Wipro Q3 Results: క్యూ3 లో విప్రో నికర లాభం 24.5 శాతం వృద్ధి; డివిడెండ్ ఎంతంటే..?
Wipro Q3 Results: ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఫలితాలను ఐటీ దిగ్గజం విప్రో శుక్రవారం ప్రకటించింది. ఈ క్యూ 3 లో విప్రో లిమిటెడ్ కన్సాలిడేటెడ్ నికర లాభం 24.5 శాతం పెరిగి రూ.3,353.8 కోట్లకు చేరుకుంది. ఆదాయం స్వల్పంగా పెరిగి రూ.22,319 కోట్లకు చేరింది.
Wipro Q3 Results: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) సేవల దిగ్గజం విప్రో లిమిటెడ్ డిసెంబర్ తో ముగిసిన ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (Q3FY25) ఫలితాలను ప్రకటించింది. ఈ క్యూ 3 లో సంస్థ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 24.5 శాతం పెరిగి రూ.3,353.8 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో విప్రో కంపెనీ రూ.2,694.2 కోట్ల లాభాన్ని ఆర్జించింది. సీక్వెన్షియల్ గా కన్సాలిడేటెడ్ నికర లాభం 4.5 శాతం పెరిగింది. కాగా, శుక్రవారం బీఎస్ఈలో విప్రో షేరు 2.17 శాతం నష్టంతో రూ.281.80 వద్ద ముగిసింది.
ఆదాయంలో స్వల్ప వృద్ధి
డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో (Q3FY25) ఐటీ కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.22,319 కోట్లుగా నమోదైంది. గత సంవత్సరం క్యూ 3 లో కంపెనీ ఆదాయం రూ.22,205 కోట్లుగా నమోదైంది. అలాగే, ఈ ఆర్థిక సంవత్సరం క్యూ 2 లో విప్రో లిమిటెడ్ రూ. 22,302 కోట్ల ఆదాయం సముపార్జించింది.
డివిడెండ్
క్యూ3 ఆర్థిక ఫలితాలతో పాటు శుక్రవారం అర్హులైన ఈక్విటీ షేర్ హోల్డర్లకు డివిడెండ్ ను కూడా విప్రో ప్రకటించింది. ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.6 మధ్యంతర డివిడెండ్ ను ప్రకటిస్తూ రెగ్యులేటరీ ఫైలింగ్ ను విప్రో దాఖలు చేసింది. కంపెనీ షేర్ హోల్డర్లు తమ వద్ద ఉన్న రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.6 మధ్యంతర డివిడెండ్ అందుకోనున్నారు. కాగా, ఈ డివిడెండ్ (dividends) చెల్లింపునకు రికార్డు తేదీని 2025 జనవరి 28 గా నిర్ణయించారు.