Gold Rate In 2025 : 2025లో బంగారం, వెండి ధరలు తగ్గుతాయా? రికార్డు స్థాయికి చేరుకుంటాయా?
Gold Rate 2025 : కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం. చాలా మందికి బంగారం, వెండి ధరలు రేట్లు పెరుగుతాయా? తగ్గుతాయా? అనే అనుమానాలు ఉన్నాయి. అయితే కొత్త ఏడాదిలోనూ బంగారం రికార్డు ధర వైపు దూసుకెళ్లవచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు.
కొత్త ఏడాదిలో బంగారం, వెండి కొనుక్కోవాలనుకునేవారు మెుదటగా చూసేది వాటి ధరలు. 2024లాగే 2025లోనూ బంగారం ధరలు రికార్డు స్థాయికి వెళ్తాయా అని చాలా మంది అనుకుంటున్నారు. అయితే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నందున కొత్త సంవత్సరంలో బంగారం తన రికార్డు ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. దేశీయ మార్కెట్లో 10 గ్రాములకు రూ .85,000 నుండి రూ .90,000 వరకు పెరగవచ్చు. కానీ భౌగోళిక రాజకీయ సంక్షోభం తగ్గితే, రూపాయి పతనంతో బంగారం ధరలు పడిపోవచ్చు.
ప్రస్తుతం స్పాట్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.79,350 ఉండగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్)లో ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో 10 గ్రాములకు రూ.76,600 ఉంది. బంగారం ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. దేశీయ మార్కెట్లలో 23 శాతం రాబడులను నమోదు చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 30న 10 గ్రాముల బంగారం ధర రూ.82,400 వద్ద ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు, ప్రధాన సెంట్రల్ బ్యాంక్‌లు తక్కువ వడ్డీ రేట్ల వైపు దృష్టి సారించడం వల్ల 2025లో విలువైన లోహాలు బలమైన పనితీరును కనబరుస్తాయని నిపుణులు భావిస్తున్నారు. రికార్డు స్థాయి పనితీరు 2025లోనూ కొనసాగవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎల్కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్(కమోడిటీస్ అండ్ కరెన్సీ) జతిన్ త్రివేది మాట్లాడుతూ..'2025లో బంగారం ధర పెరిగే అవకాశం ఉంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగితే లేదా తీవ్రరూపం దాల్చినట్లయితే దేశీయ బంగారం ధరలు రూ.85,000కి చేరుకోవచ్చని అంచనా. కొన్ని సందర్భాల్లో రూ.90,000కు వెళ్లవచ్చు. కేజీ వెండి ధర రూ.1.1 లక్షల నుంచి రూ. 1.25 లక్షలకు చేరుకుంటుంది.' అని జతిన్ అన్నారు.
2024లో బంగారం డిమాండ్, సరఫరా వేగంతో కూడా ధరలను ప్రభావితం చేసింది. వీటిలో భౌగోళిక రాజకీయ పరిస్థితి కూడా ఉంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు బులియన్‌కు డిమాండ్‌ను పెంచాయి. దీంతో ఈ ఏడాది దాని ధరలపై ప్రభావం పడింది.
మరోవైపు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సుంకాలు, ఆర్థిక విధానాలు, ద్రవ్యోల్బణాన్ని 2 శాతానికి తగ్గించాలన్న ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం బంగారం ధరలపై ప్రభావాన్ని మార్కెట్ వర్గాలు బేరీజు వేస్తున్నాయి.