Amazon warehouse: టార్గెట్ పూర్తి చేస్తేనే వాష్ రూమ్, వాటర్ బ్రేక్; అమేజాన్ వేర్ హౌజ్ లో కార్మికులకు నరకం-workers in amazon warehouse get no toilet water breaks till targets met report ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Amazon Warehouse: టార్గెట్ పూర్తి చేస్తేనే వాష్ రూమ్, వాటర్ బ్రేక్; అమేజాన్ వేర్ హౌజ్ లో కార్మికులకు నరకం

Amazon warehouse: టార్గెట్ పూర్తి చేస్తేనే వాష్ రూమ్, వాటర్ బ్రేక్; అమేజాన్ వేర్ హౌజ్ లో కార్మికులకు నరకం

HT Telugu Desk HT Telugu
Jun 14, 2024 08:26 PM IST

అమేజాన్ వేర్ హౌజ్ లో ఉద్యోగులు అనుభవిస్తున్న నరకం గురించి తాజాగా ఒక వార్త వెలుగులోకి వచ్చింది. అమేజాన్ వేర్ హౌజ్ లో ప్యాకేజీలను అన్ లోడ్ చేసే టార్గెట్ పూర్తయ్యే వరకు వాష్ రూమ్ కు వెళ్లబోమని, వాటర్ బ్రేక్ తీసుకోబోమని ప్రతిజ్ఞలు చేయాలని మేనేజ్మెంట్ ఆదేశించిందని కార్మికులు ఆరోపించారు.

అమేజాన్ వేర్ హౌజ్ ల్లో కార్మికుల కష్టాలు
అమేజాన్ వేర్ హౌజ్ ల్లో కార్మికుల కష్టాలు

హర్యానాలోని మనేసర్లో ఉన్న అమెజాన్ ఇండియా ఐదు వేర్ హౌజ్ ల్లో దారుణ పరిస్థితి నెలకొని ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కార్మికులు వారానికి ఐదు రోజులు, రోజుకు పది గంటలు పనిచేస్తే వారికి లభించేది నెలకు రూ .10,088 అని అక్కడ పని చేస్తున్న ఒక 24 ఏళ్ల యువకుడు చెప్పారు. సాధారణంగా మధ్యాహ్న భోజన విరామం 30 నిమిషాలు, టీ విరామాలు 30 నిమిషాలు ఉంటాయి. అయితే, ఆ విరామాలు కూడా తీసుకోకుండా పని చేసినా రోజుకు నాలుగు ట్రక్కులకు మించి అన్ లోడ్ చేయలేమని ఆ యువకుడు తెలిపారు. షిఫ్టు సమయాల్లో కార్మికులు సమయాన్ని వృథా చేస్తున్నారా? అని తనిఖీ చేయడానికి సీనియర్లు వాష్ రూమ్ లను తనిఖీ చేస్తారని విమర్శించాడు.

కార్మికులతో ప్రతిజ్ఞ

ఈ నేపథ్యంలో, కార్మికుల నుంచి మరింత పనిని రాబట్టడం కోసం వారితో ఒక ప్రతిజ్ఞ చేయించారని ఆ యువకుడు చెప్పాడు. ‘‘అమేజాన్ వేర్ హౌజ్ లో అన్ లోడ్ లక్ష్యాన్ని చేరుకునే వరకు వాష్ రూమ్ కు వెళ్లబోమని, వాటర్ బ్రేక్ కూడా తీసుకోబోమని కార్మికులతో ప్రతిజ్ఞ చేయించారు’’ అని ఆ యువకుడు వెల్లడించాడు. అన్ లోడింగ్ ప్యాకేజీల లక్ష్యం పూర్తయ్యే వరకు మరుగుదొడ్లు, నీటి విరామాలు తీసుకోబోమని ప్రమాణం చేయాలని తమను ఆదేశించారని ఆరోపించాడు.

మహిళల కష్టాలు మరీ ఘోరం

అమేజాన్ (amazon) గోదాముల్లో పనిచేస్తున్న ఒక మహిళ మాట్లాడుతూ, "మాకు అనారోగ్యంగా ఉంటే, వాష్ రూమ్ లేదా లాకర్ రూమ్ కు వెళ్లడం ఒక్కటే మార్గం. బెడ్ ఉన్న సిక్ రూమ్ ఉంది, కానీ అక్కడ 10 నిమిషాలకు మించి ఉండనివ్వరు. 10 నిమిషాల తర్వాత వెళ్ళిపోమని అడుగుతారు. నేను రోజుకు తొమ్మిది గంటలు నిలబడతాను. ప్రతి గంటకు 60 చిన్న ఉత్పత్తులు లేదా 40 మధ్య తరహా ఉత్పత్తులను అన్ లోడ్ లేదా ప్యాక్ చేయాల్సి ఉంటుంది’’ అని వివరించింది. దీనిపై అమెజాన్ ప్రతినిధి మాట్లాడుతూ, "మా అన్ని భవనాలలో హీట్ ఇండెక్స్ మానిటరింగ్ పరికరాలు ఉన్నాయి. మేము ఉష్ణోగ్రతలో మార్పులను నిరంతరం పర్యవేక్షిస్తాము. రెస్ట్ రూమ్ ఉపయోగించడానికి, వాటర్ బ్రేక్ కు ఉద్యోగులు విరామాలు తీసుకోవచ్చు’’ అన్నారు.

అమెజాన్ ఇండియా ప్రతినిధి స్పందన

ఈ ఆరోపణలపై అమెజాన్ ఇండియా ప్రతినిధి స్పందించారు. ఈ ఆరోపణలపై విచారణ జరుపుతున్నామన్నారు. తమ కంపెనీలో ఇలాంటి షరతులు ఏవీ ఎప్పుడూ ఉండవని స్పష్టం చేశారు. ఒకవేళ, మేనేజ్మెంట్ కు తెలియకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే, వాటిని వెంటనే నిలిపివేస్తామని చెప్పారు. ‘‘మా ఉద్యోగుల ఆరోగ్యం, వారి భద్రత మాకు చాలా ముఖ్యం. దీనిపై సంబంధిత మేనేజర్ కు తిరిగి శిక్షణ ఇచ్చేలా చూస్తాము. దర్యాప్తు కొనసాగిస్తాం’’ అని పేర్కొన్నారు.

ఇతర దేశాల్లో కూడా..

అమెజాన్ (amazon) ఇంతకు ముందు విదేశాలలో కూడా ఇలాంటి ఆరోపణలను ఎదుర్కొంది. అమెరికాలోని ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ 2022, 2023 లలో కంపెనీ వేర్ హౌజ్ ల్లో అసురక్షిత పని పరిస్థితులు ఉన్నాయని నివేదించింది. ట్రక్కులు బయట పార్క్ చేయడం వల్ల వేడిగా ఉన్నాయని, వస్తువులను అన్ లోడ్ చేసినప్పుడు త్వరగా అలసిపోతున్నామని కార్మికులు ఆరోపించారు.

Whats_app_banner