WhatsApp news: మెటా యాజమాన్యంలోని వాట్సాప్ భారత్ లో తమ సేవలను నిలిపేయనుందా?.. భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ఐటీ నిబంధనలకు వ్యతిరేకంగా వాట్సాప్ ఆ నిర్ణయం తీసుకుందా?.. ఈ అంశానికి సంబంధించి పార్లమెంట్ లో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
దేశంలో తమ సేవలను నిలిపివేసే యోచన గురించి వాట్సాప్ (whatsapp) గానీ, దాని మాతృసంస్థ మెటా (meta) కానీ భారత ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఐటీ రూల్స్ లో భాగంగా వినియోగదారుల వివరాలను ప్రభుత్వంతో పంచుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాల కారణంగా వాట్సాప్ భారతదేశంలో కార్యకలాపాలను నిలిపివేయాలని యోచిస్తోందా? అని కాంగ్రెస్ సభ్యుడు వివేక్ టంఖా అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
ఎన్ క్రిప్షన్ ను ఉల్లంఘించడం వల్ల యూజర్ల ప్రైవసీ దెబ్బతింటుందని, వాట్సాప్ పై వారి నమ్మకం దెబ్బతింటుందని, లక్షలాది మెసేజ్ లను ఎక్కువ కాలం నిల్వ చేయాల్సి వస్తుందని వాట్సాప్ తరఫు న్యాయవాది తేజస్ కరియా కోర్టుకు తెలిపారు. సవరించిన ఐటీ రూల్స్ ప్రైవసీ హక్కును ఉల్లంఘిస్తున్నాయని వాట్సాప్, మెటా సంస్థలు పలుమార్లు ఆరోపించాయి.
భారత సార్వభౌమత్వం, సమగ్రత, రక్షణ, భద్రత, ప్రజాభద్రతలను పరిరక్షించడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000లోని సెక్షన్ 69ఏ కింద ప్రభుత్వం అవసరమైన సమయంలో ఆదేశాలు జారీ చేస్తుందని అశ్విని వైష్ణవ్ పార్లమెంటుకు ఇచ్చిన సమాధానంలో వివరించారు. భారత్ లో సేవలను నిలిపివేయడం గురించి వాట్సాప్ లేదా మెటా ఎటువంటి ప్రణాళికలను ప్రభుత్వానికి తెలియజేయలేదని అశ్విని వైష్ణవ్ తెలిపారు. వాట్సాప్ భారతదేశాన్ని విడిచిపెట్టడం కంపెనీపై, ఆ కంపెనీకి 400 మిలియన్లకు పైగా ఉన్న వినియోగదారుల బేస్ పై గణనీయంగా ప్రభావం పడుతుంది.