Tata Group Next Gen : భవిష్యత్తులో టాటా గ్రూప్ అధికారం ఎవరిది? తర్వాతి తరం లీడర్స్ వీరేనా?-who will take over ratan tata seat in tata groups know next generation leaders ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Group Next Gen : భవిష్యత్తులో టాటా గ్రూప్ అధికారం ఎవరిది? తర్వాతి తరం లీడర్స్ వీరేనా?

Tata Group Next Gen : భవిష్యత్తులో టాటా గ్రూప్ అధికారం ఎవరిది? తర్వాతి తరం లీడర్స్ వీరేనా?

Anand Sai HT Telugu
Oct 10, 2024 08:50 AM IST

Tata Group Next Generation : టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా అనారోగ్య సమస్యలతో అక్టోబర్ 9న రాత్రి ముంబైలోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. అయితే టాటా గ్రూప్ భవిష్యత్తులో ఎవరి చేతులోకి వెళ్తుందని అందరికీ ఆసక్తిగా ఉంది.

రతన్ టాటా
రతన్ టాటా

రతన్ టాటా మరణం భారతీయ ప్రజల మనస్సులలో శూన్యతను సృష్టించిందనే చెప్పాలి. భారతదేశం గొప్ప వ్యక్తిని కోల్పోయింది. ఒక గొప్ప మనిషిగానూ రతన్ టాటా పేరు మరిచిపోలేనిది. సాధారణ వ్యాపారవేత్త కాదు ఆయన. టాటా గ్రూప్ దేశ అభివృద్ధి, ప్రజల అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించాయని చెప్పుకోవచ్చు. ఉప్పు నుంచి ఉక్కు వరకూ టాటా గ్రూప్ అనేక వ్యాపారాలు ఉన్నాయి. వ్యాపారానికి తగ్గట్టుగానే ఈ సంస్థకు సేవా గుణం కూడా అధికం. అయితే టాటా గ్రూప్ తర్వాతి అధికారం ఎవరికి వెళ్తుందనే చర్చ మాత్రం నడుస్తోంది.

yearly horoscope entry point

ప్రస్తుతం టాటా సన్స్ ఛైర్మన్‌గా చంద్రశేఖరన్ బాధ్యతలు చూస్తున్నారు. టాటా సన్స్ నిర్వహణ ప్రతిష్ఠాత్మకంగా సాగినప్పటికీ, టాటా గ్రూపుపై ఆధిపత్యం చెలాయించే టాటా ట్రస్ట్ అధికారం ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న. టాటా గ్రూప్ భవిష్యత్తు నాయకులు ఎవరు అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. తర్వాతి తరం లీడర్స్ నిశ్శబ్దంగా తమను తాము తయారు చేసుకుంటున్నారు.

టాటా గ్రూప్ తర్వాతి తరం నాయకుల్లో రతన్ టాటా సోదరుడు నోయెల్ నావల్ టాటా పిల్లలు లేహ్, మాయ, నెవిల్లే ఉన్నారు. భారతదేశంలోని ఇతర ప్రముఖ వ్యాపార కుటుంబాల్లా ఈ యువ టాటాలు వెంటనే నిర్వహణ బాధ్యతల్లోకి రాలేదు. వారు తమ స్వంత కృషి, అంకితభావం ద్వారా తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నారు. సంస్థ మేనేజ్‌మెంట్ కోసం వ్యక్తిగతంగా కష్టపడుతున్నారు. అలాగే టాటా ట్రస్ట్ నిర్వహణ నోయెల్ నావల్ టాటా నియంత్రణలోకి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ట్రస్టీలు ఎన్నుకోవలసి ఉంటుంది.

ఇక నోయెల్ నావల్ ముగ్గురి పిల్లల్లో లెహ్ టాటా స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లోని IE బిజినెస్ స్కూల్ నుండి మార్కెటింగ్‌లో మాస్టర్స్ పట్టా పొందారు. తాజ్ హోటల్స్ రిసార్ట్స్ అండ్ ప్యాలెస్‌లో అసిస్టెంట్ సేల్స్ మేనేజర్‌గా టాటా గ్రూప్‌లో చేరారు. ప్రస్తుతం ది ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (IHCL)లో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు.

చిన్న కుమార్తె మాయ టాటా టాటా క్యాపిటల్‌లో తన వృత్తిని ప్రారంభించింది, టాటా గ్రూప్ ప్రముఖ ఆర్థిక సేవల సంస్థలో విశ్లేషకురాలిగా పని చేస్తోంది. నెవిల్లే టాటా తన తండ్రి స్థాపించిన రిటైల్ చైన్ ట్రెండ్‌లో తన వృత్తిని ప్రారంభించాడు. నోయెల్‌కు ముగ్గురు పిల్లలు కంపెనీలలో బోర్డు స్థానాల్లో చేరవచ్చని కొందరు చెబుతున్నారు. ఈ ముగ్గురూ వివిధ టాటా ఆపరేటింగ్ కంపెనీలలో వివిధ పదవులు నిర్వహిస్తున్నారు.

1991లో టాటా గ్రూప్‌ ఛైర్మన్‌గా రతన్ టాటా బాధ్యతలు చేపట్టారు. ఆయన నాయకత్వంలో 1996లో టాటా టెలిసర్వీసెస్ ప్రారంభించడం, 2004లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్.. ఇలా ఎన్నో మైలురాళ్లను అధిరోహించారు. 2012లో చైర్మన్ పదవి నుంచి వైదొలిగినప్పటికీ, టాటా, టాటా సన్స్, టాటా ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా కెమికల్స్‌ల గౌరవ ఛైర్మన్‌గా ఉన్నారు. నిర్ణయాల్లో కీలకపాత్ర పోషించారు.

Whats_app_banner