యూట్యూబ్ తన ప్రీమియం లైట్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ని భారతదేశంలో ప్రారంభించింది. ఇది బడ్జెట్ ధరలో యాడ్-ఫ్రీ కంటెంట్‌ని పొందాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్లాన్. ఈ యూట్యూబ్ ప్రీమియం లైట్ సబ్‌స్క్రిప్షన్ ధర నెలకు రూ. 89! మాత్రమే!
ప్రీమియం లైట్ ముఖ్యంగా గేమింగ్, బ్యూటీ, ఫ్యాషన్, వార్తలు వంటి కేటగిరీల్లోని చాలా వరకు వీడియోల నుంచి ప్రకటనలను తొలగిస్తుందని కంపెనీ తెలిపింది. అయితే ప్రామాణిక ప్రీమియం ప్లాన్ మాదిరిగా కాకుండా, లైట్ ప్లాన్‌లో బ్యాక్‌గ్రౌండ్ ప్లే, ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్‌లు లేదా యూట్యూబ్ మ్యూజిక్ యాక్సెస్ వంటి అదనపు ఫీచర్లు ఉండవు! అంతేకాకుండా వీక్షకులు షార్ట్‌లు, మ్యూజిక్‌కు సంబంధించిన కంటెంట్, సెర్చ్ ఫలితాలు లేదా బ్రౌజింగ్ పేజీల్లో ప్రకటనలను చూసే అవకాశం ఉంది.
యూట్యూబ్ ప్రీమియం లైట్ స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలతో పాటు అన్ని పరికరాలలో పనిచేస్తుంది. పెద్ద స్క్రీన్‌లపై లేదా చిన్న స్క్రీన్‌లపై ప్రకటనలు లేని వీక్షణ అనుభవాన్ని కోరుకునే వినియోగదారులకు ఇది సౌలభ్యాన్ని అందిస్తుంది.
భారతదేశంలో ఇప్పటికే ఉన్న యూట్యూబ్ సబ్‌స్క్రిప్షన్ ధరల కంటే లైట్ ప్లాన్ ధర గణనీయంగా తక్కువగా ఉంది:
ప్లాన్ రకం- ధర (నెలకు/సంవత్సరానికి)- ముఖ్య ఫీచర్లు..
ప్రీమియం లైట్- ₹89 నెలకు ప్రధానంగా యాడ్-ఫ్రీ వీక్షణ
స్టూడెంట్ ప్లాన్- రూ.89 నెలకు పూర్తి ప్రీమియం ఫీచర్లు
వ్యక్తిగత ప్లాన్- రూ. 149 నెలకు పూర్తి ప్రీమియం ఫీచర్లు
యాన్యువల్ ప్లాన్- రూ. 1,490 సంవత్సరానికి పూర్తి ప్రీమియం ఫీచర్లు
ఈ ప్లాన్ మొదట మార్చి 2025లో యునైటెడ్ స్టేట్స్‌లో 7.99 డాలర్ల (సుమారు రూ. 709) చొప్పున ప్రారంభమైంది. దీనితో పోలిస్తే, భారతదేశంలో ప్రారంభించిన ధర చాలా తక్కువగా ఉంది! ఈ లాంచ్‌తో యూట్యూబ్ ప్రధానంగా తక్కువ ధరకే యాడ్-ఫ్రీ వీక్షణను కోరుకునే ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుంది.
ఇదిలా ఉండగా, యూట్యూబ్ మ్యూజిక్ తదుపరి ప్రయోగశాలగా మారబోతోంది! వినియోగదారులు పాటలు వింటున్నప్పుడు కనిపించేలా రూపొందించిన ఏఐ హోస్ట్‌లు అనే కొత్త ఫీచర్‌ను కంపెనీ ప్రస్తుతం ట్రయల్ చేస్తోంది.
ఈ ప్రకటన గత వారం యూట్యూబ్ ల్యాబ్స్ అనే కొత్త ఇనిషియేటివ్ ద్వారా బ్లాగ్ పోస్ట్‌లో వెలువడింది. ఈ కొత్త కార్యక్రమం ప్లాట్‌ఫారమ్‌పై ఏఐ ఆధారిత టూల్స్, అనుభవాలను ప్రయోగించడానికి ఉద్దేశించడం జరిగింది.
"యూట్యూబ్‌లో కృత్రిమ మేధస్సు (ఏఐ) సామర్థ్యాన్ని అన్వేషించడానికి యూట్యూబ్ ల్యాబ్స్ ఒక కొత్త కార్యక్రమం," అని యూట్యూబ్ ల్యాబ్స్ వైస్ ప్రెసిడెంట్ అపర్ణా పప్పు ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఈ కాన్సెప్ట్ ఇప్పటికే ఉన్న గూగుల్ ల్యాబ్స్ ప్రోగ్రామ్‌ను పోలి ఉంటుంది. దీనిలో కొత్త ఏఐ ఫీచర్‌లను ఎంపిక చేసిన వినియోగదారుల మధ్య పైలట్ చేసి, వాటి ఫీడ్‌బ్యాక్ ఆధారంగా వాటిని మెరుగుపరిచిన తర్వాతే పెద్ద ఎత్తున విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది.
సంబంధిత కథనం