అత్యవసర ఖర్చుల కోసం లేదా అదనపు ఖర్చుల కోసం పర్సనల్ లోన్ తీసుకోవడం సర్వసాధారణం. ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పుడు పర్సనల్ లోన్‌పై ఆధారపడటం చాలామందికి తెలిసిన విషయమే. కొన్నిసార్లు ఇంటి మరమ్మతుల కోసం లేదా ఇంకేదైనా అవసరం నిమిత్తం ప్రజలు వ్యక్తిగత రుణాలు తీసుకుంటారు.
అయితే, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల కోసం కూడా చాలామంది అప్పులు చేస్తుంటారు. ఇలా ప్రతి విషయానికి అప్పు చేస్తూ వెళితే ఎలా? ఎక్కడ ఆగుతాము? పైగా, ఇటీవలి కాలంలో ట్రావెలింగ్ కోసం కూడా పర్సనల్ లోన్ తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. కేవలం ట్రావెలింగ్ కోసం అప్పు చేయడం సరైనదేనా? "ఎప్పటికి కాదు" అని నిపుణులు సూచిస్తున్నారు. ప్రయాణం వంటి విచక్షణతో కూడిన (అంటే తప్పనిసరి కాని) ఖర్చుల కోసం పర్సనల్ లోన్ తీసుకోవడం అస్సలు మంచిది కాదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి గల కారణాలను ఇప్పుడు చూద్దాం..
I. అనవసర ఖర్చు: ప్రయాణం అనేది తప్పించుకోదగిన ఖర్చు. మీరు ఈ ప్రయాణాన్ని వదులుకుంటే ఎటువంటి సమస్య ఉండదు. డబ్బులు పోగు చేసుకుని, లేదా డబ్బులు వచ్చినప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. లోన్ రీపేమెంట్ భారం లేకుండా, ప్రశాంతంగా ట్రావెల్ చేస్తారు.
II. తప్పుడు సంప్రదాయం: ప్రయాణం వంటి విచక్షణతో కూడిన విషయాల కోసం పర్సనల్ లోన్ తీసుకుంటే, భవిష్యత్తులో మీరు తీసుకోవాలనుకునే ఇతర రుణాలకు ఇది తప్పుడు సంప్రదాయాన్ని నెలకొల్పుతుంది. కాబట్టి, ఈ అలవాటును ప్రారంభంలోనే నిరోధించాలి.
III. రుణాల ఊబిలోకి కూరుకుపోతారు: పర్సనల్ లోన్‌లు అన్‌సెక్యూర్డ్ లోన్‌లు కాబట్టి, వాటిపై వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాల కోసం పర్సనల్ లోన్‌లు తీసుకోవడం ద్వారా మీరు తెలియకుండానే అప్పుల ఊబిలో కూరుకుపోయే అవకాశం ఉంది.
IV. మీ ఆర్థిక ప్రణాళికను పాడుచేయవచ్చు: భవిష్యత్తు ఎప్పుడూ అనిశ్చితిగా ఉంటుంది! అవసరమైనప్పుడు మాత్రమే పర్సనల్ లోన్ లేదా ఏ ఇతర లోన్ అయినా తీసుకోవడం శ్రేయస్కరం. మీకు నిజంగా అత్యవసర పరిస్థితుల్లో లోన్ అవసరమైనప్పుడు, విహారయాత్ర వంటి అనవసరమైన వాటి కోసం మీరు ఇప్పటికే చాలా లోన్‌లు తీసుకున్నట్లయితే వాటిని తిరిగి చెల్లించే సామర్థ్యం మీకు ఉండకపోవచ్చు.
V. పొదుపును కాదు, సంతృప్తిని ఆలస్యం చేయండి: ప్రయాణం కోసం పర్సనల్ లోన్ తీసుకోవడం వల్ల మీ సేవింగ్స్ హాబిట్ ఆలస్యం అవుతుంది. నిపుణులు సూచించేది ఏమిటంటే, తక్షణ సంతృప్తిని ఆలస్యం చేయాలి కానీ పొదుపును కాదు. కాబట్టి, సెలవుల కోసం పర్సనల్ లోన్ తీసుకోవడం మానుకోవాలి.
అయితే, దీనికి కొన్ని మినహాయింపులు ఉండవచ్చు. వృత్తిపరమైన నైపుణ్యాల అభివృద్ధి, వైద్య చికిత్స కోసం చేసే ప్రయాణాలు లేదా తప్పనిసరి కాని పరిస్థితులలో చేపట్టే అత్యవసర ప్రయాణాలకు ఈ నియమాలు వర్తించకపోవచ్చు.
సంబంధిత కథనం