ప్రస్తుతం టమాటా ధరలు మండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వందపైనే పలుకుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగానే రేట్లు ఉన్నాయి. ఉల్లి ధరలు కూడా గతంలో కంటే ఎక్కువే ఉన్నాయి. రెండేళ్లలో ఈ మార్పు ఎక్కువగా కనిపించింది. అయితే బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వే ధరలు పెరగడానికి గల కారణాలను వెల్లడించింది. ఉల్లి, టమాటా ధరలు రెండేళ్లలో ఎందుకు పెరిగాయో తెలిపింది.
విపరీతమైన వాతావరణం, తక్కువ రిజర్వాయర్ స్థాయిలు, పంట నష్టం వ్యవసాయ ఉత్పత్తిని ప్రభావితం చేసిందని, గత రెండేళ్లలో ఆహార ధరలు పెరగడానికి దారితీసిందని ఆర్థిక సర్వే తెలిపింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూరగాయలు, పప్పుధాన్యాల ఉత్పత్తి అవకాశాలపై ప్రభావం చూపాయని తెలిపింది. దీనితో డిమాండ్ ఎక్కువై.. సరఫరా తగ్గింది. ఈ కారణంగా వాటి ధరలు పెరిగాయి.
2023, 2024 ఆర్థిక సంవత్సరాల్లో వ్యవసాయ రంగం తీవ్రమైన వాతావరణ సంఘటనలు, తక్కువ రిజర్వాయర్ స్థాయిలు, దెబ్బతిన్న పంటల వల్ల ప్రభావితమైంది. ఇది వ్యవసాయ ఉత్పత్తి, ఆహార ధరలను ప్రతికూలంగా ప్రభావితం చేసింది. వినియోగదారుల ఆహార ధరల సూచీ (సీఎఫ్పీఐ) ఆధారిత ఆహార ద్రవ్యోల్బణం 2022 ఆర్థిక సంవత్సరంలో 3.8 శాతం నుంచి 2023 ఆర్థిక సంవత్సరంలో 6.6 శాతానికి, 2024 ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతానికి పెరిగింది.
గత రెండేళ్లుగా ఆహార ద్రవ్యోల్బణం ప్రపంచ దృగ్విషయంగా మారిందని, వాతావరణ మార్పులకు ఆహార ధరల పెరుగుదలను పరిశోధనలు సూచిస్తున్నాయని ఆర్థిక సర్వే తెలిపింది. సీజనల్ మార్పులు, ప్రాంతాల వారీగా వచ్చే పంటల వ్యాధులు, రుతుపవనాలు ముందుగానే రావడం, భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో లాజిస్టిక్ అంతరాయాల కారణంగా 2023 జులైలో టమోటా ధరలు పెరిగాయి.
కోతల సీజన్లో కురిసిన వర్షాలు, నాట్లు వేయడంలో జాప్యం, దీర్ఘకాలిక పొడి వాతావరణం, ఇతర దేశాలు తీసుకున్న వాణిజ్య సంబంధిత చర్యలే ఉల్లి ధరల పెరుగుదలకు కారణమని పేర్కొంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గత రెండేళ్లుగా ఉత్పత్తి తగ్గడం వల్ల పప్పు దినుసుల ధరలు, ముఖ్యంగా కందిపప్పు ధరలు పెరిగాయని సర్వే తెలిపింది. దక్షిణాది రాష్ట్రాల్లో వాతావరణ మార్పులతో పాటు రబీ సీజన్లో విత్తన పురోగతి మందగించడంతో కంది ఉత్పత్తిపై ప్రభావం పడింది.
ఇలా చాలా కారణాలతో గడిచిన రెండేళ్లలో ధరలు పెరిగాయి. ఇప్పటికీ టమాటా ధరలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ వీటి ధరలు ఎక్కువే ఉన్నాయి. చాలా కారణాలతో ఉల్లి, టమాటా ధరలు పెరిగినట్టుగా ఆర్థిక సర్వే చెప్పుకొచ్చింది.