భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్; ఈ పతనానికి ప్రధాన కారణాలు-why is indian stock market falling today reasons explained ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్; ఈ పతనానికి ప్రధాన కారణాలు

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్; ఈ పతనానికి ప్రధాన కారణాలు

Sudarshan V HT Telugu

భారీ లాభాలతో దూసుకెళ్లిన మర్నాడే భారత స్టాక్ మార్కెట్ అదే స్థాయిలో పతనమయింది. మంగళవారం ఇంట్రాడేలో సెన్సెక్స్ 1291 పాయింట్లు లేదా 16 శాతం క్షీణించి 81,138.78 వద్దకు, నిఫ్టీ 349 పాయింట్లు లేదా 1.4 శాతం క్షీణించి 24,576 వద్దకు చేరాయి.

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్ (Agencies)

మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల మధ్య మే 13, మంగళవారం ఇంట్రాడే ట్రేడింగ్ లో భారత స్టాక్ మార్కెట్ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 చెరో 1 శాతానికి పైగా పతనమయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1291 పాయింట్లు లేదా 1.6 శాతం క్షీణించి 81,138.78 వద్ద, నిఫ్టీ 349 పాయింట్లు లేదా 1.4 శాతం క్షీణించి 24,576 వద్ద ముగిశాయి. మిడ్, స్మాల్ క్యాప్ సెగ్మెంట్లు మాత్రం ఈ సెషన్లో ఒక శాతం వరకు లాభపడటంతో సూచీలు నిలకడగా కొనసాగాయి.

భారత స్టాక్ మార్కెట్ ఈ రోజు ఎందుకు పతనమవుతోంది?

ఈ రోజు భారత స్టాక్ మార్కెట్ పతనం వెనుక ఈ క్రింది కారణాలు ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు:

1. టారిఫ్ భయాలు

ఉక్కు, అల్యూమినియంపై అమెరికా సుంకాల విషయంలో అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించాలనే ప్రతిపాదనతో భారత్ ప్రపంచ వాణిజ్య మండలి (WTO)ను ఆశ్రయించింది. అమెరికా, భారత్ మధ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ వాణిజ్య యుద్ధ ఆందోళనలు మాత్రం వెనక్కి తగ్గడం లేదన్న ఆందోళనలు మార్కెట్లో కొనసాగుతున్నాయి.

2. 4% ర్యాలీ తర్వాత ప్రాఫిట్ బుకింగ్

భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత భారత స్టాక్ మార్కెట్ బెంచ్మార్క్లు గత సెషన్లో దాదాపు 4 శాతం పెరిగాయి. దాంతో రిటైల్ ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గుచూపారు. ‘‘నిఫ్టీలో 916 పాయింట్ల పెరుగుదలకు సంస్థాగత కార్యకలాపాలు కారణం కాదని అర్థం చేసుకోవాలి. నిన్న ఎఫ్ఐఐ, డీఐఐ సంయుక్త కొనుగోళ్లు రూ.2,694 కోట్లు మాత్రమే. అంటే షార్ట్ కవరింగ్, హెచ్ఎన్ఐ ప్లస్ రిటైల్ కొనుగోళ్లతో మార్కెట్ ఊపందుకుంది. దీంతో రానున్న రోజుల్లో సంస్థాగత కార్యకలాపాలు మందగించే అవకాశం ఉంది. ఇది ర్యాలీ కొనసాగింపునకు ఆటంకం కలిగిస్తుంది’’ అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ అన్నారు.

3. అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం

అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందాలు భారత స్టాక్ మార్కెట్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని కొందరు నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందాలు కుదిరితే, ఆ రెండు దేశాల మధ్య టారిఫ్ వార్ ముగిసి, ద్వైపాక్షిణ వాణిజ్య బంధాలు పెరుగుతాయి. దాంతో, మరోసారి ఎఫ్ఐఐలు చైనా మార్కెట్ కు తరలే అవకాశం ఉంది.

4. ఇండో-పాక్ ఎపిసోడ్

భారత్-పాక్ మధ్య నెలకొన్న పరిస్థితులకు సంబంధించి మార్కెట్లో నెలకొన్న భయాందోళనలను కొందరు నిపుణులు ఎత్తిచూపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించి దుస్సాహసాలకు పాల్పడవద్దని పాకిస్థాన్ ను హెచ్చరించిన నేపథ్యంలో పాక్ వైపు నుంచి కూడా ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సోమవారం ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించిన కొద్దిసేపటికే సాంబాలో 10 నుంచి 12 డ్రోన్లను అడ్డుకోవడంతో ఈ ప్రాంతంతో పాటు జమ్మూలో వరుసగా నాలుగో రాత్రి బ్లాక్అవుట్ ఏర్పడింది. "నిన్న జాతినుద్దేశించి ప్రధాని మోదీ చేసిన ప్రసంగం తరువాత, పాకిస్తాన్ ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉందని మార్కెట్లో ఆందోళనలు పెరిగాయి" అని ఈక్వినామిక్స్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు మరియు పరిశోధన అధిపతి జి చొక్కలింగం అన్నారు.

సూచన: ఈ కథ కేవలం విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. పై అభిప్రాయాలు మరియు సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు లేదా బ్రోకింగ్ కంపెనీలవి, హెచ్ టీ తెలుగు వి కాదు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం