Mutual Funds and SIP : మ్యూచువల్ ఫండ్స్, సిప్‌లలో ఇన్వెస్ట్ చేయడానికి జనాలు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు?
Mutual Funds and SIP : మ్యూచువల్ ఫండ్స్, సిప్‌లు భారతదేశంలో కొన్నేళ్లుగా ఎక్కువ ప్రజాదరణ పొందుతున్నాయి ఎందుకంటే అవి పెట్టుబడిదారులు చిన్న పెట్టుబడులతో ప్రారంభించి దీర్ఘకాలికంగా మంచి రాబడిని పొందేందుకు అవకాశం కల్పిస్తాయి.

భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్, సిప్‌లలో చాలా మంది పెట్టుబడి పెడుతున్నారు. చిన్న పెట్టుబడిదారులలోనే కాకుండా పెద్ద పెట్టుబడిదారులలో కూడా ముఖ్యమైన పెట్టుబడి ఆప్షన్స్‌గా ఇవి మారాయి. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. సిప్ ద్వారా పెట్టుబడిదారులు చిన్న మొత్తంతో ప్రారంభించే అవకాశం పొందుతారు. ఇది దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇస్తుంది. సిప్‌లో మార్కెట్ పెరిగినా లేదా పడిపోయినా దీర్ఘకాలంలో మంచి రాబడి వస్తుందనే నమ్మకంతో ఉంటారు చాలా మంది.
మ్యూచువల్ ఫండ్స్
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. మ్యూచువల్ ఫండ్లు దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇవ్వగలవని పెట్టుబడిదారులు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, మొబైల్ యాప్‌ల ద్వారా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను మొబైల్ యాప్‌లు, వెబ్‌సైట్‌ల ద్వారా ట్రాక్ చేయవచ్చు. ఒకే క్లిక్‌తో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు.
గత కొన్ని సంవత్సరాలుగా మ్యూచువల్ ఫండ్స్ మంచి రాబడిని ఇచ్చాయి. ముఖ్యంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, బుల్లిష్ మార్కెట్ సమయంలో పెట్టుబడిదారులకు మంచి రాబడిని ఇచ్చాయి. దీని కారణంగా పెట్టుబడిదారుల విశ్వాసం మరింత పెరిగింది. ఈక్విటీ ఫండ్స్ సాధారణంగా 10 నుంచి 12 శాతం వరకు రాబడిని అందిస్తాయనే నమ్మకం చాలా మందికి ఉంటుంది. అయితే ఇది మార్కెట్‌ల హెచ్చుతగ్గుల మీద ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు ఎక్కువ రావొచ్చు, తక్కువ కూడా రావొచ్చు.
సిప్‌లు
పెట్టుబడిదారులు SIP(Systematic Investment Plan) ద్వారా కనీస మొత్తంతో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. రూ. 500 నుండి ప్రారంభించవచ్చు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనే ఆందోళన నుండి సిప్ కాపాడుతుంది. సిప్ అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇది దీర్ఘకాలంలో మీకు మంచి రాబడిని తెస్తుంది. మీ పెట్టుబడి మొత్తం పెరుగుతుంది. సిప్ ద్వారా మీరు మార్కెట్ హెచ్చుతగ్గులను నివారించవచ్చు. అంటే దీర్ఘకాలంలో మంచి రాబడిని పొందవచ్చు.
ELSS వంటి కొన్ని మ్యూచువల్ ఫండ్ల ద్వారా పెట్టుబడి పెట్టడం వల్ల పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. ఇది దీన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. ఎక్కువ మంది పెట్టుబడి ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటున్నారు. గతంలో పెద్ద పెట్టుబడిదారులు మాత్రమే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేవారు. కానీ ఇప్పుడు చిన్న పెట్టుబడిదారులు కూడా ఈ మార్గాన్ని అనుసరిస్తున్నారు.
ఇంటర్నెట్, సోషల్ మీడియా, వర్క్‌షాప్‌ల ద్వారా మ్యూచువల్ ఫండ్స్, సిప్‌ల గురించి సమాచారాన్ని పొందుతున్నారు. సిప్‌లలో సుమారు 15 శాతం వరకు రాబడి ఉంటుందని అంచనా వేసుకుంటారు. అయితే ఇది కూడా మార్కెట్‌ను బట్టి మారుతుంది. సిప్ అనేది కూడా మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసే పద్ధతే. అయితే నెలవారీగా కొంత మెుత్తాన్ని పెట్టుబడి పెట్టాలి. ఈ పెట్టుబడికి క్రమశిక్షణ ఉండటం ముఖ్యం. సిప్‌లో కూడా పెట్టుబడిని దీర్ఘకాలికంగా ఉంచితేనే మంచి రాబడులు వస్తాయి.
మార్కెట్ పడిపోతున్నప్పటికీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెరుగుతోంది. డిసెంబర్ 2024 గురించి చూసుకుంటే.. ఈ నెలలో సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి రూ.26,459.49కోట్లకు చేరుకుంది.
గమనిక : మ్యూచువల్ ఫండ్స్, సిప్ అనేది మార్కెట్ హెచ్చుతగ్గుల మీద ఆధారపడి మీ రాబడిని అందిస్తాయి. కొన్నిసార్లు ఎక్కువ రావొచ్చు, మరికొన్నిసార్లు తక్కువ రావొచ్చు. నిపుణుల సలహా తీసుకోండి.