్స్.. మొబైళ్లలో చాలా మంది యూజర్లకు సిస్టమ్ యూఐ రెస్పాన్స్ లేకుండా పోవడం, ఫ్రంట్ కెమెరా మాల్‍ఫంక్షన్ సమస్యలు ఎక్కువగా తలెత్తున్నాయి. పోకో ఎక్స్3 ప్రో మొబైల్‍లో పవర్ ఆన్ సమస్యలు వస్తున్నాయి.

ఈ నాలుగు మొబైళ్లకు రెండేళ్ల వారెంటీ పొడిగింపుపై ఇప్పటికైతే ఇండియా డిస్కార్డ్ చానెల్‍లో షావోమీ ప్రకటించింది. అతిత్వరలోనే అధికారిక ప్రకటనను సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించే అవకాశం ఉంది. ఈ వారెంటీ పొడిగింపు గురించి ఈ ఫోన్లు ఉన్న వారు దగ్గర్లోని షావోమీ సర్వీస్ సెంటర్‌లో వివరాలను అడగవచ్చు.