WPI falls to single digit: 19 నెలల కనిష్టానికి ‘టోకు’ ద్రవ్యోల్భణం
WPI falls to single digit: దేశంలో హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్భణం 19 నెలల కనిష్టానికి తగ్గింది.
న్యూ ఢిల్లీ: ఆహారం, ఇంధనం, తయారీ వస్తువుల ధరలు తగ్గడంతో టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 19 నెలల కనిష్ట స్థాయి 8.39 శాతానికి దిగివచ్చింది.
ట్రెండింగ్ వార్తలు
వరుసగా ఐదో నెలలో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్భణం తగ్గుముఖం పట్టింది. అయితే సింగిల్ డిజిట్‌కు తగ్గడం మాత్రం ఒకటిన్నర సంవత్సరాల విరామం తర్వాత ఇదే తొలిసారి. ద్రవ్యోల్భణాన్ని అదుపులో పెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే పలుమార్లు వడ్డీ రేట్లు పెంచింది.
వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 7 శాతం దిగువకు తగ్గే అవకాశం ఉందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గత వారం అంచనా వేశారు. ద్రవ్య విధాన మార్పులో భాగంగా బెంచ్‌మార్క్ వడ్డీ రేట్లను నిర్ణయించడానికి ఆర్‌బీఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (రిటైల్) ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది.
‘అక్టోబరు ద్రవ్యోల్బణం తగ్గుదల ప్రధానంగా ఖనిజ నూనెలు, బేస్ మెటల్స్, ఫ్యాబ్రికేెటెడ్ మెటల్ ప్రొడక్ట్స్ ధరలు తగ్గడం వల్ల సంభవించింది..’ అని డబ్ల్యుపీఐ ద్రవ్యోల్బణం డేటాను విడుదల చేస్తూ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఏప్రిల్ 2021 నుండి సెప్టెంబరు 2022 వరకు 18 నెలల పాటు డబ్ల్యుపీఐ ద్రవ్యోల్బణం రెండంకెలలో ఉంది. అక్టోబర్ 2021లో ద్రవ్యోల్బణం 13.83 శాతంగా ఉంది. సెప్టెంబరు 2022లో అది 10.79 శాతానికి తగ్గింది.
అంతకుముందు డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం మార్చి 2021లో సింగిల్ డిజిట్‌లో 7.89 శాతంగా నమోదైంది. ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం 11.03 శాతం నుండి అక్టోబర్‌లో 8.33 శాతానికి తగ్గినట్లు డేటా చూపించింది.
కూరగాయలు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పండ్లు, గుడ్లు, మాంసం, చేపల ధరలు తగ్గుముఖం పట్టగా, వరి, గోధుమలు, పప్పుధాన్యాల ధరలు పెరిగాయి. ఉక్రెయిన్ ఎగుమతులకు సంబంధించిన అనిశ్చితి కారణంగా ప్రపంచవ్యాప్తంగా కూడా గోధుమ ధరలు పెరిగాయని బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక నోట్‌లో తెలిపింది.
‘తయారీ ద్రవ్యోల్బణం తగ్గుదలతో సెప్టెంబర్‌లో 7 శాతంగా ఉన్న కోర్ డబ్ల్యుపిఐ అక్టోబర్‌లో 4.7 శాతానికి తగ్గింది. గ్లోబల్ ధరల్లో నియంత్రణ కారణంగా, డబ్ల్యుపిఐ మరింత తగ్గుతుందని అంచనా వేస్తున్నాం..’ అని బీఓబీ తెలిపింది.
ఇంధనం, ఎనర్జీ ద్రవ్యోల్బణం 23.17 శాతానికి తగ్గింది. ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం అక్టోబరులో 8.33 శాతంగా ఉంది. అంతకు ముందు నెలలో 11.03 శాతంగా ఉంది. కూరగాయల ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 39.66 శాతం నుంచి అక్టోబరులో 17.61 శాతానికి చేరుకుంది.
వరుసగా మూడు త్రైమాసికాలుగా ఎగువ టాలరెన్స్ స్థాయి 6 శాతం కంటే ఎక్కువగా ఉన్న అధిక ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఆర్‌బీఐ మే నుండి సెప్టెంబర్ మధ్య వడ్డీ రేట్లను 190 బేసిస్ పాయింట్లు పెంచి 5.90 శాతానికి పెంచింది.
డిసెంబర్ సమావేశంలో రెపో రేటును 6.25 శాతానికి తీసుకురావడానికి ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ 35 బేసిస్ పాయింట్ల రేటు పెంపు ప్రకటిస్తుందని బార్ల్కేస్ అంచనా వేసింది.