లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే బ్యాంకులు ఏం చేస్తాయి? ఫ్యామిలీ దగ్గర డబ్బులు వసూలు చేస్తాయా?
Loan Rules : వివిధ ఆర్థిక అవసరాల కోసం కొన్నిసార్లు బ్యాంకుల నుంచి లోన్ తీసుకుంటుంటారు. లోన్ పూర్తికాకముందే కొందరు మరణిస్తారు. ఇలాంటి సమయంలో రుణం ఎవరు తీర్చాలి? ఏ లోన్‌లో ఎలాంటి రూల్స్ ఉన్నాయి?
రుణం తీసుకోవడం అనేది కామన్ విషయం. ఇల్లు, కారు, పర్సనల్ లోన్.. ఇలా చాలా అంశాల్లో లోన్ కోసం చూస్తుంటారు. లోన్ మీద మీకు అవసరమైన అన్ని వస్తువులను కొనుగోలు చేయవచ్చు. కానీ మీరు రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండాలి. అవసరాలకు అనుగుణంగా లోన్ ఎంచుకోవచ్చు. నెలవారీ ఈఎంఐల రూపంలో చెల్లించుకోవచ్చు. అయితే లోన్ తీసుకున్నాక.. రుణగ్రహీత మరణిస్తే దానికి ఎవరు చెల్లించాలి? దానికి సంబంధించిన సమాచారం తెలుసుకుందాం..
నిజానికి వేర్వేరు రుణాలు వేర్వేరు విధానాలు, నియమాలతో ఉంటాయి. కొన్నిసార్లు రుణగ్రహీత వారసుడు లేదా సహ రుణగ్రహీత బకాయిలు చెల్లించాలి. లోన్ ఆధారంగా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నిబంధనల ప్రకారం చెల్లింపును ఏర్పాటు చేస్తాయి.
గృహ రుణంలో బ్యాంకు ఇంటి ఆస్తిని తనఖాగా ఉంచుతుంది. రుణగ్రహీత మరణిస్తే బాకీ ఉన్న రుణాన్ని కూడా రుణగ్రహీత లేదా కుటుంబ వారసుడు చెల్లించాలి. ఆస్తిని విక్రయించడం ద్వారా రుణాన్ని తిరిగి చెల్లించే అవకాశం కూడా ఇస్తారు. చాలా బ్యాంకులు గృహ రుణ బీమాను అందిస్తున్నాయి. రుణగ్రహీత మరణిస్తే మిగిలిన మొత్తాన్ని బీమా క్లెయిమ్ ద్వారా తిరిగి చెల్లిస్తారు.
కారు లోన్‍లో రుణం తిరిగి చెల్లించకుండానే రుణగ్రహీత మరణిస్తే.. అతడి కుటుంబాన్ని ముందుగా కారు రుణాన్ని చెల్లించమని కోరతారు. కుటుంబ సభ్యులు దగ్గర లేకుంటే.. కారును అమ్మి రుణం చెల్లించాలని చెబుతారు.
అయితే పర్సనల్ లోన్ విషయంలో ఈ రూల్స్ భిన్నంగా ఉంటాయి. వ్యక్తిగత రుణం అధిక రిస్క్ లోన్. వ్యక్తిగత రుణాలతో పాటు ఇందులో క్రెడిట్ కార్డ్ రుణాలు ఉంటాయి. రుణగ్రహీత మరణిస్తే రుణాన్ని తిరిగి చెల్లించే బాధ్యత వారసుడికి లేదా మూడో పక్షానికి బదిలీ చేయరు. వారసుడు, కుటుంబ సభ్యులను లోన్ తీర్చమని అడగలేవు. ఒకవేళ సహ రుణగ్రహీత ఉంటే.. అడుగుతారు. లేదంటే ఈ రుణాన్ని బ్యాంకు ఎన్‌పీఏగా ప్రకటిస్తుంది.
చాలా మంది రుణగ్రహీత తమ లోన్ భారాన్ని వారసులకు బదిలీ కాకుండా ఉండేందుకు ఒక ప్రణాళికను పాటిస్తారు. అది ఏంటంటే.. రుణం తీసుకునేటప్పుడు రుణగ్రహీత తప్పనిసరిగా బీమా చేయాలి. ఇలా చేయడం ద్వారా వ్యక్తి మరణించిన తర్వాత రుణగ్రహీత కుటుంబం రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. బీమా కంపెనీ నుంచి రికవరీ చేసుకుంటారు. ప్రతి బ్యాంకుకు రుణ బీమా సౌకర్యం ఉంటుంది. అనారోగ్యం, గాయం, మరణం వంటి అనుకోని పరిస్థితుల్లో రుణాన్ని తిరిగి చెల్లించేందుకు బీమా సాయపడుతుంది.
టాపిక్