Stock market crash: ఈ రోజు స్టాక్ మార్కెట్ కుప్పకూలడానికి కారణాలేంటి..?
Stock market crash: ఐదు రోజుల ర్యాలీ తర్వాత సెన్సెక్స్, నిఫ్టీ బుధవారం భారీ పతనాన్ని చవి చూశాయి. ఈ రోజు సెన్సెక్స్ 1300 పాయింట్లకు పైగా పడిపోయింది.
Stock market crash: గత ఐదు సెషన్లలో స్టాక్ మార్కెట్ సూచీల్లో ర్యాలీ కొనసాగింది. ఒక దశలో బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు ఆల్ టైం గరిష్టాలకు చేరుకున్నాయి. సెన్సెక్స్ 73 వేల పాయింట్ల మార్క్ ను, నిఫ్టీ 22 వేల పాయింట్ల మార్క్ ను అధిగమించాయి. ఐదు రోజుల ర్యాలీ అనంతరం బుధవారం స్టాక్ మార్కెట్ భారీ పతనం దిశగా సాగుతోంది.
భారీ పతనం
ఐదు రోజుల ర్యాలీ తర్వాత బుధవారం బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ (Sensex) 1300 పాయింట్లకు పైగా పడిపోయింది. నిఫ్టీ 50 (Nifty 50) 22,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. దాంతో, భారత స్టాక్ మార్కెట్ (Stock market crash) బుధవారం భారీ పతనాన్ని చవిచూసింది. స్టాక్ మార్కెట్ ఈ వారం ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకిన కొద్ది రోజులకే ఇది జరగడం గమనార్హం. జనవరి 17న ప్రారంభ ట్రేడింగ్ సమయంలో 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 1,371.23 పాయింట్లు పడిపోయి 71,757.54 వద్ద, నిఫ్టీ 395.35 పాయింట్లు క్షీణించి 22,000 మార్కు దిగువన 21,636.95 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి.
బ్యాంకింగ్ నష్టాలు
బుధవారం స్టాక్ మార్కెట్ భారీగా క్షీణించడంతో ఎన్ఎస్ఈ నిఫ్టీలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్ సీ ఎల్ టెక్నాలజీస్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. కానీ, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ షేర్లు 7 శాతానికి పైగా పతనమయ్యాయి. అలాగే, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు కూడా నష్టపోయాయి. అయితే, బుధవారం స్టాక్ మార్కెట్ పతనానికి గత కారణాలను నిపుణులు విశ్లేషించారు. అవి..
హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ క్యూ3 ఫలితాలు
బుధవారం మార్కెట్ పతనానికి అతిపెద్ద కారణం హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ డిసెంబర్ త్రైమాసిక ఫలితం. ఇది ఒక్కటే సెన్సెక్స్ లో 700 పాయింట్ల క్షీణతకు కారణమైంది. హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ క్యూ3 ఫలితాలు వాటాదారులకు నిరాశపరిచాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ వంటి ఇతర బ్యాంకులు కూడా సెన్సెక్స్ పతనానికి కారణాలుగా నిలిచాయి.
రూపాయి విలువ పతనం
అమెరికా డాలర్ తో పోలిస్తే భారత రూపాయి బుధవారం 3 పైసలు క్షీణించి రూ.83.15 వద్ద ముగిసింది. ఇది భారత స్టాక్ మార్కెట్ పై స్వల్ప ప్రభావాన్ని చూపింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో అమెరికా డాలర్ బలపడటం, దేశీయ ఈక్విటీ మార్కెట్ల అస్థిరత ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు.
చైనా జీడీపీ ప్రభావం
డిసెంబర్ తో ముగిసే త్రైమాసికంలో చైనా జీడీపీ వృద్ధి రేటు మందగించింది. చైనా ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నిరుద్యోగ గణాంకాలు హాంకాంగ్, కొరియా, తైవాన్ మార్కెట్ల పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి. ఇది కూడా భారత మార్కెట్లపై ప్రభావం చూపింది. అంతర్జాతీయ, దేశీయ ప్రతికూల సంకేతాల ప్రభావంతో సమీపకాలంలో మార్కెట్ కాస్త బలహీనంగా మారే అవకాశం ఉంది. ఈ ఏడాది ఫెడ్ నుంచి ఆశించిన రేట్ ల కోతలు కార్యరూపం దాల్చకపోవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.